ద్యావీథిన్ మిను కట్లుగాఁ బరిణత త్రయ్యంత మార్గంబులన్
నీవేగా పొనరించు మట్లొడఁబడన్ నీ కంత కష్టంబుగా
భావంబందునఁ దోఁచెనేని యది నా ప్రారబ్ధి, విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని ముప్పదియవ పద్యం.
" విశ్వేశ్వరా ! సూర్యుడు ప్రయాణించే మార్గంలో కాంతులు విరజిమ్మే నక్షత్రంగా, జ్ఞానవిద్యను తెలిపే మార్గంలో మినుకు మినుకుమంటూ, బాగా పరిణతి చెందిన వేదాంత మనబడే ఉపనిషత్తుల మార్గంలో దర్శింపవలసినది నిన్నే. ఉపనిషత్సారం నీవే. అది ఒప్పుకొనటం కష్టమని నీవు భావిస్తే, అది నా ప్రారబ్ధ మనుకుంటాను. "
సావిత్రి, సూర్యుని కుమార్తె. ఈమె పరబ్రహ్మతత్త్వానికి ప్రతీక. మానవాళిని, మృత్యుముఖం నుండి అమృతత్త్వం వైపుకి నడిపించటానికి, భూమికి దిగివచ్చిన దివ్యజ్యోతి. అందుచేత ఆమె కాంతిమయ నక్షత్రంగా వర్ణించబడింది.
జ్ఞాన విద్యా వీధి అంటే జ్ఞానయోగ మార్గం. ఈ యోగమార్గంలో, సత్యాన్వేషణ, ఆత్మతత్త్వ విచారణ, అంతర్నిహితమై ఉన్న " నేను " అనే ప్రజ్ఞను దర్శించటం ప్రధానాంశాలు. ఈ జ్ఞాన విద్యా వీధి కష్టతరమైనది. " నేను " అనే ప్రజ్ఞ హృదయకుహరంలో అంతర్నిహితంగా ఉంటుంది. అందుకే అది మినుకు మినుకు మంటూ ఉంటుంది. అది తెలుసుకోవాలంటే ఆత్మతత్త్వవిచారణ అవసరం.
పరిణతి చెందిన వేదాంతమార్గం ఉపనిషత్తుల మార్గం. పరమేశ్వరుడు వేదస్వరూపుడు, ఉపనిషత్సారం. ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకోవటమే జీవుని లక్ష్యం, దాని కోసమే జీవుని వేదన.
No comments:
Post a Comment