వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లే దిట్లు రా !
ఏదో లెక్కలు తేల్చుకో, మొఱటుతో నేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చినకాడి కమ్మెదను సుమ్మీ నిన్ను, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పైతొమ్మిదో పద్యం.
" విశ్వేశ్వరా ! మా ప్రస్తుత దారిద్ర్యానికి కారణం మీ దాతృత్వమో లేకపోతే మా తండ్రి దాతృత్వమో, అది మీ ఇద్దరి మధ్య నున్నట్టి వ్యవహారం. దానిలో నా బాధ్యత లేదు. మా తండ్రి మమ్మల్ని నీ కప్పగించి వెళ్ళాడు. మీ లావాదేవీలు మీరు తేల్చుకోండి. మనిద్దరి మధ్య లెక్కలేమన్నా ఉంటే తేల్చుకుందాం. ఇట్లా రా !. నా వంటి మూర్ఖుడితో ఎందుకు పంచాయతీ పెట్టుకుంటావు? నాకు ఒళ్ళు మండిందంటే, నిన్ను ఎంతో కొంతకు అమ్మిపారేస్తాను సుమా జాగ్రత్త ! "
విశ్వనాథ తండ్రి మహాదాత. పరమేశ్వరుని మీద అచంచలమైన భక్తిప్రపత్తు లున్నవాడు. అందుకే పిల్లలను ఆయన కప్పగించాడు. విశ్వనాథ ఆ భక్తిసంపదను వారసత్వంగా పుచ్చుకొన్నవాడు. పరమేశ్వరుని కృపాకటాక్షాలు సంపూర్ణంగా ఉన్నవాడు. అందుచేతనే, పరమేశ్వరదత్తమైన మహాకవిత్వ సృష్టి చేయగలుగుతున్నాడు. భౌతికజగత్తులో, తాను అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని పోగొట్టమని వేడుకొంటున్నాడు. ఆ చనువుతో, పరమేశ్వరుడు దయ చూపించని పక్షంలో, ఆయన మీద చెప్పిన, ఆయనకు అంకిత మివ్వవలసిన కవిత్వాన్ని ఏదో ఒక లెక్కకు అమ్మేస్తానంటున్నాడు.
ఆత్మాశ్రయకవిత్వంలో, భగవంతునికి భక్తునికి మధ్య నున్న అనుబంధం అనిర్వచనీయమైనది.
No comments:
Post a Comment