చలువ వెన్నెలచాలొ మలయు నెండలవాలొ యగ్గిమంటలడాలొ నిగ్గుచూపు
ప్రామిన్కులచివళ్ళొ బహుళసృష్టిమొదళ్ళొ యచ్చతెల్వికరళ్ళొ యసలుమూర్తి
తెఱగంట్లహాళికో దితిజాళిమోళికో పట్టిన కేళికో వచ్చు నటన
ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్ర హృదయ
మందొ తన దహరాకాశమందొ యైన
చిత్తు నానందమును మించు సత్తొకండు
జనపతికరస్థ మగు పాయసమునఁ జొచ్చె.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాలకాండము, అవతార ఖండము లోనిది.
" పాలకడలి తరగలో, లక్ష్మీదేవి వక్షస్థలంలో, ఆదిశేషుని పొలుసులో తూగులాడేటటువంటి ఒక పానుపు, చల్లని వెన్నెల కాంతిరేఖో, వ్యాపించే ఎండలవాలో, మంటలను కురిపించే తీక్ష్ణమైన కాంతో అయినటువంటి ఉత్కృష్టమైన తేజమొకటి, అవి వేదాల చివరలో, అనేకప్రాణుల సృష్టి మొదళ్ళో, అచ్చలెలివి కరళ్ళో అయినటువంటి రూపమొకటి, దేవతలను రక్షించటానికో, రాక్షస సంహారానికో, తలపెట్టిన ఆటకో వచ్చేటటువంటి నటుడొకడు, ఇల్లు వైకుంఠంలోనో, మునీశ్వరుల హృదయాలలోనో, లేక తన హృదయాకాశంలోనో, అన్నట్లు జ్ఞానాన్ని, ఆనందాన్ని మించిన సత్యస్వరూప మొకడు, దశరథ మహారాజు చేతిలోని పాయసంలో ప్రవేశించాడు. "
ఈ పద్యంలో అవతారమెత్తబోతున్న శ్రీ మహావిష్ణువు వర్ణన చేశారు విశ్వనాథ. పాలకడలిలో, శేషతల్పంలో, లక్ష్మీ దేవి వక్షస్థలంలో శయనించేవాడు విష్ణువు. సూర్యచంద్రాగ్నులు ఆయన నేత్రాలు. వేదాల చివరలు ఉపనిషత్తులు. శ్రీ మహావిష్ణువు వేదస్వరూపుడు. ఉపనిషత్తుల సారం. విష్ణువు పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపం అనేకమవ్వాలనుకొన్నది. అదే సృష్టికి మొదలు. పరబ్రహ్మస్వరూపమైన శ్రీ మహావిష్ణువు శుద్ధజ్ఞానానందరూపం. సచ్చిదానందరూపం. ఆయన శిష్టరక్షణకో, దుష్టశిక్షణకో, లేక క్రీడార్థమో అవతారాలెత్తుతాడు. ఆయన భక్తుల హృదయాల్లో కొలువుంటాడు.
విశ్వనాథ, కల్పవృక్షావతారికలో, కొందరు ప్రాచీనాంధ్ర మహాకవులను తన గురువులుగా భావించారు. ఈ పద్యంలోని వర్ణనలో, అందులో ఒకరైన తెనాలి రామకృష్ణుని ఛాయలు కనిపిస్తూనే, మహాకవి స్వతంత్ర వర్ణనాచాతుర్యం స్పష్టంగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment