ధరణిపు చక్క గట్టెదురు దక్కి పిఱుందును గాని యట్లుగా
నిరుగెలనం దగం గొలిచి యేమనునో, యెటు సూచునొక్కొ ! యె
వ్వారి దెస నెప్పు డే తలపు వచ్చునొ యీతని కంచు జూడ్కి సు
స్థిరముగ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్.
అజ్ఞాతవాసానికి సిద్ధమౌతున్న పాండవులకు, విరాటరాజు కొలువులో ఏ విధంగా మసలుకోవాలో సేవాధర్మాన్ని చెబుతున్నాడు ధౌమ్యుడు.
" రాజు కొలువు తీరినపుడు, మరీ ఎదురుగా రాజుకు కనపడేటట్లు ఉండకూడదు. అట్లాగని మరీ వెనుక వైపు ఉండకూడదు. ఏదో ఒక ప్రక్కన నిలబడి ఉండాలి. రాజుగారు ఏమీ చెబుతున్నారో శ్రద్ధగా వినాలి. రాజుగారి దృష్టి ఎటువైపుందో జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఎవరిని పిలుస్తారో అనే ఆలోచనతో రాజుగారి వైపు చూపు సారించాలి. ఇది రాజుగారి కొలువులో పాటించవలసిన నీతి. "
సేవకుడు శ్రద్ధగా రాజుగారి కదలికలను గమనించకుండా, ఎటువైపో చూస్తూ ఉంటే, అది రాజుగారి ప్రాధాన్యతను తగ్గించినట్లయి, సేవకుడి యొక్క అవిధేయతను సూచిస్తుంది అని ధౌమ్యుని భావన.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వము, ప్రథమాశ్వాసములో ఉంది.
No comments:
Post a Comment