ఈ జీవుండు విచిత్రమౌ దినుసు నీవే సర్వమౌదంచు దా
నాజన్మంబుగ నమ్ముచుండియును మిథ్యాజ్ఞానమున్ వీడ డ
వ్యాజ ప్రేమను నీవ తోడ్పడి జగద్భ్రాంతిన్ దొలంగించి వే
ఱే జన్మం బిక నీక కావవలెనో శ్రీకాళహస్తీశ్వరా!
జీవుడు విచిత్రమైన దినుసు అన్నాడు కవి. దినుసు అంటే వస్తువు. నిజమే! మనిషి వస్తువు లాగానే ప్రవర్తిస్తున్నాడు గాని, తాను ఒక ఆత్మచైతన్యము కలిగినవాడననీ, వివేకముతో జీవితాన్ని పండించుకొనాలనీ అనుకొనడము లేదు. ఎందుకంటే, ఒక ప్రక్కన యీ జగత్తంతా శివమయమని ఆజన్మాంతము నమ్ముతూనే, చెబుతూనే, ఆ ఎరుకను నిలకడగా మనస్సులో నిలుపుకొని, ఆచరణలో మాత్రం పెట్టడము లేదు. అశాశ్వతమైన ధనము, గృహము, భార్య, పిల్లలు అనేటువంటి వాని వ్యామోహంలో పడుతున్నాడు. నమ్మేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. అంటే, మనోవాక్కాయకర్మలకు పొంతన లేదు. అందువల్ల, అది మిథ్యాజ్ఞానము.
మరి యీ మిథ్యాజ్ఞాన మనే తెర, మాయ, తొలగాలంటే, భగవంతుడు తన అవ్యాజమైన ప్రేమను జీవునిపై కురిపించాలి. భగవంతుని తోడ్పాటు ఉంటేనే గాని, యీ జగద్భ్రాంతి, యీ అశాశ్వతమైన ప్రపంచము మీద గల మోహము, తొలగదు. జగద్భ్రాంతి తొలగినపుడు, భగవద్భక్తి కలుగుతుంది. నిశ్చలమైన భక్తి వలన మోక్షప్రాప్తి కలుగుతుంది. అంటే, పునర్జన్మమంటూ ఉండదు.
ఈ పద్యము బ్రహ్మశ్రీ చెఱుకుపల్లి జమదగ్ని శర్మగారు రచించిన " త్రిశతి " అనే పద్యకావ్యము లోనిది. మూడు వందల పైచిలుకు పద్యాలున్న యీ కావ్యంలో, శ్రీ కాళహస్తీశ్వరా, జ్ఞాన సుమన శ్రీ కాళహస్తీశ్వరా! అనే రెండు మకుటాలు కనిపిస్తాయి. జమదగ్ని శర్మగారు కవిసమ్రాట్టుల శిష్యులు.
No comments:
Post a Comment