మంతిన్యర్థము నీదు మూర్తి యొకఁడే మా తండ్రి ! నిక్కంబు నా
కింతా తోఁచియు నీ మహార్థ మెపుడేనీ రూఢి కాలేదు శా
మంతీకుట్మలవత్సుధాకరశిరోమాణిక్య ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి ' శతకం లోని పదమూడవ పద్యం.
ఇందులో మనముంటున్న దృశ్యమాన జగత్తు ఎంత అశాశ్వతమో, గడుపుతున్న సంసార మెంత సారవిహీనమో తెలుపుతూ, తత్త్వాన్ని బోధించమని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నారు విశ్వనాథ.
" ఈ ప్రపంచంలో మనం చేసేదంతా వ్యర్థం. అది చేద్దాం, ఇది చేద్దాం అనే ఆశ, మనిషిని పట్టి కుదిపేస్తూ ఉంటుంది. ఈ ఆశతో, మాయ అనే పెద్ద వలయంలో చిక్కుకుపోతున్నాడు జీవుడు. మాయ కల లాంటిది. అది నిజం కాదు. కల లాగా కరగిపోతుంది. మరి యదార్థ మేమిటి? అర్థనారీశ్వరస్వరూపంలో నీదైన దక్షిణ భాగం. అర్థనారీశ్వర రూపంలో, నీ తలపాపట లోని సగమైన నీ దివ్యతత్త్వం. నీ యదార్థ రూపం, తెలిసి కూడా, నీ రూపం వెనుక దాగి ఉన్న మహార్థం, మహా తత్త్వం నాకింకా రూఢి కావటం లేదు. అమృతాంశుడిని శిరోరత్నంగా ధరించి, లోకానికి శాంతిని ప్రసాదించే ఓ విశ్వేశ్వరా ! నాకు నీ తత్త్వాన్ని బోధించు. "
అర్థనారీశ్వరునిలో, దక్షిణ భాగం పరమేశ్వరుడు, వామభాగం ప్రకృతిస్వరూపిణి పార్వతి. తలపాపిట నుండి దక్షిణపార్శ్వం అయ్యవారిది. తత్త్వప్రధానమైనది అయ్యవారి స్వరూపం. మోహింపజేసే మాయస్వరూపిణి అమ్మవారు. అందువల్ల, మోహింపజేసే ఈ దృశ్యమాన జగత్తు నుండి విముక్తుడై తత్త్వస్వరూపుడైన భగవంతుడిని దర్శించటమే మహార్థము. కానీ, అది తెలుసుకొనటం అంత సులభం కాదు. అందుకే, ఆ " మహార్థ మెపుడేనీ రూఢి కాలేదు " అనటం. అది రూఢి కావాలంటే, ' శామంతీకుట్మలవత్సుధాకరశిరోమాణిక్య " విశ్వేశ్వరుడి అనుగ్రహం కావాలి.
విశ్వనాథవారు పరమేశ్వరుని పరంగా వాడే విశేషణాలు చాలా లోతైన అర్థం కలిగి ఉంటాయి. పరమేశ్వరుడు ' సుధాకరశిరోమాణిక్యం ' తలపై కలవాడు. చంద్రుడు అమృతకిరణాలను విరజిమ్మేవాడు. అటువంటి అమృతాంశుడిని తలపై ధరించి, అరమూసిన/అరవిచ్చిన కళ్ళతో ధ్యానసమాధిలో కూర్చొని, లోకానికి శాంతిని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు.
No comments:
Post a Comment