అవివేకం బగునేమొ నే నేఱుఁగ దోషాచారుఁడన్ గాను ని
న్నవానించెడునంత దుష్టమతిఁగా నస్మత్పురాభక్తి నీ
వవలోకింపుము నీకు నీడవలెఁ దోడైతింగదా సర్వమౌ
వ్యవసాయంబున నంత దాఁచుకొని తా నన్నాళ్ళులెట్లుండనౌ.
కిష్కింధాపురి దుర్గద్వారం దగ్గరకు వచ్చి, యుద్ధానికి రమ్మని రంకెలు పెడుతున్న దుందుభిని వెంబడించాడు వాలి. అన్నతో పాటు సుగ్రీవుడు, మంత్రులందరూ వెళ్ళారు. పరుగెత్తుకొని పోయిన దుందుభి ఒక కొండబిలంలో దూరాడు. దుందుభిని చంపటానికి వాలి కూడా వాడితో పాటు కొండబిలం లోనికి వెళ్ళాడు. వెళ్తూ, బిలద్వారం దగ్గర సుగ్రీవుణ్ణి ఉండమన్నాడు. సుగ్రీవుడు బిలద్వారం దగ్గర కళ్ళలో వత్తులు వేసుకొని, రాత్రనక పగలనక కాపలా కాస్తూ, ఒక సంవత్సరం పాటు అక్కడే ఉన్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు బిలంలో నుండి వికృతమైన ఆర్తనాదాలతో పాటు, నెత్తురుటేరులు కనిపించాయి. సుగ్రీవుడికి ఏం చేయాలో తోచలేదు. వాలిని దుందుభి చంపాడేమోనని అనుకొన్న సుగ్రీవుడు, రక్కసి మూకలు ఊరిమీద పడతారేమో నన్న భయంతో, బిలద్వారాన్ని, తొలగించటానికి వీలులేని ఒక పెద్ద రాతితో మూసి, నగరానికి తిరిగివచ్చాడు. అన్న మరణించాడన్న దుఃఖంతో ఉన్న సుగ్రీవుడుని మంత్రులు ఓదార్చి, రాజ్యం అరాచకం కాకుండా ఉండటానికి అతడిని కీశరాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేశారు.
ఇలా ఉందగా, ఒక రోజు హఠాత్తుగా వాలి ప్రత్యక్షమయ్యాడు. సుగ్రీవుడు వణికిపోతూ, సిం హాసనం నుండి దిగి అతడికి ప్రణామం చేశాడు. వాలి, అదేమీ పట్టించుకోకుండా, సుగ్రీవుని మాటలేవీ వినకుండా, అతడిని కాలితో ప్రక్కకు తోసేసాడు. సుగ్రీవుడు తనను మన్నించమని వేడుకొంటూ వాలితో ఇలా అన్నాడు.
" అన్నా ! మహావీరుడవైన నీన్ను దుందుభి చంపాడనుకోవటం నా అవివేకమైతే కావచ్చు. కానీ, తెలిసి నేను ఏ అపరాధం చేయలేదు. ఇక నిన్ను అవమానించేటంతటి దుష్ఠబుద్ధినీ కాదు. నేను పూర్వం నీపై చూపించిన భక్తిభావం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అన్నీ పనుల్లోను, నీడలాగా నిన్ననుసరించుకొని ఉన్నాకదా ! లోపల ఏదో దుర్బుద్ధి పెట్టుకొని ఎవరైనా అన్నాళ్ళు అట్లా బయటపడకుండ ఉండటం సాధ్యమౌతుందా? "
పై వృత్తాంతమంతా సుగ్రీవుడు రామునికి పూసగుచ్చినట్లుగా చెప్పి, వాలి తనను నగర బహిష్కరణ చేయటమే కాకుండా, తన భార్య రుమను బలవంతంగా తీసుకొని పోవటాన్ని వివరించాడు.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింధా ఖండము, నూపుర ఖండములో ఉంది.
No comments:
Post a Comment