పండిత కీర్తనీయు డిరుబాసలదిట్ట రసజ్ఞమౌళి మా
రెండవవాడు సన్మతి ధురీణ కవిత్వకళోగ్ర కా
ర్తికేయుండును వేంకటేశ్వరు లహో! మఱి నా కవనం బిదెల్ల ధీ
శౌండుడు తత్పరీక్ష బడి సంకున బోసిన తీర్థమై చనున్.
శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో విశ్వనాథ సత్యనారాయణగారు తమ ఇద్దరు తమ్ములను గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ చెప్పటంలో కూడా మనకు బాగా పరిచయమున్న పురాణపాత్రలతో పోల్చి చెప్పారు. తన తమ్ములు, అటు శ్రీరాముని తమ్ములను, ఇటు ధర్మరాజు తమ్ములను పోలినవారట. తన మనసెరిగి పనులు చేస్తారు, చెప్పింది చెప్పినట్లు చేస్తారు. అందులో, చిన్నతమ్ముడు రామమూర్తికైతే, అన్నగారంటే దేవుడే.
ఇపుడీ పద్యంలో పెద్దతమ్ముడు విశ్వనాథ వేంకటేశ్వర్లుగారి గురించి చెప్పారు. అసలు విశ్వనాథవారి వాత్సల్యమంతా " మా రెండవవాడు " అన్న పిలుపులోనే ఉంది. ఇది పిలిచినవారికి, పిలిపించుకొన్న వారికి, అనుభవైకవేద్యం. ఇక వేంకటేశ్వర్లుగారు ఎటువంటివాడు?
పండితులచే కీర్తింపబడేవాడు. అంటే మహాపండితు డయ్యుండాలి కదా! సంస్కృతాంధ్రాల్లో మంచి పట్టున్నవాడు. ఇక ఆయన రసహృదయమంటారా! అది అవధులు లేనిది. వీటికి తోడు మంచి మనసున్నవాడు. కవితాప్రపంచాన్ని మోస్తున్న కార్తికేయుడు. కవితాసృష్టి కవి చేస్తే, దానిని భరించి, రక్షించేవాడు రసజ్ఞుడైన పాఠకుడు. కృత్తికా నక్షత్రం అతి తీక్షణమైనది. కాబట్టి కార్తికేయుడు అనడంలో విశ్వనాథ వేంకటేశ్వర్లుగారి సునిశిత విమర్శనా దృష్టి వెల్లడవుతున్నది. విశ్వనాథ వేంకటేశ్వర్లుగారు తమ బుద్ధినైశిత్యంతో, అన్నగారి కవిత్వాన్ని విమర్శనాదృష్టితో పరిశీలించేవారు. శంఖంలో పోస్తేనే గాని తీర్థం కాదన్నట్లు, తమ్ముడు వేంకటేశ్వర్లు పరీక్షకు నిలబడితే గాని అది పండితపామరయోగ్యం కాదని విశ్వనాథ సత్యనారాయణగారి దృఢవిశ్వాసం. అన్నగారికి తమ్ముడి బుద్ధినైశిత్యంపై, విమర్శనాసామర్థ్యంపై అంత గట్టి నమ్మకం.
విశ్వనాథవారికి తమ్ములుగా పుట్టడమే ఒక అదృష్టమైతే, వారి ప్రతిభావిశేషాలను కొంతకు కొంత పుణికిపుచ్చుకొని వారి మెప్పు పొందటం ఎంతైనా పూర్వజన్మవిశేషం కదా!
No comments:
Post a Comment