అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పణ్డితః.
శోకింపన్ దగనట్టి వారి కొరకై శోకించుచున్నావు ! హే
వాకంబేర్పడ బుద్ధివాదముల సంభాషించు చున్నావిటన్
నీకీ శోకము నొందగా దగదు విన్మీ ! యర్జునా ! పండితుల్
శోకం బందరు చచ్చినన్ బ్రతికినన్ సుంతైన ధాత్రీస్థలిన్.
ఈ శ్లోకం శ్రీమద్భగవద్గీతకు బీజం లాంటిదని యతీశ్వరులు శ్రీశ్రీశ్రీ విద్యాపరకాశనందగిరిస్వామివారు సెలవిచ్చారు. ఎందుకనగా, గీతాబోధ నిజంగా ఈ శ్లోకం నుండి ప్రారంభమౌతున్నది. విత్తనం మొలకెత్తి, మొక్కై, మహావృక్షమై శాఖోపశాఖలుగా నలు దిక్కులా విస్తరించునట్లు, గీతాబోధ మున్ముందు కర్మ, జ్ఞాన, ఆత్మసంయమన, భక్తి యోగాలుగా విస్తరిల్లి, పరమాత్ముని విభూతిని విశ్వమంతా ప్రసరింపజేసి, చివరకు మోక్షసన్యాసయోగంలో అద్వైత సిద్ధిని ప్రాపింపజేస్తున్నది.
శోకసంతప్తహృదయుడైన అర్జునుడికి భగవానుడు చెబుతున్నాడు.
" ఓ అర్జునా ! నీవు శోకింపదగనివారికై శోకించావు. పైగా, పండితులు మాట్లాడినట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. జ్ఞానులైనవారు మరణించినవారిని గురించి గాని, బ్రతియున్న వారి గురించి గాని దుఖింపరు. "
ఈ ప్రపంచములోని ప్రతి పదార్థం ఐదింటితో ఏర్పడుతున్నది. అవి అస్తి, భాతి, ప్రియ, నామ, రూపాలు. అస్తి (సత్) అంటే ఉండటం, భాతి (చిత్) అంటే ప్రకాశించటం, ప్రియ (ఆనందం) అంటే అవధులు లేని ప్రేమ. ఈ మొదటి మూడు, అనగా సచ్చిదానందములు భగవంతుని స్వభావములు. చివరి రెండు, అనగా, నామ రూపములు గుణాలు. అవి మానవుడు తాను కల్పించుకొన్నవి. కావున, అశాశ్వతము, అస్థిరమైన శరీరం యొక్క క్షీణత, నశించటం గురించి జ్ఞానసంపన్నులు దుఃఖించరని భగవానుడు చెబుతున్నాడు. దుఃఖింప కూడని దానికై దుఃఖించేవారు ' ప్రజ్ఞావాదాంశ్చ భాషణులు ' అంటున్నాడు. అంటే బుద్ధిని ఆధారంగా చేసుకొని మాట్లాడేవారు. బుద్ధికి పరిమితులున్నాయి. అది కొంతదూరం మాత్రమే పోగలదు. అది ఆత్మతత్త్వాన్ని తెలుసుకోలేదు. అందుచేత, బుద్ధివాదం చేయవద్దంటున్నాడు భగవానుడు.
సామాన్య పరిభాషలో ' పండితుడు ' అంటే సమస్తశాస్త్రాలను చదివినవాడు, తెలిసినవాడు, అని అర్థం. కానీ, ఇక్కడ, పండితు డనగా జ్ఞాని, ద్వంద్వాలకు అతీతుడు.
ఇది సాంఖ్యయోగం లోని పదకొండవ శ్లోకం.
No comments:
Post a Comment