సౌకుమార్యంబును, సరసతయును,
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత
కల్మషత్వంబును, గౌరవంబు
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు
గారుణ్యమును, సత్యసారతయును
ధర్మమయ క్రియా తత్పరత్వంబును
గీర్తి ధనార్జన క్రీడనంబు
గలిగి జనుల నేల గాని, యెన్నండును
నొరుల గొల్చి తిరుగ వెరవు లేని
యట్టి నీవు విరటు నెట్టి చందంబున
ననుచరించు వాడ వధిప! చెపుమ. '
ఆంధ్రమహాభారతము విరాటపర్వము లోని యీ పద్యంలో ధర్మరాజు యొక్క గుణాలను వివరించడం జరిగింది.
అజ్ఞాతవాసాన్ని విరాటరాజు కొలువులో గడపడానికి నిశ్చయించుకొన్న తరువాత, అర్జునుడు అన్నగారైన ధర్మరాజు వైపు చూసాడు. ఆ చూపులో అన్నగారి మీద గౌరవము ఒక వైపు, ఒకరి సేవలను అందుకొనడమే కానీ, ఒకరిని సేవించడము తెలియని అన్నగారు, విరాటరాజుని యే రకంగా సేవించ గలుగుతాడనే విషాదం ఇంకొకవైపు నెలకొని ఉంది. ధర్మరాజులో అర్జునుడు చూసిన ఆ విశిష్ట గుణాలు యేమిటి?
ధర్మరాజుకి చక్కని రూపం, అభిమాన వైభవం, సుకుమారత్వం, సరసత్వం, మృదుత్వం, అధికారం యొక్క అతిశయం, దోషరాహిత్యం, గౌరవం, అంతరింద్రియ నిగ్రహం (శాంతి), బహిరింద్రియనిగ్రహం (దాంతి), త్యాగం, భోగం, కరుణ, సత్యము, ధార్మికంగా పనులు చేయడం, కీర్తి అనే ధనాన్ని సంపాదించడం అనే గొప్ప గుణా లున్నాయి.
మొత్తం పదహారు గుణాలు. చంద్రునిలో పదహారు కళ లున్నాయి. చంద్రునిలోని కళలకు హానివృద్ధులు ఉన్నాయి. కానీ, చంద్రవంశానికి చెందిన ధర్మరాజులో ఇవి నిలకడగా అతని సహజ ప్రవృత్తిలో భాగంగా ఉన్నాయి. షోడశగుణపూర్ణుడయిన తన అన్నగారు ఒక సామాన్యమైన రాజుని సేవించవలసివస్తున్నదని అర్జునుని బాధ.
No comments:
Post a Comment