ల్లీమంజుప్రసవంబు, చిద్గగన ప్రాలేయాంశువున్, మోక్ష ల
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల, కటాక్షీభూత నీహారరుక్
శ్రీమంతం బయి పొల్చు వెలుగు నొకఁడే సేవింతు విశ్వేశ్వరా !
ఈ పద్యం, ' మా స్వామి ', ' విశ్వేశ్వర శతకం ' అని రెండు పేర్లతో పిలువబడే శతకరచన లోని మొదటి పద్యం. దీనిని, విశ్వనాథ, తమ బృహద్గ్రంథం, శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికలో మొదటి పద్యంగా చేర్చారు.
పదకొండవ శతాబ్దానికి చెందిన యథావాక్కుల అన్నమయ్యగారి ' సర్వేశ్వర శతకం ', కృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని ధూర్జటి మహాకవి రచించిన ' శ్రీకాళహస్తీశ్వర శతకం ', కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి ' విశ్వేశ్వర శతకం ', శివభక్తిప్రధాన శతకాలలో అగ్రగణ్యమైనవని నా వ్యక్తిగత అభిప్రాయం.
విశ్వనాథవారి విశ్వేశ్వర శతకంలోని పద్యాలు కొన్ని దీర్ఘసంస్కృత సమాసాలతో, నా వంటి వారికి పూర్తిగా అర్థం కాకుండా ఉంటాయి. ఇబ్బందంతా ఇక్కడే ఉంది. అసలు అర్థం కాకపోతే, ప్రక్కన పెట్టేస్తాము. కానీ, తెలిసీతెలియక ఉన్న పరిస్థితిలో, పద్యం యొక్క శబ్దమాధుర్యానికి, ఏ కొంచెమో తెలిసిన అర్థగాంభీర్యానికి, ఉక్కిరిబిక్కిరై పోయి, పెద్దల వల్ల ఎప్పటికైనా తెలియకపోతుందా అన్న ఆశతో, చదివిందే పదిసార్లు చదువుతుంటాము. విశ్వనాథ వారన్నట్లు, జీవనదులు, మహాపర్వతశ్రేణుల్లో పుట్టి, క్రిందకు మహాప్రవాహంతో జాలువారుతుంటాయి. ఆ ప్రవాహం నుంచి చిన్న చిన్న పాయలు తీసి, మహాపండితులు, వ్యాఖ్యాతలు లోకానికి అందిస్తారు. ఆ పెద్దల వ్యాఖ్యానం నుండి సామాన్య పాఠకులు ఏ కొంతో గ్రహించగలుగుతారు. ఇది నా స్వానుభవం.
నేనెన్నో సార్లు అనుకుంటుంటాను. భగవంతుడు నా చేత పొట్టకూటి చదువులు చదివించకుండా, విశ్వనాథవారి ఇంట్లో పనివాడిగా పుట్టించినా, వారి సాంగత్యం చేత ఒకమోస్తరు పండితుడినయ్యేవాడిని కదా ! అని. ఆ మహాకవి ఆకర్షణ అటువంటిది, వారి కవిత్వము అటువంటిది. ఇక ఉపోద్ఘాతం ఆపి, నేను అర్థం చేసుకొన్నంత వరకు, నా ఆత్మతృప్తి కోసం, ' మా స్వామి ' లోని పద్యాలకు వ్యాఖ్యానం వ్రాస్తున్నాను. విశ్వనాథవారిపై భక్తిభావం, తెలుగుభాషపై ఎనలేని మక్కువ తప్ప ఇంకొక అర్హత లేని నన్ను మన్నించమని ప్రార్థిస్తున్నాను.
" మంజూషిక అంటే పెట్టె. పూర్వం మన ఇళ్ళలో పెద్ద భోషాణాలుండేవి. ఏంత సామానైనా దాచుకోవచ్చు. పరమేశ్వరుడు సంపదల నిచ్చే పెద్ద పెట్టె వంటివాడు. ఆయనను నమ్ముకుంటే, ఆయనకు మనను అమ్ముకొంటే, ఎంత సంపదనైనా ఇస్తాడు, ఏ రకమైన సంపదనైనా ఇస్తాడు. భక్తరక్షణకళా శ్రీ చుంచువు. భక్తులను రక్షించటమనేది ఒక కళ. కళలు ఎవరికి పడితే వారికి అబ్బవు. అవి అబ్బాలంటే మంచి హృదయముండాలి. ఇతరులకు మేలు చేయాలనే మంచి మనస్సుండాలి. పరమేశ్వరుడు భక్తులను రక్షించడమనే కళలో నిష్ణాతుడు. అందుకేనేమో, ఆయనకు బోళాశంకరుడని పేరు సార్థకమయింది. ఇక్కడ విశ్వనాథ ' చుంచువు ' అనే పదాన్ని వాడారు. దానికి అర్థం నాకు సరిగా తెలియలేదు. చుంచువు అంటే పిల్లజుత్తు అని నిఘంటువు లోని అర్థం. అంటే, శంకరుడు, భక్తులను రక్షించి, వారికి బలాన్ని, శక్తిని, ప్రసాదించే వాడని అన్వయించుకొన్నాను. ఆనందవల్లీమంజుప్రసవంబు. ఆనందమనే తీగకు పూచిన అందమైన పువ్వు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆనందమయుడు. ఆనందమే ఆయన స్వరూపం. చిద్గగన ప్రాలేయాంశువు. చిదాకాశంలో వెలసిన కాంతిరేఖ. పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు. మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల. మేఖల అంటే నడుముకు చుట్టుకొనే త్రాడు. పరమేశ్వరుడు మోక్షప్రదాత అని అర్థం. కటాక్షీభూత నీహార రుక్కు. దీనిని రెండు రకాలుగా అన్వయించుకోవచ్చని అనుకుంటాను. పరమేశ్వరుడు కటాక్షించి, మనస్సుకు ఆహ్లదం కలిగించే ప్రాభాతతుషారకిరణం వంటివాడు లేక సర్వప్రాణులను కటాక్షించే ప్రాభాతతుషార కిరణం వంటివాడు. నీహార రుక్ అంటే మంచుబిందువు. అటువంటి, శుభములను కలిగించే, వెలుగు రూపాన్ని నేను సేవిస్తున్నాను అని మహాకవి మొదటి పద్యంలో ఆత్మనివేదన చేసుకొన్నారు.
No comments:
Post a Comment