సితపీతారుణనీలపింగరుచులై స్నిగ్ధంబులై యుద్యతా
యతవిద్యుల్లలితంబులై, ఘనగిరీంద్రాకారఘోరంబులై,
తతనిర్ఘాతనిపాతభీమభిదురధ్వానంబులై సంతతో
ద్ధుతసంవర్తపలాహకంబులు వెసన్ దోతెంచు దిగ్భిత్తులన్.
మార్కండేయుడు ధర్మరాజుకు ప్రళయకాల మహోత్పాతాన్ని వివరిస్తున్నాడు.
" ప్రళయకాలమేఘాలు క్షణ క్షణం రంగులు మారుతూ అతిశయిస్తూ ఉంటాయి. అవి తెలుపు, పసుపు, ఎఱుపు, నలుపు, గోరోచనపు రంగులతో వెలుగుతూ ఉంటాయి. ఆకాశమంతా దట్టంగా అలుముకుంటాయి. అవి పొడవైన మెరుపుల కాంతులతో మిలమిలా మెరిసిపోతుంటాయి. క్రమక్రమంగా అవి కొండలంత పెద్దవై, విపరీతంగా పిడుగులు పడటం చేత వజ్రపాతం వంటి భయంకరమైన ధ్వని చేస్తూ, సంవర్త పలాహకాలనే ప్రళయకాల మేఘాలు వడివడిగా దిక్కులు పిక్కటిల్లేటట్లుగా దట్టంగా ఆవరిస్తాయి. "
ఆకాశమంతా నల్లని మేఘాలతో అలుముకొని, ఉరుములు, మెరుపులతో, పిడుగుల శబ్దంతో, వర్షాకాలంలో దట్టంగా వాన కురుస్తుంటే, భయంతో గుండెలు ఉగ్గబట్టుకోవడం సర్వ సాధారణమైన విషయం. ఒక్కొక్కప్పుడు, ఆ భీకరధ్వనికి ' అర్జున, ఫల్గుణ.... ' నామాలను ఉచ్ఛరిస్తూ భయాన్ని పారద్రోలేందుకు ప్రయత్నిస్తుంటాము. ఆ లెక్కన, ప్రళయకాల మహోత్పాతాన్ని ఒక్కసారి మనం ఉహించుకోవచ్చు. ఆ వాతావరణాన్ని దీర్ఘమైన సంస్కృతసమాసాలతో అద్భుతంగా చిత్రించారు ఎఱ్ఱనగారు.
ప్రళయకాలంలో ఆవరించే మేఘాలకు సంవర్తం అని, పలాహకం అని పేర్లు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వశేషం, చతుర్థాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment