Friday 31 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 47. (నన్నయ భారతము: ఆదిపర్వం: ప్రథమాశ్వాసం)

నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము, జగన్నుత! విప్రులయందు, నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు, నో
పండతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.

" నిండు మనంబు " వంటి పద్యమునకు " నిండు మనంబు " పద్యమే సాటియని తిక్కన గారు ప్రశంసించిరని యొక కీర్తి పై పద్యమునకున్నదని విమర్శకులు శ్రీ కాజ లక్ష్మీ నరసిం హారావు గారు తమ " ఉదంకుని కథ: నన్నయగారి ఋష్యాత్మ " అనే వ్యాసంలో పేర్కొన్నారు.

నన్నయ ఆంధ్రీకరించిన   ఆంధ్రమహాభారతము, ఆదిపర్వములో ఉదంకుని కథ ఉన్నదిఉదంకుడు ఋషిపైలుని శిష్యుడుపౌష్యుడనే రాజు భార్య వద్దనున్న కుండలాలను గ్రహించాడురాజు ఉదంకుని " నీవు మాయింట గృతభోజనుండవై పొమ్ము " అన్నాడు. వడ్డించిన  అన్నములో వెంట్రుక వచ్చిందని, కోపించి, అపరీక్షితంబయిన అశుద్ధాన్నము పెట్టావు కనుక అంధుడవు కమ్మని శపించాడు ఉదంకుడుఅల్పదోషకారణంతో తనను శపించాడు గనుక, ఉదంకుని అనపత్యుడవు కమ్మని శపించాడు పౌష్యుడుతాను సంతానహీనుడుగా ఉండలేనని శాపాన్ని ఉపసoహరించమన్నాడు ఉదంకుడుతనకు శక్తి లేదని  చెప్పిన  పౌష్యుడు, బ్రాహ్మణునికి, క్షత్రియునికి గల  తారతమ్యాన్ని, మనోవిశ్లేషణాత్మకంగా చెప్పిన అద్బుతమైన పద్యమిది.

" బ్రాహ్మణుడు శాపానుగ్రహ సమర్ధుడుక్షత్రియుడు అట్లా కాదుదీనికి కారణం వారి వారి మనస్తత్వాలుబ్రాహ్మణుని మనస్సు అప్పుడే తీసిన వెన్నలాగా మెత్తనైనది. ఇక మాటంటారాఅతి పదునైన వజ్రాయుధం లాంటిది రెండూ, రాజు విషయంలో సరిగ్గా వ్యతిరేకంమనస్సేమో చాలా కఠినంగా ఉంటుంది, మాట మాత్రం తియ్యగా ఉంటుంది తారతమ్యం వల్ల, శాపమనేది మనసు లోతుల్లోనుంచి వస్తుంది కనుక, నవ్య నవనీత సమానమైన మనస్సు కల బ్రాహ్మణుడు, శాపాన్ని వెనక్కి తీసుకొని అనుగ్రహించగలడు. పని యెంత శాంతుడైన రాజయినా చేయలేడుకారణం అతని మనస్సేఅది అతి కఠినమైనది. "

ఎంత చక్కని మనోవిశ్లేషణ!

పద్యంలో విప్ర శబ్దం రెండుసార్లు ప్రయోగించబడ్డది.  " విశేషేణ పాపేభ్యః ఆత్మానం పరం పాతీతి విప్రఃఅని వ్యుత్పత్తి. " తనను, పరుని విశేషముగా పాపము నుండి రక్షించువాడు " అని అర్థముఋషి అయిన ఉదంకుని రూపమున యిది నిరూపింపబడినది

ఇక కథాంతర్గత శాపాల విషయానికి వస్తే, ధర్మాన్ని అనుష్ఠానం చేసే వారి శాపాలు కూడా ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా ఉంటాయి.

అపరీక్షితమయిన అన్నము పెట్టాడు గనుక, పౌష్యుడిని అంధుడివి కమ్మన్నాడు. పెట్టిన అన్నము శుద్ధంగా ఉందా లేదా అన్నది చూడవలసినది కన్నుకన్ను ఆపని సరిగా నిర్వర్తించలేదు కనుక కంటికి శిక్షఅల్పదోష కారణంబున యింత పెద్ద శాపమిచ్చాడు కనుక, ఉదంకుడిని అనపత్యుడవు కమ్మని శాపమిచ్చాడు పౌష్యుడుఅనపత్యుడు అంటే పిల్లలు లేకుండుటమరి యీ శాపం వెనుక ఉన్న హేతువు, ధర్మసూక్ష్మం యేమిటిపిల్లలున్నవారికి కష్టసుఖాలు, తప్పొప్పులు తెలుస్తాయిఉదంకుడు సంతానహీనుడయితే గాని, అతనికి చిన్న తప్పుకు యెంత పెద్ద శిక్ష వేశాడో తెలియదుఇదీ మన దేశపు ఋష్యాత్మ.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 46. (కుమారసంభవము)

స్ఫురదరుణాధరోరురుచి బొంది కరంబును రక్తుడై సితే
తరనయనాతిభాతి నసితద్యుతి జెల్వుగ నొంది నిర్మలో
త్కర దరహాసదీధితి సితప్రభ దాల్చి, మహేశ్వరుండు త్రై
పురుషము దానయైనగతి బొల్చె బురాంగన లోలి జూచుచోన్.

పద్యం నన్నెచోడదేవకృత కుమారసంభవము అష్టమాశ్వాసము లోనిదిశివుడు పార్వతిని పరిణయమాడడానికి ఓషధీప్రస్థపురానికి వచ్చినపుడు, పురాంగనలు మైమరచిపోయి శివుని చూస్తున్న సందర్భము లోనిది.

పురస్త్రీలు శివుని చూస్తున్నప్పుడు, వారి యెఱ్ఱని క్రింది పెదవి కాంతులు అతని పై బడి, మిక్కిలి యెఱ్ఱని వాడయిన బ్రహ్మగాను, వారి కనుల నల్లని కాంతిచే, విష్ణువుగను, వారి నిర్మలమయిన చిరునవ్వు తెల్లని కాంతిచే మహేశ్వరుడుగను - త్రిమూర్తిత్వమును దాల్చి - ప్రకాశించాడు.

  క్రింది పద్యము  ఎఱ్ఱనకృత ఆంధ్రమహాభారతాంతర్గత అరణ్యపర్వ శేషము లోనిది.

స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోయి నిరస్తనీరదా
వరణము లై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను
ద్ధురతరహంససారసమధువ్రతనిస్వనముల్ సెలంగగా
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ జూడగన్.

శరత్కాలంలో సూర్యోదయ సమయం కన్నుల పండువుగా ఉంటుందివర్షకాలపు కారుమేఘాలు తొలగిపోయి, బాలభానుడి అరుణకిరణాలు భూమిపై పడుతుంటాయిసరోవరాల్లోని పద్మాలు వికసిస్తాయిహంసలు, బెగ్గురుపిట్టలు, తుమ్మెదలు కమనీయ సంగీతాన్ని వినిపిస్తుంటాయి.

శరత్కాలపు రాత్రులను వర్ణించిన నన్నయగారి  "శారదరాత్రులుజ్వలలసత్తర తారకహార పంక్తులన్ " అనే పద్యము నడకలో సాగిన " స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరి వోయి " పద్యము, నన్నెచోడుని కుమారసంభవము, అష్టాశ్వాసములోని  " స్ఫురదరుణాధరోరురుచి బొంది కరంబును " పద్యము దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా గుర్తుకు వచ్చిందిఎఱ్ఱనకు ముందువాడయిన నన్నెచోడుని కవిత్వపు వెలుగు ప్రబంధపరమేశ్వరుని పైన  పడినదాఏమో......?  కానీ, ఇద్దరు మహాకవుల గంటముల నుండి జాలువారినవి యీ తేనెవాకలు అనడము నిర్వివాదాంశము.





సువర్ణ సుమన సుజ్ఞేయము - 45 (కుమారసంభవము)

కేవల కల్పనాకథలు కృత్రిమరత్నము లాద్యసత్కథ
ల్వావిరిపుట్టురత్నము లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వవృత్తములు సానల దీరిన జాతిరత్నముల్ 
గావున నిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పుపెంపునన్.

కేవలము కవి చేత కల్పింపబడిన కథలు కృత్రిమ రత్నముల వంటివిపురాణములయందు చెప్పబడిన కథలు పుట్టినవి పుట్టినట్లుగానే ఉన్న రత్నముల వంటివిఅనగా, గనుల నుండి తీయబడిన, శుద్ధిచేయబడని, ముడిఖనిజము వంటిది. కానీ, ఒక సత్కవి గ్రాఢ ప్రతిభచేత మెరుగులు దిద్దబడిన పూర్వకథలు సానబట్టిన రత్నముల వంటివికావున, అటువంటి మిశ్రకథను కావ్యరూపములో చెప్పమని తిరుమలరాయలు  కోరినట్లు వసుచరిత్రావతారికలో రామరాజభూషణుడు వివరించాడు

తెలుగు సాహిత్యములో కొన్ని పద్యాలు కవిత్వానికి సంబంధించి ఒక సిద్ధాంత ప్రతిపాదన చేసినట్లుగా కనబడతాయి.   ప్రాచీనాంధ్ర సాహిత్యంలో, పైన ఉదహరించబడిన రామరాజభూషణుని  పద్యము అటువంటిదేఆధునికులలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు, తమ " శ్రీమద్రామాయణ కల్పవృక్షము " అనే బృహత్కావ్యములో
 " మఱల నిదేల రామాయణం బన్నచో " అనే పద్యములో " కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు తొంబదియైన పాళ్ళు, ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయిరెట్లు గొప్పది నవకథాదృతిని మించి. " అని ఒక సిద్ధాంత ప్రతిపాదన చేశారు.


భట్టుమూర్తి అని పిలువబడే రామరాజభూషణుడు " నరసభూపాలీయము" అనే లక్షణ గ్రంథాన్ని కూడా వ్రాశాడు.

Thursday 30 January 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 44. (ఆంధ్రమహాభాగవతముదశమస్కంధము: )

కొలుతురు మర్త్యు లిష్టములు గోరి శిలామయ దేవసంఘమున్
జలమయ తీర్థసంఘమును సంతతము న్నటు వారు గొల్వగా
వలదనరాదుగాక భవత్పద భక్తులరైన మీ క్రియన్ 
సొలయక దేవతీర్థములు చూచిన యంతనె కోర్కులిచ్చునే.

పద్యంలో శ్రీవైష్ణవ సంప్రదాయములో మూలసూత్రమైన భాగవతుల సేవ యొక్క విశిష్టత చెప్పబడిందిశ్రీవైష్ణవులకు అతిథి, అభ్యాగత, భాగవత సేవ చాలా ముఖ్యమైనదిభగవద్భక్తులను సేవించడము  భగంతునికి ప్రీతికరమని, అందువలన, యీ మార్గంలో మోక్షధామాన్ని చేరడం చాలా సులభమని వారు ప్రగాఢంగా నమ్ముతారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు తమ ప్రబంధము " ఆముక్తమాల్యద " లో విష్ణుచిత్తుని వృత్తాంతంలో విశదపరిచారు.

కుబ్జ గృహాన్ని సందర్శించిన తరువాత, కృష్ణుడు అక్రూరుని ఇంటికి వెళ్తాడుఅక్రూరుడు విష్ణుభక్తుడుకృష్ణుణ్ణి అనేక విధాలుగా పూజించి, స్తుతించిన అక్రూరుణ్ణి ఉద్దేశించి కృషుడు పలికిన యీ మాటలు వర్తమానకాలంలో అతికినట్లు సరిపోతాయి.

మనిషై పుట్టినవాడికి కోరికలు సహజముకానీ, వర్తమాన సమాజంలో, యీ కోరికలకు ఒక అంతూపొంతూ లేకపోవడము చూస్తున్నాము కోరికలను సిద్ధింపజేసుకొనడానికి, మానవులు అనేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, లెక్కలేనన్ని పుణ్యనదులలో స్నానం చేయడము చూస్తూనే ఉంటాముఇక్కడ కృష్ణుడు చెప్పేదేమంటే, భగవద్భక్తుల దర్శనమాత్రం చేతనే  ఫలితము లభిస్తుంటే, కోరికలు తీరడము కోసం ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలను దర్శించడము, పుణ్యనదుల్లో మునగడము అవివేకమే గాక, దానివలన వారి కోరికలు ఫలించడము శుద్ధ అమాయకత్వమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాడు కృష్ణుడు.


పద్యము ఆంధ్రమహాభాగవతము దశమ స్కంధములో కనబడుతుంది.

ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like