టెగచునదలింపు విని తలయెత్తి చూచె
నరఁటి పూ బొమ్మలకు పైని దొరలవోని
డిప్పలైనట్టి వగు కనుఱెప్పలార్చి.
కడు గుప్త్యర్థము మేను కుంచుకొనియున్ గద్దింపుమాటల్ వినం
బడి రెట్టింపుగ నయ్యె మారుతి పురః పైశాచమూర్తిన్ గనం
బడెఁ దా నొక్కతె చెట్ట రాక్షసి సుధూమ్రంబైన మైచాయతోఁ
గడలం జాచినబాహువుల్ భ్రుకుటిలగ్న క్లిష్టధూమ్యాకృతిన్,
రక్కసి వానరేశ్వరుని ప్రౌఢియుశౌర్యము గుర్తుపట్టి యా
తక్కువరూపు గోపన పథంబునఁ జేసిన తెచ్చి కోలుగా
నిక్క మెఱింగి మోము హసనీయుగ సంగ్రసనంబు గాఁగఁదా
గ్రక్కెడు కోప ఖండములుగాఁ బరుషోగ్రవచస్సు లాడుచున్.
టక్కరికోఁతి! యూరక హఠాత్తుగ విన్న విరోధిమాటకున్
బొక్కు స్వభావమై తెలియఁబోకయ యింతకు నింతయైతివే
యెక్కడికోఁతి వీ చనుట యెక్కడి కేరియనుజ్ఞచేసి యీ
దిక్కున వచ్చినావు ప్రసృతి ప్రణిమీలన చాతురీచణా!
హనుమంతుడు లంకాపట్టణం లోని దుర్గం యొక్క ప్రథమద్వారం దాటాడు. ఆ పట్టణం యొక్క కట్టుదిట్టంగా ఉన్న రక్షణ వ్యవస్థను చూసి, కుముదుడు, అంగదుడు, సుగ్రీవుడు, సుషేణుడు, మైందద్వివిదులు, కుశపర్వ కేతుమాలులు, అతడు తప్ప ఇంకొకరు ఆ దుర్గం లోనికి ప్రవేశించటం సాధ్యపడదని అనుకొన్నాడు. ప్రథమ ప్రాకారం లోపల నున్నటువంటి ఇళ్ళను వెదకి, చింతాక్రాంతుడై ఒకచోట అల్పదేహంతో కూర్చున్నాడు.
ఇంతలో ' ఏవడురా నువ్వు? ' అనే అదలిస్తున్న మాట విని, అరటిపువ్వు బొమ్మల పైన దొరల వంటి డిప్పలైనట్టి కనురెప్పలను ఆర్పుతూ, తలయెత్తి చూశాడు.
ఆ గద్దింపు మాటలు వినపడేటప్పటికి, రహస్య సంచారం కోసం కుదించుకొన్న తన దేహం అమాంతంగా రెండింతలయింది. హనుమకు ఎదురుగా నగర రక్షణ చేస్తున్న ఒక పిశాచాకారం కనపడింది. అది ఎఱ్ఱదనాన్ని మించిన నలుపు రంగులో ఉంది. దాని చేతులెంత పొడ్గున్నాయంటే, అవి సముద్రపు అలల్ని తాకుతున్నాయి. ఆ రాక్షసి కౌటిల్యమంతా కేంద్రీకరించుకొని దట్టమైన పొగ ఆకారంలో ఉంది.
ఆ రాక్షసి, హనుమంతుడి దేహదారుఢ్యాన్ని, శౌర్యాన్ని అంచనా వేసింది. ఆ అల్పదేహం, రహస్యంగా సంచరించటం కోసం తెచ్చిపెట్టుకొన్న దేహమన్న యదార్థాన్ని గ్రహించింది. అగ్నికుండం వంటి పెద్ద నోటిని తెరిచి, నిప్పు కణికలను కక్కుతున్నట్లుగా, పరుషమైన మాటలను మాట్లాడింది.
" నువ్వు టక్కరి కోతివి. ఊరకే హఠాత్తుగా విన్న శత్రువుల అలికిడికి భయపడే స్వభావం ఉన్నదానివి, నీకు తెలియకుండానే ఇంతకు ఇంత పెరిగి పొయ్యావుటే? నువ్వెక్కడి కోతివి? ఎక్కడికి పోతున్నావు? ఎవరు పంపిస్తే ఇక్కడకొచ్చావు? "
హనుమంతుడు ఎలాగైతే బుద్ధివిశేషం కలవాడో, అలాగే నిత్యజాగృతుడు. అందుచేతనే, కాపలా కాస్తున్న రాక్షసి అదలింపు మాటలు వినపడగానే, తన దేహాన్ని పెంచి, రాక్షసిని ఎదుర్కొనటానికి సిద్ధపడ్డాడు.
రాక్షసి, హనుమంతుడిని ' టక్కరి కోతి ' అని సంబోధించి, ' ప్రసృతి ప్రణిమీలన చాతురీచణా ! ' అనే సంబోధనతో ముగించింది. అంటే, చారెడు దేహంగా కుదించుకొన గలిగిన చాతుర్యం కలవాడని అర్థం.
ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.
No comments:
Post a Comment