ముదురు తొండ యొకఁడు ముంగాళ్ళపై నిక్కి
నిశ్చలంబుగాఁగ నిలచియుండి
కాళ్ళ నడుమనుండి కధలు చీమలబారు
చెదురు చీమలను గ్రసించునట్లు.
విశ్వనాథ సత్యనారాయణగారి బృహద్గ్రంథం శ్రీమద్రామాయణ కల్పవృక్షములో ప్రధాన కథలకు అనుసంధానంగా ఎన్నో చిన్న కథలను చెప్పారు. ఇందులో, ఒక్కొక్క కథ చెప్పే తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది.
అరణ్య కాండములోని వాతాపి ఇల్వలుల కథను సీత చేత చెప్పించారు విశ్వనాథ. అయితే, కథలు చెప్పటానికి ముందు, దానికి పూర్వరంగాన్ని నిర్మించటం విశ్వనాథ రచనలోని కథాకథన శిల్పరహస్యం.
సుతిక్ష్ణుని ఆశ్రమం నుండి అగస్త్యాశ్రమం వైపు బయలుదేరారు సీతారామలక్ష్మణులు. మార్గమధ్యంలో, ఒక పాము శరీరం మీద కాలువేసి త్రొక్కిపట్టి, పడగపై ముక్కుతో పొడుస్తున్న నెమలిని సీతకు చూపించాడు రాముడు. దానిని ఆధారంగా చేసుకొని, " ఎంత కష్టం వచ్చినా కూడా, ఎదిరించగల ప్రతిభ ఉన్నదని, కష్టాలను ఎవరైనా కొనితెచ్చుకుంటారా? లోకకళ్యాణం కోసం అగస్త్యుని వంటి మహాత్ములు ఆ పనిని ఎలాగూ మానరు. అటువంటివారి వల్లనే కదా లోకాలు కష్టాలు తీరి సుఖపడుతున్నాయి. " అని సీత రాముడితో అన్నది.
" మన సుతీక్ష్ణులవారి ఆశ్రమంలో ఒక గున్న మామిడి చెట్టు మొన్న పూతకొచ్చిందే ! , దాని ప్రక్కనున్న పర్ణశాలలో ఉంటున్న వృద్ధగార్గేయి నాకు ఒక కథ చెప్పింది. అది నీకు చెప్పనా? " అని సీత రాముడిని అడిగింది. రాముడు ఆ చెప్పే కథేమిటో తెలియాలి కదా అన్నాడు. అది ప్రసంగసాధువుగా ఉన్న అగస్త్యుడి కథ అనీ, ఆ వృద్ధగార్గేయి చెప్పినట్లుగానే చెబుతాననీ అన్నది. ఆ కథ ఆ సమయంలో వినాలని లేదని రాము డనగా, కథ చెప్పాలన్న కుతూహలంతో ఉన్న సీత, " సరే లక్ష్మణుడు వింటాడులెండి " అని, కథ చెప్పడం మొదలుపెట్టింది.
సీత కథ చెప్పటం ఎలా మొదలుపెట్టింది? బాగా ముదిరినటువంటి తొండ ఒకటి ముందుకాళ్ళపై నిల్చొని, నిక్కి చూస్తూ, దాని కాళ్ళ సందుల్లో నుంచి బారుగా వెళ్తున్న చీమలదండులో నుంచి చెదిరినటువంటి చీమలను పట్టుకొంటున్నట్లుగా, ఒకడు అరణ్యంలో ఒంటరిగా వేళ్తున్న బాటసారులను అన్నానికి పిలిచి, వారిని చంపి దొంగతిండి తింటున్నాడట.
ఈ పద్యంలో సీతారాముల మధ్య జరిగిన సంభాషణ, చెప్పబడిన ఉపమానం, వాతాపి ఇల్వలులతో ముడిపడి ఉన్న అగస్త్యుని కథకు పూర్వరంగంగా విశ్వనాథ అద్భుతమైన కల్పన చేశారు. విశ్వనాథ కథలు చెప్పే పద్ధతిలో ఈ విధంగా పూర్వరంగాన్ని కల్పించటం ఒక ప్రత్యేకత. దానివలన, కథలకు సహజత్వం, బిగువు, సమకూరుతాయి.
ఈ పద్యం శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనిది.
No comments:
Post a Comment