బ్రశమితమై యెదో స్మరణభావము కొట్టినయట్లు తోఁచి ధీ
దశ పులకించి యిట్లనియెఁ దల్లి ! యహల్యకు గౌతమర్షిదే
వి శమితలాలసాహృదయవీధికి నీకును నాత్మ యొక్కఁడా !
సుమంత్రుని వెంట శ్రీరాముడు తండ్రి దశరథుని వద్దకు వెళ్ళాడు. కోపగృహంలో, దైన్యస్థితిలో ఉన్న తండ్రిని చూసి మొదట నిర్విణ్ణుడైనా కూడా, ముందుగా తండ్రి పాదాలకు, తరువాత పినతల్లి కైకకు నమస్కరించాడు. తండ్రి దుఃఖానికి కారణం ఏమిటని కైకను అడిగాడు. తనవైపు నుండి ఏదో పెద్ద అపచారం జరిగుంటే గాని, తండ్రి ఇంత దుఃఖానికి లోనవడని, అదేంటో చెప్పమని కైకను వేడుకొన్నాడు తండ్రి తనకు ప్రత్యక్ష దైవమని, ఆయన ' ఊ ' అంటే నిప్పుల్లో దూకమన్నా దూకుతానని, మహావిష సర్పాలున్న చోట నిద్రించమన్నా నిద్రిస్తానని చెప్పాడు.
ఈ విధంగా మాట్లాడుతున్న రాముడు, ఒక్కసారిగా కైక వంక చూసాడు. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉండటం చూసి, వారివురికీ తానేమి ద్రోహం చేసాడో తెలియక తల్లడిల్లిపోయాడు. ఇక కైక, తన గొంతులో నుంచి వస్తున్న దుఃఖాన్ని, కోపావేశాన్ని అదిమిపట్టికొని, " తండ్రి మాట మీద యౌవరాజ్యపట్టాభిషేకానికి ఒప్పుకొన్న వాడివి, ఇప్పుడు నేను చెప్పేది చేయగలవో లేదో బాగా ఆలోచించి జవాబివ్వ " మని రాముడితో అన్నది.
" పినతల్లి కైక మాటలు వినగానే, దశరథపుత్రుడైన రాముడి నక్షత్రాల వంటి కళ్ళు మొలకలెత్తినట్లయ్యాయి. శాంతిభావం వహించిన రాముడి మనస్సుకు ఏదో గుర్తుకొచ్చినట్లుగా అనిపించింది. రాముని హృదయం పులకించిపోయి, పినతల్లి కైకతో, ' అమ్మా ! శాంతరసాధిదేవత, గౌతమమహర్షి భార్య అహల్యాదేవికి, నీకు ఆత్మ ఒక్కటేనా ? " అని అడిగాడు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోని యీ సన్నివేశం అద్భుతమైనది.
అహల్యా శాపవిమోచనం తరువాత, మిథిలా నగరానికి ప్రయాణమౌతున్న రాముడిని, తిరుగుప్రయాణంలో మరల ఆశ్రమానికి రమ్మని వేడుకొంటూ, కళ్యాణమూర్తులైన సీతారాముల కోసం నారచీరలు సిద్ధంగా ఉంచుతానని అన్నది.
అహల్య మహాపతివ్రత. ఆమె కౌసల్య, అరుంధతుల కోవకు చెందినదని రాముని భావన. అప్పుడు అహల్య మాటలు, ఇప్పుడు కైక మాటలు, సర్వ దేవతల, ఋషుల భావాలు, అన్నీ తూకం తూచినట్లుగా సరిపోతున్నాయని భావించిన రాముడు, పినతల్లి మాటలతో పులకరించిపోయాడు. రాముని అవతార లక్ష్యం రాజ్యాల నేలటం కాదు గదా !
No comments:
Post a Comment