నీ కన్న బాదరసమ్ము నయము దొన్నియ భద్రపరచి
పోకుండనీవచ్చు బియ్యమందు గప్పురమును నారి
పోకుండ నిల్పగావచ్చు మదినుండి పోకుండ నిన్ను
నా కిడరాదు శ్రీ కాళహస్తీశ్వరా ! మహాదేవ !
" మహాదేవా! శ్రీ కాళహస్తీశ్వరా ! నా మనస్సులో నువ్వు భద్రంగా ఉన్నావులే అనుకున్నంత సేపు పట్టలేదు నువ్వు జారిపోవటానికి. నీ కంటె పాదరసం నయం. కనీసం ఒక దొన్నెలో జారిపోకుండా భద్రపరచుకోవచ్చు. కర్పూరాన్ని కూడా హరించిపోకుండా బియ్యంలో నిలవ ఉంచుకోవచ్చు. నా మనస్సులో నిన్ను పట్టి ఉంచటం నా వల్ల కావటం లేదు. "
మనస్సు అతి చంచలమయింది. అది కుదురుగా కొంచెం సేపు కూడా ఉండలేదు. నిజానికి జారిపోయే తత్వం, హరించిపోయే తత్వం మనస్సుకు ఉంది కానీ భగవంతునికి కాదు. ఇంద్రియనిగ్రహాన్ని, తద్వారా మనోనియంత్రణ సాధించలేని జీవుడు నిస్సహాయతకు గురౌతున్నాడు. ఇది జీవుని వేదన.
అట్టి జీవుని నిస్సహాయతను, ' విశ్వనాథ మధ్యాక్కరలు ' అను గ్రంధమునందలి శ్రీ కాళహస్తీశ్వర శతకములోని ఈ పద్యంలో చాలా చక్కగా చిత్రించారు కవిసమ్రాట్టులు.
No comments:
Post a Comment