రింగులు గాగ హంస విహరించెను మింటను బల్లటీలుగా
బంగరుపూలు తాపినది పళ్ళెము వెండిది త్రిప్పినట్లుగా
నింగికిఁ గ్రొత్తయందమును నింపుచుఁ బోయినయంత మేరయున్
గంగయుఁ గ్రొత్తపాయ యెసకంబుగఁ దీయుచు నుర్వులెత్తుచున్.
నిక్కపు వెండిచేఁతయును నిర్మితచంచువు కెంపుముక్కయున్
ఱెక్కలపైడిపూఁత యమరించిన చొక్కపు హంసబొమ్మ తా
నొక్కఁడు ప్రాణవంతమయి యుప్పరమందున నేగుచుండె న
మ్మక్క యటంచుఁ జూచిరి మహాసురసౌధగతల్ లతాతనుల్.
లంక సముద్రతీరంలో కపిసేనలతో విడిది చేసిన రామునికి, ఆకాశంలో విహరిస్తూ ఒక రాజహంస కనిపించింది. ఆ హంసను చూడగానే, జానకీహరణం వల్ల కలిగిన విరహవేదనతో బాధపడుతున్న రాముని మనస్సులో ఆలోచనా తరంగాలు సుడులు తిరగటం మొదలుపెట్టాయి. ఈ పద్యాలలో వర్ణించబడిన, రాముని మనసులోని అవాచ్య మధుర భావనలే, ఈ పద్యాలలో, రసజ్ఞులైన పాఠకులకు మిగిలిపోయే మధురానుభూతులు.
" రెక్కలతో చప్పుడు చేస్తూ గుండ్రంగా ఆకాశంలో హంస పల్లటీలు కొడుతుంటే, అది బంగారపు పూలు తాపడం చేసిన వెండిపళ్ళెం గిర గిర తిరిగినట్లుంది. హంస పోయినంత దూరం, ఆకాశానికి ఏదో ఒక క్రొత్త అందం వచ్చినట్లుగా ఉంది. ఆకాశగంగ నురుగులతో క్రొత్త పాయ తీసి ప్రవహిస్తున్నట్లుగా ఉంది.
అచ్చమైన వెండితో చేసి, దానికో కెంపుముక్క ముక్కుగా అమర్చి, రెక్కలకేమో బంగారపు పూత పూసిన, చక్కని హంస బొమ్మ ఒకటి, ప్రాణం పోసుకొని ఆకాశంలో వెళ్తున్నదని రాక్షస జాతి అమ్మలక్కలందరూ మేడల పైనుండి చూడసాగారు..
రెండవ పద్యంలోని హంస బొమ్మ వర్ణన, రావణుని మనస్సులో అనుమానమనే విత్తనం నాటటానికి ఉపయోగపడింది. రావణుని పూజామందిరంలో వెండితో చేసిన ఒక హంస బొమ్మ ఉంది. శివుని మందిరంలో ఉన్న ఆ వెండి హంస ఇదేనా అన్న సంశయం మొలకెత్తటానికి యీ వర్ణన ప్రాతిపదిక.
పై రెండు పద్యాలు, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోనివి.
No comments:
Post a Comment