శీలంబున్ గులమున్ శమంబు దమమున్ జెల్వంబు లేబ్రాయమున్
బోలన్ జూచి యతండె పాత్రుడని యే భూపాలు డీవచ్చినన్
సాలగ్రామము మున్నుగా గొనడు మాన్యక్షేత్రముల్ పెక్కు చం
దాలన్ బండు నొకప్పుడున్ దఱుగ దింటన్ బాడియున్ బంటయున్.
ఇంతకు ముందు చదివిన పద్యాల లాగానే, ఈ పద్యం కూడా స్వారోచిష మనువు యొక్క పుట్టుకకు కావలసిన జీవసంపుటిని తెలియజేస్తాయి . మనువు కాబోయేవాడు, మానవులను ధర్మమార్గంలో పరిపాలించడానికి, ధర్మమార్గంలో ప్రవర్తింపజేయడానికి కావలసిన లక్షణాలను కలిగి ఉండాలి. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాతిపదికగా, ధర్మానువర్తి, ధర్మప్రచారకుడు బ్రాహ్మణుడు.. బ్రాహ్మణ ధర్మాలను ప్రవరుని జీవసంపుటి అందిస్తుంది. అందువలననే, పెద్దనగారు ప్రవరుని గుణగణాలను వర్ణించడం జరిగింది.
ప్రవరుడు భాషాపరశేషభోగి. వివిధాధ్వరనిర్మలధర్మకర్మదీక్షాపరతంత్రుడు.అధ్యయనాధ్యాపన తత్పరుడు.
వాటికి తోడు, అతడి శీల సంపద ఉత్కృష్టమైనది. వంశగౌరవం చాలా గొప్పది. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. బాహ్య, అంతరింద్రియ నిగ్రహం కలవాడు. అతని శీలసంపద, యవ్వనసంపద చూసి ఎందరో రాజులు ఇతడు దానార్హుడని నిర్ణయించి ఏమైనా ఇవ్వటానికి సంకల్పించినా, చివరకు సాలగ్రామం వంటి దానిని కూడా పుచ్చుకొనడు. ఎందువలననగా, ప్రతిగ్రహీతకు, దానమిచ్చిన వానినుంచి పాప మేమైనా సంక్రమిస్తుందేమోనని అతనికి భయం. పరంపరాగతంగా వచ్చిన మాన్యపు భూములలో కావలసినంత పండుతుంది. పాడికి కొదువలేదు. అందువల్ల అతిథి అభ్యాగతులు ఆయన ఇంటికి తిరుణాల లాగా వస్తుంటారు.
స్వారోచిషమనుసంభవానికి ఇవన్నీ కావలసిన సామాగ్రి. ఆ సామాగ్రినంతా పెద్దనగారు ప్రవరుని కథలో కూర్చి పెట్టారు.
ఈ పద్యం పెద్దనగారి మనుచరిత్రము ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment