నీవే దైవమ నేను భక్తుడను దండ్రీ ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుడఁ దండ్రీ ! నిన్నుఁ బండించెదన్
నా వైదగ్ధ్యము నీవ జూతు, కృప సంధానించు విశ్వేశ్వరా !
' మా స్వామి ' లోని మూడవ పద్యమిది.
కవులు రాజుల నాశ్రయించి, వారిని కీర్తించి, అగ్రహారాలు, ధనధాన్యాదులు, సత్కారాలు పొందుతారు. ఇది లోకసామాన్యమైన విషయం. లౌకికమైన సుఖజీవనానికి కావలసిన సంపదలను ఇచ్చే రాజులు, శాశ్వతానందాన్ని కలిగించే సంపదను ఇవ్వలేరు. అటువంటి శాశ్వతమైన సచ్చిదానందాన్ని ఇవ్వగల రాజు శివు డొక్కడే. అందుకనే, విశ్వనాథ, సత్కవిగా అటువంటి రాజైన శివుని వర్ణిస్తానంటున్నాడు. భక్తులకు కొంగు బంగారమైన దేవుడెవరన్నా ఉన్నారంటే అది శంకరుడే. ఆయన భక్తపరాధీనుడు. బోళాశంకరుడు. శంకరుని వంటి దైవం లేడని లోక ప్రతీతి. అందుకనే, కవి అటువంటి దైవాన్నే ధ్యానిస్తానంటున్నాడు. భూమిని నమ్ముకున్న రైతు, అందులో బంగారాన్ని పండిస్తాడు. ఇది లోకవ్యవహారం. అదే శివుడనే భూమిని నమ్ముకున్న భక్తుడు మోక్షమనే బంగారాన్ని పండించుకుంటాడు. భవబంధ విముక్తుడౌతాడు. అంతకంటే, జీవునికి కావలసినదేముంది? అందుకనే, శివుడనే భూమిని నమ్ముకున్న ఈ కవితాసేద్యం చేసే కర్షకుడు ఆధ్యాత్మికత అనే బంగారాన్ని పండిస్తానంటున్నాడు. ఇక చివరగా తన కవిత్వ లక్షణాలను, ప్రతిభను, నేర్పును చూడగలిగిన పరీక్షకుడు ఒక్క పరమేశ్వరుడే నని, అందువలన తన మీద దయ చూపించమంటున్నాడు విశ్వనాథ.
ఈ పద్యం పరంగా ఒక స్వీయానుభవం ఉంది. అది మీతో పంచుకుంటున్నాను. నేనొక కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిజేస్తున్న రోజులలో, సాహిత్యాభిలాషియైన ఒక మిత్రుడు ఒక మంచి పద్యాన్ని చెప్పమన్నారు. ఈ పద్యం గుర్తుకొచ్చి చదువుతున్నాను. మూడవ పాదం " నీవే భూమివి నేను కర్షకుడ తండ్రీ ! నిన్ను పండించెదన్ " అన్నది చెప్పి, పద్యం పూర్తిచేసేటప్పటికి, ఆ మిత్రుడు నన్ను గాఢాలింగనం చేసుకొని, గాద్గదిక కంఠంతో, " ఇటువంటి ప్రయోగం చేసిన కవి సామాన్యుడు కాదు, మహా కవి అయి ఉంటాడని " అన్నాడు. నేను కవిసమ్రాట్టుల పేరు చెప్పాను. అతడు పులకించిపోయాడు. అదీ, విశ్వనాథవారి కవిత్వానికున్న శక్తి.
ఇన్ని విషయాలను అడిగి, ఆర్ద్రతను ప్రకటించిన ఆ మిత్రుడు అన్యమతస్థుడన్నది కొసమెరుపు. మహాకవిత్వాన్ని ఆస్వాదించటానికి కులాలు, మతాలు అడ్డురావనటానికి ఇది చక్కని నిదర్శనం.
No comments:
Post a Comment