యిరవున కేగుదెంచి యొక యిన్ని జలంబులు పుచ్చుకోనిచో
బరువయినట్టి కుక్షికిని బాపపుఁదిండి భుజింపలేమ నీ
ష్ఠురము గృహస్థధర్మము కడున్ మిముఁబోలినవారు లేనిచో.
నలిఁ బ్రతినిత్యమున్ వ్రతము నాకిది గుండిగయందు మిక్కిలిం
బలిసిన గొఱ్ఱెపోతు రుచివంటకమున్ బొనరించి త్వాదృశుం
బిలిచెద మంచి భోజనము పెట్టెద మీకును మాకుఁ దృప్తి యా
వలను గృహస్థధర్మపరిపాలన మీకిది స్వర్గహేతువౌ.
వాకిట బలిసిన గొఱ్ఱియ
మీకే కనిపించు నంచు మేదకుని ద్విజున్
గైకొని పోవు నెవండేన్
రాక యెదేఁజెప్ప, వాడు రాకాసి మఱిన్.
సీత, రామలక్ష్మణులకు వాతాపి ఇల్వలుల కథ చెపుతున్నది.
ఇల్వలుడు, వాతాపి అనే వారిద్దరన్నదమ్ములు. వాళ్ళు కామరూపులు, క్రూరకర్ములు. నరమాంసం మరిగారు. వాతాపి గొర్రెపోతై వాకిట్లో కట్టివేయబడి, అతిథులకు కనిపిస్తాడు. ఇల్వలుడు దారికాచి బ్రాహ్మణుడి నెవరినో ఒకరిని ఇంటికి భోజనానికి పిలిచేవాడు. వాకిట్లో ఉన్న గొఱ్ఱెను కోసి, వండి, భోజనం పెట్టేవాడు. తరువాత, " వాతాపి ! బయటకు రా ! " అని పిలిచేవాడు. వాతాపి అతిథి పొట్ట చీల్చి బయటకొచ్చేవాడు.
ఇల్వలుడు దారులు కాచి, కనిపించిన బ్రాహ్మణులతో ఈ విధంగా అనేవాడు.
" స్వామీ ! మీ లాంటి సద్బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చి ఇన్ని నీళ్ళు పుచ్చుకోకపోతే, ఈ వెధవ పొట్టకి పాపపుకూడు తిన్నట్లు యేమిటో బరువుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, మీ లాంటి వాళ్ళు దొరక్కపోతే, గృహస్థధర్మం పాటించడం చాలా కష్టంగా ఉంటుంది సుమా !
ప్రతిరోజు నాకిదో వ్రతం. గుండిగ నిండా గొర్రెమాంసం రుచిగా వండి, మీలాంటి వారికి భోజనం పెడితే, తిన్న మీకు తృప్తి, పెట్టిన మాకు తృప్తి. ఇక ఆపైనంటారా ! గృహస్థధర్మం పాటించినందుకు మాకు ఆనందం, మీకేమో స్వర్గం చూసినట్లుంటుంది.
వాకిట్లో కొచ్చేటప్పటికి గొర్రెపోతు మీకే కనిపిస్తుందిగా ! "
ఆ విధంగా చెప్పి, ఎవడో ఒకడు అమాయక బ్రాహ్మణున్ని తీసుకువెళ్ళేవాడు. వాడీ పన్నాగం కనిపెట్టి రానన్నాడనుకో, వాడసలే రాక్షసుడు, బలవంతంగా లాక్కెళ్ళేవాడు.
విశ్వనాథ కథ చెప్పే తీరు రమ్యంగా ఉంటుంది. వారే అవతారికలో చెప్పినట్లుగా, మనం ఇళ్ళలో మాట్లాడుకొనే రోజువారీ భాషను కావ్యంలో చొప్పించి, రసజ్ఞుల హృదయాలకు గిలిగింతలు పెట్టించారు.
ఈ మూడు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అరణ్య కాండము, దశవర్ష ఖండము లోనివి.
No comments:
Post a Comment