నిది సాగించె నెవండునేని యని యూహింపంగ నేలా యశ
స్సది వాంఛించెడు లోభి దాతవలెఁ గాడా? కాఁడు, ఔనా? యగున్
మది నీ కెక్కినయేని నా తపము సంబాళించు విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పది మూడవ పద్యం.
" విశ్వేశ్వరా ! ఎవరైనా ఒక కవి, పది పద్యాలు వ్రాసి, వానిని ఎవరికో ఒకరికి అంకిత మిచ్చి, వారిచ్చిన సొమ్మును పుచ్చుకొంటున్నారని, ఊహించటం, చులకనగా మాట్లాడటమెందుకు? లోకంలో కీర్తి కోసం ప్రాకులాడే వ్యక్తి, నిజానికి లోభి అయినా కూడా గొప్ప దాత లాగా చలామణి అవుతాడా? కాడు కదా! అవుతాడు. నీ మనస్సులో అతడి మీద దయ కలిగితే, తప్పకుండా అవుతాడు. అందువల్ల, నా తపస్సును పండించు. నీ అనుగ్రహం కలిగించు. "
దాతృత్వం ఒక సహజమైన గుణం. లోభి, కీర్తి కోసం, దాత వలె ప్రవర్తించినా, అది అతని సహజగుణం కాదు కాబట్టి అది ఎక్కువకాలం నిలబడదు. యశస్సు నార్జించే కృతిభర్త, సహజంగా రసజ్ఞుడైతే, కవిత్వాన్ని ఆదరించే వాడైతే, అది కృతికర్తకు, కృతిభర్తకు వన్నె తీసుకువస్తుంది. యశస్సు వంఛించే లోభి దాతగా మారి, కవులకు ఆదరణ లభించాలంటే, అది పరమేశ్వరుని చేతిలో ఉంది. లోభిని దాతగా మార్చాలి అనే మాట పరమేశ్వరుని మనస్సులో నాటుకోవాలి. అప్పుడు కవి యొక్క తపస్సు పండినట్లవుతుంది, ఆ కవిత్వానికి పరమేశ్వరానుగ్రం ఉన్నట్లవుతుంది.
కవులు, వారి కవిత్వాన్ని రాజులకు, సమాజంలో గౌరవ ప్రతిష్ఠ లున్నవారికి అంకితమివ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే, అది కవిత్వాన్ని అమ్ముకోవటమని అనుకొనేవాళ్ళూ లేకపోలేదు. తమ కావ్యాలను భగవదంకితం చేసిన పోతన లాంటి వారూ ఉన్నారు.
విశ్వనాథ, సంసారయాత్ర సాగించడానికి కొన్ని రచనలను అంకితం ఇచ్చి ఉండవచ్చు. సమాజంలో ఆదరణీయులైనవారికి ప్రేమాభిమానాలతో ఇచ్చినవీ ఉన్నాయి. వారి తపఃఫలమైన శ్రీమద్రామాయణ కల్పవృక్షము కావ్యాన్ని పరమేశ్వరార్పితం చేశారు.
No comments:
Post a Comment