వాగ్నేతృత్వము వృత్తిరీతి రసభావౌచిత్య శయ్యార్థ సం
లగ్నోత్యంచిత లక్షణ ధ్వని గుణాలంకారముల్ లేని నా
నగ్నోద్విగ్న కవిత్వ మెంచగ త్రయీనాదంబొ ఓంకారమో !
భగ్నారిధ్వజ ! వేదపుం గొసలొ నిన్ భాషింప ! విశ్వేశ్వరా !
' మా స్వామి ' లోని నాలుగవ పద్యమిది.
ఇందులో, మహాకవిత్వ లక్షణాలను చెబుతూ, అవి సంపూర్ణంగా తనలో ఉన్నా కూడా, వినయపూర్వకంగా, తన కవిత్వం విశ్వేశ్వరునికి నచ్చుతుందో లేదో ననే శంకను వెలిబుచ్చారు విశ్వనాథ.
" విశ్వేశ్వరా ! భాష మీద పట్టు, కావ్య వృత్తులు, శృంగారాది రసపోషణ, భావౌచిత్యం, శబ్దసౌందర్యం అర్థగాంభీర్యముల సమతూకం, కావ్యలక్షణాలు, ధ్వనిసౌరభం, కావ్య గుణాలు, అలంకారాలు మొదలైనవి లేని, ఉద్విగ్నతతో కూడిన నా శుష్కమైన కవిత్వం, నిన్ను అలరింప చేయటానికి, నిన్ను తెలుసుకోవటానికి, అదేమన్నా వేదఘోషా, ప్రణవనాదమా, ఉపనిషత్సారమా? "
మహాకవిత్వ సృష్టికి భాష మీద అధికారం ఉండాలి. కైశిక్యాది వృత్తి రీతులను పాటించాలి. శృంగారాది రసాలను చక్కగా పోషించాలి. భావౌచిత్యం ఉండాలి. శబ్దసౌందర్యం, అర్థగాంభీర్యం ఉండాలి. కావ్య లక్షణాలు పుష్కలంగా ఉండాలి. ధ్వనిసౌరభం గుబాళించాలి. ప్రసాదము, ఓజస్సు మొదలైన కావ్యగుణాలు, ఉపమ, రూపకాద్యలంకారాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సత్కావ్య మనిపించుకొంటుంది.
విశ్వనాథ గాఢప్రతిభుడు. బ్రాహ్మీమయమూర్తి. ధిషణాహంకార మున్నవాడు. అయినప్పటికీ, పరమేశ్వరుని యెదుట వినయసంపన్నుడు.
పరమేశ్వరస్తుతి పూర్వకమైన విశ్వేశ్వర శతకం లోని ప్రతి పద్యం, ప్రతి పదం ఎంతో సుందరంగా ఉన్నదనటంలో సందేహం లేదు.
No comments:
Post a Comment