సీతం దెచ్చిన రాఘవుం డిటకు వచ్చెం గోపియై చాపియై
సీతాదేవియు రాద రాఘవునిఁ దెచ్చెన్నాగఁ దావచ్చినన్
సీతాదేవియుఁ బ్రార్థనావివశదాసీభూతయై యుండెడున్.
రావణుని కొడుకు ఇంద్రజిత్తు మహాశస్త్రాస్త్రాలు సంపాదించినవాడు. మాయాయుద్ధవిద్యావిశారదుడు. వానరసైన్యంతో, రామలక్ష్మణులతో యుద్ధం చేస్తున్నాడు. రాముడిని చూసిన తరువాత, తన తండ్రి రావణుడు చేసిన పని, దాని మూలంగా వచ్చిన యుద్ధాన్ని తలచుకొని, మనస్సులో ఈ విధంగా ఊహించుకొన్నాడు.
" నా తండ్రి అనవసరంగా సీతను లంకకు తీసుకొని వచ్చాడు. అదే నేనైతే రాముడిని తీసుకొచ్చేవాడిని. సీతను తీసుకొని రావటం మూలాన, కోపంతో రాముడు ధనుర్బాణాలు ధరించి ఇంతదూరం వచ్చాడు. దానికి భిన్నంగా రాముడిని తెచ్చినట్లైతే, సీత ఇక్కడకు వచ్చియుండగలిగేది కాదు. ఒకవేళ వచ్చినా, రాముడిని విడిచిపెట్టమని ఒక దాసి లాగా వేడుకొంటూ ఉండేది. "
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండములోని ఈ పద్యంలో బహిర్గతమైన ఇంద్రజిత్తు మనస్స్వభావం మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలకు విశ్లేషింపదగిన ఒక చక్కని అంశం.
ఇంద్రజిత్తు మహావీరుడు. అందులో సందేహం లేదు. అయితే, అతని శౌర్యంలో మాయావిద్యల ప్రాగల్భ్యం యెక్కువ. దానితో, అతడు తాను అజేయుడి ననుకుంటాడు. ఖరదూషణాదులను, వారి సైన్యాన్ని త్రుటిలో భస్మీభూతం చేయగలిగిన మహాధానుష్కుడైన రాముని గురించి విన్న తరువాత కూడా, రాముడిని తాను లంకకు తేగలననుకోవడం, అతని ఆలోచనాశక్తిలో లోపమన్నా అయిఉండాలి, లేదా, తనకు తాను యెక్కువగా ఉహించుకుంటూనైనా ఉండాలి. ఎదుటివారి శక్తిసామర్థ్యాలను అంచనా వేయలేని, తెలిసినా దానిని లెక్కసేయని మనస్తత్వమున్న వారిని మనం లోకంలో చూస్తూ ఉంటాము. ఈ పద్యంలోని ఇంద్రజిత్తు మనోభావాలు ఆ రకంగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment