దర్శనం బిచ్చె నెద్దాని గోమటి క్రొత్త
పొడచూపనేతెంచి భూభుజునకు
దనకిచ్చె నెద్దాని ధారాంబుపూర్వంబు
పుణ్యకాలమునాడు భూమిభర్త
దానిచ్చె నెద్దాని ధర్మగేహినియైన
సోమిదమ్మకు మనఃప్రేమ మలర
దఱి చూచి యిచ్చెనెద్దాని బట్టికి దల్లి
జూదమాడిన పైడి సుట్టికొనిన
నట్టి నవరత్నమయ మంగుళీయ
కము యజ్ఞావభృథ పుణ్య కర్మసాక్షి
వీటిలో నొక జూదరి వ్రేల నుండ
జూచె గనుఱెప్ప వెట్టక సోమయాజి.
గుణనిధి తండ్రి యజ్ఞదత్తుడు వీధి వెంట పోతున్నాడు. ఆయన కొక మనిషి ఎదురయ్యాడు. వాడు జూదరి. వాడు చేతివ్రేలి కొక ఉంగరం పెట్టుకొన్నాడు. అది చూడగానే సోమయాజులుగారికి ఠక్కున ఒక సంగతి గుర్తుకొచ్చింది. ' అరే ! ఇది నాది కదా ! " వీడి దగ్గర కెట్లావచ్చిందనుకొన్నాడు. ఆ ఉంగరం చేతులు మారి జూదరి చేతికొచ్చిన విశేషాలన్నింటినీ పొదిగాడు శ్రీనాథుడీ పద్యంలో.
కాంపిల్యపురంలో ఒక కోమటి వ్యాపారి ఉన్నాడు. వ్యాపారులు అధికారులను సంతోషపెట్టడం సహజం. మొదటిసారిగా ఈ వ్యాపారి రాజుగారిని దర్శించటానికి వెళ్ళి యీ రత్నాల ఉంగరాన్ని ఆయనకు కానుకగా బహూకరించాడు. ఆ ఉంగరాన్ని ఒకానొక పర్వదినంలో రాజుగారు యీ సోమయాజికి దానం చేశాడు. సోమయాజి దాన్ని భద్రంగా తీసుకెళ్ళి, ప్రేమతో భార్య కిచ్చాడు. ఆ తల్లి ఏం చేసిందంటే, జూదంలో ఓడిపోయిన సొమ్ము చెల్లించమని ఇంటిమీద దొమ్మీకి వస్తే, పుత్రప్రేమతో, ఆ సొమ్మును చెల్లించడానికి కొడుక్కిచ్చింది. అటువంటి రత్నాలను పొదిగిన ఉంగరాన్ని ఒక జూదరి చేతివ్రేలికి ఉండటాన్ని చూసి, సోమయాజి రెప్పలు వాల్చకుండా వాడిని చూస్తూనే ఉన్నాడు.
ఈ పద్యంలో సంప్రదాయ విశేషాలు, లౌకిక వ్యవహారాలు చాలా ఉన్నాయి.
మొదటిది. వ్యాపారులు అధికారుల కటాక్షవీక్షణాల కోసం పాకులాడటం అప్పటికీ ఇప్పటికీ ఒకటే. పర్వదినాన, జలధారతో దాన మివ్వడం ఒక సంప్రదాయం. అది బలి చక్రవర్తి కథలో చదివాం. ఏదన్నా విలువైన వస్తువు ఎవరన్నా ఇస్తే, దాన్ని భార్యకు ప్రేమతో ఇవ్వడం పరిపాటి. ఇక తండ్రికి తెలియకుండా, పిల్లల మీద వల్లమాలిన ప్రేమ చూపించే తల్లు లెందరో.
ఇంతకూ, ఆ రత్నాంగుళీయకం విశిష్టత ఏమిటి? అది యజ్ఞ పరిసమాప్తి చేసి అవభృధస్నానం చేసి వచ్చిన యజ్ఞదత్తుడికి రాజుగారు దానంగా ఇచ్చారు. అవభృధస్నానం అంటే యజ్ఞం పూర్తయిన తరువాత చేసే స్నానం. దీనిని బట్టి, ఆ ఉంగరం, ఎంత పవిత్రమైనదో, విలువైనదో తెలుస్తున్నది.
చివరగా, ఆ ఉంగరం ఏ విధంగా చేతులు మారిందనేది ' ఎద్దాని ' అనే పదంతో సూచించాడు కవిసార్వభౌముడు.
ఈ పద్యం శ్రీనాథుని కాశీఖండము, చతుర్థాశ్వాసం, గుణనిధి కథలో ఉంది.
No comments:
Post a Comment