శరధిలో మును మంథరమాఁడ బైడిప్పఁగుదురు చేసిన కూర్మరాజు
హేమాక్షుఁడను తుంగ నెగచి ముట్టియను బాతాళంబు గ్రుమ్మిన దట్టుపోత్రి
స్తంభమున సకలాంతర్యామితకు సాక్ష్యముగఁ జీల్చి వెలలిన మృగవిభుండు
విఱిచి పెరిగించుఁ దననేర్పు వెలయ క్షత్ర
జాతిఁ బోకార్చి వెలయింపఁ జాలుటకును
బరశుధనువులతో మూర్తి పట్టు వెలుఁగు
జనపతికరస్థ మగు పాయసమునఁ జొచ్చె.
దశరథుని అశ్వమేధ యాగం పరిసమాప్తి అయింది. యజ్ఞకుండంలో నుంచి ప్రాజాపత్యపురుషుడు పైకి వచ్చి ఒక పాయసపాత్రను దశరథుని చేతిలో ఉంచాడు. వశిష్ఠ మహర్షి యొక్క మంత్రబలం చేత, చూస్తున్నవారి కళ్ళు మిరిమిట్లు గొలిపేటట్లుగా, శ్రీమహావిష్ణువు యొక్క దివ్యతేజస్సు, ఆ పాయసపాత్రలో ప్రవేశించింది.
మహాకవి విశ్వనాథ, పాయసపాత్రలో ప్రవేశించిన శ్రీ మహావిష్ణువును, పై సీసపద్యంలో అత్యంత సుందరంగా వర్ణించారు.
" సోమకాసురుడు దొంగిలించుకొని పోయిన వేదసమూహాన్ని ఉద్ధరించి, సముద్రంలో అతడిని వెంబడించిన ఆదిమత్స్యము, అమృతం కోసం, మంథర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలకడలిని చిలికినప్పుడు, పై డిప్పను కుదురుగా చేసిన కూర్మరాజు, హిరణ్యాక్షుడనే తుంగదుంపను, ముట్టెతో కుమ్మి, పాతాళానికి తరిమిన యజ్ఞవరాహం, పిపీలికాది బ్రహ్మపర్యంతం తన అంతర్యామిత్వాన్ని చాటేందుకు, స్తంభంలో నుండి బయటికి వచ్చిన మృగరాజు, త్రివిక్రమావతారంలో పెరిగి పెరిగి, బలిదైత్యుని గర్వాన్ని అణచినటువంటి తన నేర్పు తెలిసేటట్లుగా, క్షత్రియవంశాన్ని సమూలంగా నాశనం చేసి కూడా, మరల క్షత్రియకులాన్ని ఉద్ధరించటానికా అన్నట్లు గండ్రగొడ్డలి, కోదండము పట్టుకొన్నటువంటి మూర్త్యమైన ఒక తేజస్సు, దశరథ మహారాజు చేతిలోని పాయసంలో ప్రవేశించింది. "
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, బాల కాండము, అవతార ఖండము లోనిది.
No comments:
Post a Comment