కల డొకరుండు పేరుకొన గాని కులంబు మదీయ భక్తు డి
య్యిల మును వాడు వామనత నే వసియించిన పుణ్యభూమి నం
దుల కొక యోజనత్రయపుటూర వసించి, బ్రాహ్మవే
ళల జనుదెంచి, పాడు మము లాలస మంగళ నామ కైశికిన్.
సంభాషణాప్రాధాన్యత కలిగిన ఈ పద్యంలో, అర్థాన్ని అన్వయించుకొనడానికి వాక్యనిర్మాణం ఒక క్రమంలో లేదు. అయితే, కృష్ణదేవరాయల ప్రౌఢమైన శైలికి భిన్నంగా, పద్యం సరళంగా, సుందరంగా ఉంది. భగవంతుడైన మన్నారుస్వామి విష్ణుచిత్తునితో చెబుతున్న మాటలు ఇవి.
" నా భక్తుడొకడు చెప్పరాని కులంలో పుట్టాడు. అది ఇక్కడకు మూడు కోసుల దూరంలో ఉంది. అది నేను వామనావతార మెత్తినప్పుడు నివసించిన పుణ్యభూమి. అతడు ఆ గ్రామంలో ఉంటూ, రోజూ తెల్లవారుజామునే వచ్చి మంగళకైశికి గానంతో నా పాటలు పాడేవాడు. "
పద్యం మొదటిపాదంలోని మూడు విరుపులు పద్యానికి ఒక చెప్పలేని అందాన్ని తెచ్చాయని ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర్రావుగారు విశ్లేషణ చేశారు. ఆ మూడు విరుపులు, బ్రాహ్మీముహూర్తాన్ని ధ్వనించే మువ్విరుపుల కోడికూతలా? ఏమో!
పద్యం సాధారణంగా కనిపిస్తున్నా, దీనిలో ఆనాటి వర్ణవ్యవస్థ, చారిత్రకాంశాలు నిక్షిప్తమై ఉన్నాయి.
' పేరుకొన గాని కులంబు ' అనగా పంచమకులం. దీనిని బట్టి అప్పుడు అంటరానితనం బాగా ఉన్నదని అర్థమౌతున్నది. విష్ణుమూర్తి, తనకు భక్తుడైన పంచముని గురించి చెప్పింది సద్బ్రాహ్మణుడైన విష్ణుచిత్తునితో. దీనిని బట్టి, పరమాత్ముని చేరడానికి భక్తి ముఖ్యం గాని, కులప్రాధాన్యత లేదని సుస్పష్టమౌతున్నది.
శ్రీవైష్ణవులకు అతిపవిత్రమైన 108 దివ్యతిరుపతులలో ఒకటైన ' కురుంగుడి ' అనే పుణ్యక్షేత్రం, వామనమూర్తి నివసించిన ప్రదేశం అని భక్తుల నమ్మకం.
ఇక చరిత్ర ఆధారంగా, శ్రీవైష్ణవం, వీరశైవం, మహారాష్ట్రలోని భక్తుల కథలు పరిశీలిస్తే, కడగొట్టు జాతిలో పుట్టినవారు మహాభక్తులై భారతీయ భక్తి తత్త్వానికి ఊపిరిపోయడం మనందరికీ తెలిసిన సత్యమే.
ఈ పద్యం శ్రీకృష్ణదేవరాయలచే రచింపబడిన ' ఆముక్తమాల్యద ' షష్ఠాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment