త్ప్రాలేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతం,
బాలోలాగ్ర జటావనీఘటిత నాకౌకస్సరిత్కంబు, దే
హాలంకారిత లేలిహానము, వెలుంగర్చింతు విశ్వేశ్వరా !
విశ్వనాథ సత్యనారాయణగారి ' మా స్వామి ' లోని రెండవ పద్యమిది. మొదటి పద్యంలో, నిర్గుణ పరబ్రహ్మతత్త్వాన్ని సచ్చిదానంద రూపంగా, వెలుగుగా భావిస్తే, ఈ రెండవ పద్యంలో, ఆ నిర్గుణ పరబ్రహ్మతత్త్వం, సగుణాకారమైన శివునిలో ఎలా భాసిస్తున్నదో, పలు విశేషణాలతో వర్ణించారు.
" శివుని నివాసం కైలాసపర్వతసానువులు. కైలాసపర్వతం తెల్లని మంచుకొండ. అదొక వెలుగు ముద్ద. ఆయన వాహనం నందీశ్వరుడు తెల్లనివాడు. శివుని భార్య ప్రాలేయాచల కన్యక. ప్రాలేయాచలం అంటే హిమవత్పర్వతం. హిమవంతుని కూతురు పార్వతి. ఆమె వక్షస్థలం శివుని పానుపు. హిమవత్పర్వతం తెల్లనిది కదా ! ఆలోలాగ్ర జటావనీఘటిత నాకౌకస్సరిత్కంబు. స్వర్గలోకం నుండి క్రిందికి దిగివచ్చి, నురుగులు గ్రక్కుతూ, శివుని జటావనుల్లో సుడులు తిరుగుతున్న ఆకాశగంగ తెల్లనిది. దేహాలంకారిత లేలిహానము. లేలిహానము అంటే పాము. శివుని మెడలో నున్న మహాసర్పరాజం వాసుకి. వాసుకి శరీరవర్ణం తెలుపు.
శివుని పరంగా వాడిన విశేషణాలన్నీ తెల్లనివి, వెలుగును విరజిమ్మేవి. ఈ చిన్న వెలుగులన్నీ కలిసిన ఒక పెద్ద వెలుగు శివుడు. ఆ అఖండజ్యోతిస్వరూపాన్ని కొలుస్తానని మహాకవి అంటున్నారు.
No comments:
Post a Comment