ఓ లలితాంగి ! యిందు సుఖముండు మృకండు కణాద గాధి వా
ధూలముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి ని
ష్కాళగళుండు నిర్యువతిగాత్రుడు నిర్ణిటలేక్షణుండు ని
ర్వ్యాళ విభూషణుండు నగు నంబర కేశుడనంగ బెంపునన్.
అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో పాటు దక్షిన దిక్కు అ ఉన్న మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడు. మాల్యవంతం గొప్పతనాన్ని గురించి లోపాముద్రకు చెప్పిన అగస్త్యుడు, ఇంకా కొన్ని విశేషాలను భార్యకు చెబుతున్నాడు.
" లోపాముద్రా ! మృకండుడు, కణాదుడు, గాధి, వాధూలుడు మొదలగు మహర్షులు ఇక్కడే ఉంటారు. ఇంకొక విషయం. మతంగ మహర్షి కూడా ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన గొప్పతనాన్ని ఏమిటో చెబుతాను విను. కంఠంలో హాలాహలాన్ని ధరించనివాడు, దేహంలో భార్యకు సగభాగం ఇవ్వనివాడు, నుదుట కన్నులేనివాడు, పాములు అలంకారంగా లేనివాడు అయి, వ్యోమకేశుడు శివుని అంతటివాడుగా కీర్తింపబడేవాడు యీ మతంగ మహాముని.
ఈ పద్యంలో వ్యతిరేకాలంకారం వాడబడింది. వ్యతిరేకాలంకారం అంటే ఉపమానం కంటే ఉపమేయం అధికంగా గమ్యమానమవుతుంది. ఇందులో అన్నీ ఉన్న శివునితో (ఉపమానం) ఏమీ లేని మతంగ మహర్షికి (ఉపమేయం) సామ్యం చెప్పడం, ఆ చెప్పటంలో మతంగమహర్షి మహత్వం వ్యక్తమవడం వల్ల వ్యతిరేకాలంకారం అని తెలియబడుతున్నది.
ఈ పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment