సచ్ఛోత్రియులు ననూచానులు సోమ పీ
థులు నైన కులము పెద్దల దలంచి
రాజమాన్యుడు సత్యరతుడు వినిర్మలా
చారవంతుడునైన జనకు దలచి
భాగ్యసంపద బుణ్యపతిదేవతలలోన
నెన్నంగ దగియెడు నన్ను దలచి
వేదశాస్త్ర పురాణ విద్యానిరూఢులై
వాసికెక్కిన తోడివారి దలచి
చెడ్డయింటి చెదారమై శివుని కరుణ
నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్ను దలంచి
పదియునార్వత్సరంబుల భార్య దలచి
గోరతనములు మానురా ! కొడుకు గుఱ్ఱ ||
గోరతనములు = చెడు నడతలు
ఈ పద్యం, భారతీయ కుటుంబ వ్యవస్థలో తల్లికి ఉన్న రెండు కోణాలను ఆవిష్కరిస్తుంది. మొదటిది, తల్లికి తన సంతానంపై న అపారమైన ప్రేమ. రెండవది, పిల్లలను మంచివారిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత. అయితే, తల్లి ప్రేమ అవధులు దాటి, ఆమె బాధ్యతను విస్మరింపజేస్తే, దుష్పరిణామాలకు దారితీస్తుంది.
గుణనిధి విషయంలో జరిగింది ఇదే. గుణనిధి భ్రష్టత్వానికి ఒక రకంగా తల్లి కూడా కారణమే. కొడుకు చేసిన తప్పులన్నిటినీ తండ్రికి తెలియకుండా దాచిపెట్టింది. పరిస్థితి చేయి దాటిన తరువాత, మారతాడేమోననే ఆశతో, చివరి ప్రయత్నంగా కొడుక్కి సుద్దులు చెబుతున్నది.
గుణనిధిని తల్లి " కొడుకు కుఱ్ఱ " అని పిలిచింది. అంటే ' వయసులో ఉన్న నా తండ్రీ ! అని అర్థం. ' చేతికి వచ్చిన కొడుకువి, కానీ చేతికి అందకుండా ఉన్నావు ' అని వ్యంగ్యం. ' అది ఆమె మితిమీరిన ప్రేమను, అదుపులో పెట్టలేని నిస్సహాయతను ధ్వనిస్తున్నది. ఇక ఆ తల్లి ఏమి చెబుతున్నదో విందామా !
" ఒరే నాయనా ! మన వంశంలో అందరూ శ్రోత్రియులు, వేదవేదాంగవేత్తలు, యజ్ఞాలు చేసి సోమయాజులైన వారున్నారురా. అటువంటి, మన పెద్దవాళ్ళని తలచుకొనైనా ఈ తిరుగుళ్ళు మానుకోరా. మీ నాన్న, రాజుగారి గౌరవాదరాలు పొందుతున్నవాడు, సత్యసంధుడు, కల్లాకపటం తెలియనివాడు. మీ నాన్న ప్రతిష్ఠను చూసైనా ఈ అల్లరి పనులు మానుకోరా! ఎప్పుడూ భర్తయే దైవం అని భావించే భాగ్యశాలిని నన్ను చూసైనా మారరా. నాన్నా! ప్రక్క ఇంటి పిల్లలను చూడు. అప్పుడే వేదవేదాంగాలు, పురాణాలు, సమస్తశాస్త్రాలలోను ఏ రకంగా పాండిత్యం సంపాదించారో! వాళ్ళను చూసైనా నీ బుద్ధి మార్చుకోరా. వరప్రసాదివి, ఒక్కగా నొక్క కొడుకువి, శివుని అనుగ్రహంతో పుట్టినవాడివి. ఇదిగో ఈ రకంగా చెత్త ఇంటి చెదారమయ్యావు. ఒంటి మీదికి ఇరవై అయిదేళ్ళు వచ్చిపడ్డాయి. నీకు తోడు పదహారేళ్ళ నీ భార్య ఒకత్తె. బంగారంలాంటి పిల్ల. దాని ముఖం చూసైనా నీ చెడ్డ పనులు మానుకోరా. ఇప్పటికైనా బాధ్యత తెలుసుకోకపోతే ఎలారా! "
చాలామంది ఇళ్ళలో జరిగే తతంగం ఇదే. తండ్రి భయం ఉన్న పిల్లలు ఎక్కి వస్తారు, తల్లి వెనకేసుకొచ్చిన పిల్లలు పాడయిపోతారు. భయమంటే, ప్రేమ, గౌరవంతో కూడిన భయం. వర్తమాన సమాజంలో ఈ అభినవ గుణనిధులను చాలామందిని చూస్తుంటాము. పిల్లలకు తల్లి ప్రేమ చవి చూపించాలి గానీ, గారాబం చేసి పాడుచేయకూడదు.
తల్లి మితిమీరిన గారాబాన్ని, పాడయిపోయిన కొడుకును చూసి ఆమె పడే మానసిక క్షోభను, కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని కాశీఖండము కావ్యం చతుర్థాశ్వాసంలో ఉంది.
భాష విషయంలో సహజత్వం కోసం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారి ' పద్యకవితా పరిచయం-1 ' గ్రంథాన్ని పరిగణనలోకి తీసుకొన్నానని చెప్పడానికి ఏ మాత్రం సంశయించడం లేదు. గురువుగారికి నమస్కారములు.
No comments:
Post a Comment