Saturday 29 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 121 (శ్రీనాథుని హరవిలాసము: చతుర్థాశ్వాసము)

ఎక్కడ లేరె వేల్పులు సమీప్సితదాతలు ముద్దుగూన! నీ
వెక్కడఘోరవీర తప మెక్కడయీ పటుసాహసిక్యముల్
తక్కు శిరీషపుష్ప మవధానపరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగ  మెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా.

శివుని భర్తగా కోరి పార్వతి ఘోరతపస్సు చేయడం మొదలుపెట్టిందివిషయం తెలుసుకున్న  తల్లి మేనక, కూతురుని బుజ్జగించి, ప్రేమతో యీ విధంగా చెప్పింది.

" చిట్టితల్లీకోరకుండానే వరాలిచ్చే దేవతలు యెంతమంది లేరునువ్వేమిటీ? ఘోరమైన తపస్సేమిటి? ఇంత సాహసానికి పూనుకోవద్దమ్మా.   అతి సుకుమారమైన నీ శరీరం ఇంత ఉగ్రమైన తపశ్చర్యకు, ఏకాగ్రతకు తట్టుకొనగలదాశిరీషపుష్పం మీద, అనగా మంకెనపూవు మీదతుమ్మెదలబారులు గానీ, లేకపోతే ఒక పక్షి గానీ, వ్రాలితే, తట్టుకోగలదా? "

 పరమ సుకుమారి అయిన పార్వతి తీవ్రమైన తపోదీక్ష భరించలేదని భావము.

పద్యం ఆద్యంతం అతి సరళంగా సాగి, మధ్యలో సంస్కృతపదాలతో, ఉగ్రమైన తపస్సును తలపింపచేస్తున్నది.

ముద్దుగూన అని కూతురిని సంబోధించడంలో మాతృహృదయం ధ్వనిస్తున్నదిఎవరు వ్రాయగలరు ఇంత మంచి పద్యాన్నిఔచిత్యం తెలిసిన మహాకవులు తప్ప!


పద్యం శ్రీనాథ కవిసార్వభౌముని హరవిలాసము చతుర్థాశ్వాసము లోనిది.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 120 (ఆముక్తమాల్యద: ద్వితీయాశ్వాసము)

సగరు  నలుం బురూరవు ద్రిశంకుసుతుం బురుకుత్సు గార్త
వీర్యు గయుం బృథుం భగీరథు సుహోత్రు శిబిం భరతుం దిలీపునిన్
భృగుకులు యౌవనాశ్వు శశిబిందు ననంగుని నంబరీషు బూ
రు గురుని రంతి రాఘవు మరుత్తుని గాలము కోలుపుచ్చదే.

పద్యంలో షట్చక్రవర్తుల, షోడశ మహారాజుల ప్రస్తావన ఉంది. చక్రవర్తులు ఆరుగురు, మహారాజులు పదహారుగురువీరందరు లోకప్రశస్తి వహించినవారు, విశేషమైన కీర్తి గడించినవారుఅయినప్పటికీ, కాలగతిలో కలిసిపోయినవారే సత్యాన్ని ఆకళింపు చేసుకొంటే, శరీరము అనిత్యమైనదని, భగవచ్చింతన మోక్షదాయకమని బోధపడి, మానవజీవితం ధర్మమార్గంలో గడపడానికి దోహదపడుతుంది.

సగరుడు, కార్తవీర్యుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు అనే ఆరుగురు షట్చక్రవర్తులు.

ఇక, గయుడు, పృథువు, భగీరథుడు, సుహోత్రుడు, శిబి, భరతుడు, దిలీపుడు, పరశురాముడు, యువనాశ్వుని పుత్రుడైన మాంధాత, శశిబిందుడు, అనంగుడు, అంబరీషుడు, పురుని తండ్రియైన యయాతి, రంతిదేవుడు, రాముడు, మరుత్తుడు, అనే యీ పదహారుగురిని షోడశమహారాజులంటారు.

ఆంధ్రమహాభారతం శాంతిపర్వంలో, కవిబ్రహ్మ తిక్కనసోమయాజి పదహారు సీసపద్యాలలో షోడశమహారాజుల చరిత్రలను అద్భుతంగా వర్ణించారు.

షట్చక్రవర్తులను, షోడశమహారాజులను వరుసగా చెప్పడం కష్టం కనుక, పెద్దవాళ్ళేమిటి, పిల్లలేమిటి, యీ పద్యాన్ని బట్టీయం వేస్తేచక్కగా గుర్తుంటారు.


ఇంతమంది ధర్మమూర్తులను గుదిగుచ్చి, శ్రీకృష్ణదేవరాయలవారు ఆముక్తమాల్యద అనే మహాప్రబంధం ద్వితీయాశ్వాసం ద్వారా తెలుగు జాతికి అందించారు.

Friday 28 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 119 (నన్నెచోడుని కుమారసంభవము: దశమాశ్వాసము)

వెలుగు కుమారతేజమున వేడిమి తాకినయంత వేయి
న్నులతో మిఱుమిట్లువోయిన గనుంగొన నేరక మూసికొన్న ఱె
ప్పలు కమరంగ విచ్చె  నురుభాస్కరతీవ్రకరప్రభాతికి 
న్నులికి రయంబున న్మొగిడియున్న కుముద్వతివోలె భీతితోన్.

నారదుడు బాలకార్తికేయుని తేజోవిశేషాలను దేవేంద్రునికి వివరించాడు వార్తను వినగానే, భయకంపితుడైన దేవేంద్రుడు, కుమారస్వామిపై దండెత్తి వచ్చాడు. కుమారస్వామి తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు.

ఇది చాలా అందమైన పద్యంకుమారస్వామి సరస్సులో పుట్టాడు సరస్సు కుముద్వతి అనగా తెల్లకలువలతో నిండియున్న సరస్సు తెల్లకలువలు తీక్ష్ణమైన సూర్యకిరణాలతో ముడుకొనిపోయాయికుమారస్వామిని చూడగానే, ఇంద్రుని వేయికన్నులుమిరుమిట్లు గొలిపాయి. అమితమైన  తేజస్సుతో వెలిగిపోయే  బాలుని నేరుగా చూడలేక భయంతో ఇంద్రుని ఱెప్పలు ముడుచుకుపోయినాయిముడుచుకొన్న  ఱెప్పలు, కుమారస్వామి తేజస్సు వేడికి కమిలిపోగా, ఇంద్రుడు అప్పుడు మెల్లిగా కళ్ళు విప్పాడు.

పద్యంలో తెల్లకలువల సరస్సుగా ఇంద్రుని, సూర్యునిగా బాలకుమారస్వామిని పోల్చడము, ఉరుభాస్కరతీవ్రకరప్రభాతికి, ఇంద్రుని వేయికన్నులు ముడుచుకొనిపోవడము ఔచితీభరితంగా ఉంది.


పైన చెప్పబడిన పద్యం నన్నెచోడుని కుమారసంభవము దశమాశ్వాసంలో ఉంది.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 118 (శ్రీమదాంధ్రమహాభాగవతము: ద్వితీయాశ్వాసము)

తపముల జేసియైన, మఱి దానము లెన్నియు జేసియైన, నే
జపముల జేసియైన ఫలసంచయ మెవ్వని జేర్పకున్న హే
యపదములై దురంత విపదంచిత రీతిగ నొప్పుచుండు
య్యపరిమితున్ భజించెద అఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

భగవంతుని గూర్చి తపించడం ఒక ఆధ్యాత్మిక సాధనఇతరుల కష్టాలు చూసి బాధపడిమనకు ఉన్నదాంట్లో ఇతరులకు కొంచెం పంచిపెట్టడం దానం రెండూ సంస్కార రూపంలో వస్తాయిఅయితేపైన చెప్పిన తపదానాదులు ఈశ్వరార్పితబుద్ధితో చేయకుంటే, అవన్నీ నిందింపదగినవై, ఆపదలుగా రూపాంతరం చెంది, దుఃఖానికి కారణమౌతాయిఅందువల్ల, మనం చేసే పనులన్నీ మంచి పనులయినప్పటికీ, పనుల కర్తృత్వాన్ని మనకు ఆపాదించుకోకుండా, భగవదర్పణ చేస్తే, అవి మనకు దుఃఖం కలిగించకుండా, బంధవిముక్తులను చేస్తాయిఎందుకంటే, భగవంతుడు అపరిమతమైన శక్తి కలవాడు, పాపాల నుండి విముక్తి కలిగించగలిగినవాడుఉపనిషత్తుల నుండి భగవద్గీత వరకు అన్ని సద్గ్రంథాలు చెప్పే సత్యమిదే.

" సర్వధర్మాన్ పరిత్యజ్య/మామేకo శరణం వ్రజ/అహంత్వా సర్వపాపేభ్యో/మోక్షయిష్యామి మాశుచ. " అన్న గీతాశ్లోకం చెప్పేది యీ శరణాగతి తత్వాన్ని గురించే.

ఇంతటి చక్కని పద్యం శ్రీమదాంధ్రమహాభాగవతం ద్వితీయాశ్వాసంలో ఉంది.



Wednesday 26 February 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 117 (నన్నెచోడుని కుమారసంభవము: దశమాశ్వాసము)

హరునకు నెద్ది పేర్మి, దనుజారికి నెద్ది రమావిభూతి, భా
స్కరునకు నెద్ది తేజము, దిశాపతి సంహతి కెద్ది నిల్పు, చం
దురునకు నెద్ది కాంతియు, జతుర్దశలోకవిభుత్వ మెద్ది నీ
కిరవుగ నా కుమారు డిక నింకొక యించుక సేపు నిల్చినన్?

సరోవరంలో పుట్టి, అమిత  తేజస్సుతో ప్రకాశిస్తున్న కుమారస్వామిని చూసి నారదుడు ఆశ్చర్యపోయాడువెంటనే, కలహభోజనుడైన అతనికి ఒక ఆలోచన వచ్చిందివీరుడైన కుమారస్వామితో, దేవేంద్రుడు యుద్ధం చేసేటట్లు పురిగొలిపితే, రోజుకు భోజనం చేసినట్లవుతుందని అనుకున్నాడునేరుగా దేవేంద్రుని వద్దకు వెళ్ళి, యీ విధంగా చెప్పాడు.

" పిల్లవాడు ఇంకా కొంచెం చేపు భూమిపై నిలిచి ఉంటే, శివుని గొప్పతనము, విష్ణువు లక్ష్మీసంపద, సూర్యుని తేజస్సు, దిక్పాలకుల నిలకడచంద్రుని కాంతి, నీ చతుర్దశలోక ఆధిపత్యము మరుగున పడిపోతాయి. " 


నన్నెచోడకృత కుమారసంభవము కావ్యం దశమాశ్వాసం లోని యీ పద్యం కుమారస్వామి గొప్పతనాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తులో దేవతలకు సేనాని అయ్యే లక్షణాన్ని సూచిస్తున్నది.

సువర్ణ సుమన సుజ్ఞేయము - 116 (పాండురంగ మాహాత్మ్యము: ప్రథమాశ్వాసం)

చదువుల పుట్టినిండ్లు, శమసంపద ఇక్కలు, పుణ్యలక్ష్మికిన్ 
మొదలి దివాణముల్ సురసమూహము నాకటిపంట లంచితా
భ్యుదయ నిసర్గబంధువులు, ప్రోడతనంబుల ఠాణముల్ పురిన్
పొదలెడు భుసురోత్తముల భూరిపవిత్రశరీరవల్లరుల్.

ఇది కాశీ క్షేత్రంలో నివసించే బ్రాహ్మణులను వర్ణించే పద్యం బ్రాహ్మణులు  చాలా పవిత్రమైనవారు అని కవితాత్మకంగా   భూరిపవిత్రశరీరశరీరవల్లరుల్ అన్నారుఅనగా, మిక్కిలి పవిత్రమైన శరీరములనే తీగలు కలవారు అని అర్థము.

ఇంకా యెటువంటివారుచదువుల  పుట్టినిళ్ళు, శాంతికాముకులు (ఇక్కలు=స్థానములు), పుణ్యం కొలువుండే చోటులు (బహు పుణ్యాత్ములు), దేవతల ఆకలి తీర్చేవారు (యజ్ఞయాగాది క్రియలు చక్కగా నిర్వహించేవారు), అందరి శ్రేయస్సు కోరేవారు, మంచి నైపుణ్యం కలిగినవారు.

మనం చేసే పనులు మనమేమిటో చెబుతాయి ఊరిలోని బ్రాహ్మణులు కూడా అంతేవారు చేసే పనులే వారి గొప్పదనాన్ని సూచించాయి.


పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము ప్రథమాశ్వాసం లోనిది.

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like