Tuesday 31 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 9 (ఆముక్తమాల్యద)











సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రబంధము వర్ణనలకు పెట్టింది పేరుకృష్ణదేవరాయలవారి ప్రకృతి పరిశీలన చాలా నిశితమైనదిఆధునిక సమాజములో, పల్లెటూళ్ళలో వ్యవసాయము చేసుకుంటున్న  రైతులకు కూడా తెలియని పలు విషయాలు రాయలవారి వర్ణనలలో మనకు కనుపించి, ఆనాటి సాంఘిక వ్యవస్థను, రైతు  జీవనాన్ని మనోగోచరం  చేస్తాయిఉదాహరణకు, వివిధ రకములైన వరిధాన్య విశేషాలు ఒక పద్యంలో కనిపిస్తాయి. ఒక్క రాజనాలు తప్ప,   తీగమల్లెలు, ఖర్జూరాలు, పుష్పమంజరులు, మామిడి గుత్తులు, కుసుమాలు, సంపెంగలు, పచ్చలు , గన్నేరులు, పాళలు,   మొదలగునవి పుష్పజాతులని మనకు తెలుసుఇవి ఆనాడు రైతులు పండించిన వరిధాన్య రకాలని మనకు తెలియదుఇక, చాలామందికి తెలియని ఇంకొక విశేషం కూడా రాయలువారు పద్యంలో యెంతో రమణీయంగా చెప్పారు చూడండి.

అడుగున బండి వ్రీలి అసలై మధువుట్టగ ద్రాగుదేంట్లు
ల్లడి గొని చుట్టురా బనసల్చొలుచుంగలు గుండ్లతోడ నీ
డ్వడు పెనుబండ్లు, భిన్న కట పాంసుల భూరిమదాంబు సేచనా
జడ దృఢ శృంఖలాయుత వసంత నృప ద్విరదాధిపా కృతిన్.

శ్రీవిల్లిపుత్తూరులోని తోటలలో పనస.   చెట్లున్నాయి .   .  అవి వేరు పనస చెట్లుమనమందరం కొమ్మలకు కాసే పనస కాయలను చూశాము. ఇవి చెట్టు వేరుకు కాసే పనసపండ్లుపనస , పండుగా అయిన తరువాత, భూమి పగిలి, పండు రసం  కారితే, దానికి, చీమలు, తుమ్మెదలు మూగుతాయిఇక పనసపండ్లు యెంత పెద్దగా ఉన్నాయంటే, అవి పెద్ద బండరాళ్ళ లాగా ఉన్నాయి మొత్తం చూడడానికి ఎట్లాఉన్నదంటే, వసంతుడనే చక్రవర్తి యొక్క పట్టపుటేనుగు దవడలనుండి మదజలం స్రవిస్తూ ఉంటే, ఏనుగును కట్టివేసే గొలుసులాగా ఉంది తుమ్మెదల బారుఎంత చక్కని పోలికఎంత నిశితమైన దృష్టిపెద్ద పెద్ద బండరాళ్ళలాగా ఉన్న  పనసపండ్లు మదగజాల్లాగా ఉన్నాయటపండిన పెద్ద పనసపండు బూడిద రంగులో ఏనుగు లాగానే ఉంటుంది. పండు రసం  దాని చెక్కిళ్ళనుండి స్రవించే మదజలం లాగా ఉన్నదట..  పండ్లరసం చుట్టూ  మూగిన తుమ్మెదలబారు, ఏనుగును కట్టివేసిన గొలుసు లాగా ఉన్నదటఏనుగు దవడల నుండి కారే మదజలం చుట్టూ తుమ్మెదలు మూగడం మనకు తెలిసిన విషయమేఎంత సహజమైన వర్ణన.

శ్రీకృష్ణదేవరాయలవారి చలువ వల్ల, పనసపండు పండినట్లే తెలుగువారి పంట పండిందిమనం వారి కావ్యరసాన్ని జుఱ్ఱుకోగలుగుతున్నాము.


Saturday 28 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 8.(నన్నయ భారతము: ఆదిపర్వం: తృతీయాశ్వాసం)








అనుపమ నియమాన్వితులై యనూన దక్షిణల గ్రతుసహస్రంబులు సే
సిన వారికంటె నక్రోధనుడ గరం బధికు డండ్రు తత్వవిధిజ్ఞుల్.
అలిగిన, నలుగక యెగ్గులు పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్ 
వలుకక, బన్నము వడి యెడ దలపక యున్నతడు చూవె ధర్మజ్ఞు డిలన్.

ఆదికవి నన్నయ కవిత్వంలోని మూడు ప్రధాన లక్షణాలలో నానారుచిరార్థ సూక్తి నిధిత్వం ఒకటి.

పై రెండు పద్యాలు ఆంధ్ర మహాభారతము, ఆదిపర్వము, తృతీయాశ్వాసము లోనిది

రాక్షసులకు రాజయిన  వృషపర్వుని కూతురు  శర్మిష్ఠ, మాట పట్టింపుపై రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కూతురు దేవయానినిఒక పాడుబడిన నూతిలో పడదోస్తుందియయాతి మహారాజు సహాయంతో  నూతినుండి బయటకు వచ్చిన దేవయాని అవమానభారంతో నగరం లోనికి రావడానికి నిరాకరిస్తుందిఇది తెలిసికున్న శుక్రుడు కుమార్తె వద్దకు వచ్చి అనునయ వాక్యాలు పలికిన సందర్భ మిది.

"సాటిలేని నియమంతో కూడినవారై, యజ్ఞాలలో అనేక దక్షిణలు ఇచ్చిన వారికంటె, కోపము లేనివాడు మిక్కిలి గొప్పవాడని ధర్మము తెలిసినవారు చెబుతారు. ఇతరులు కోపిస్తే కోపించకుండా, నిందావాక్యాలు పలికితే మారు మాట్లాడకుండా, అవమానం పొందికూడా, దానిని మనసులో పేట్టుకోకుండా ఉన్నవాడే ధర్మము తెలిసినవాడు.", అని శుక్రాచార్యులు కుమార్తెను అనునయించడానికి ప్రయత్నిస్తాడు


మనిషిని  మనీషిగా తీర్చిదిద్దే ఇటువంటి పద్యాలు మనకు నన్నయ భారతములో విరివిగా కనిపిస్తాయి.

సువర్ణ సుమన సుజ్ఞేయము- 7. (శ్రీమద్రామాయణ కల్పవృక్షము: యుద్ధకాండము: ఉపసంహరణ ఖండము)










కోరి వశిష్ఠ హస్తగత కుంభ సముద్రనదీ మహాంబువుల్
ధారగ రామ మూర్థ కలితాల్ప జటాగుహలన్ స్రవింప జూ
డారతి నీలలోహిత  జటావనులందున జొచ్చుచున్న భా
గీరథినా జనెన్ గృతయుగీనము ధర్మము వాస్స్వరూపమై

ఇది కవిసమ్రాట్టులు విశ్వనాథ సత్యనారాయణగారి  శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధకాండము, ఉపసంహరణ ఖండము లోనిదిరావణ వధానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడౌతున్న శ్రీరామచంద్రుని గూర్చి చెప్పిన పద్యం ఇది.  

భూమండలము పైనున్న అన్ని సముద్రాలు, నదుల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో వశిష్ఠులవారు శ్రీరామచంద్రుణ్ణి అభిషేకిస్తున్నారుఅవి  అట్టగట్టియున్న రాముని జడలనే చిన్న గుహల నుండి ధారగా ప్రవహిస్తూ ఉంటే, చంద్రచూడుని జటావనులలో చొరబడుతున్న గంగా ప్రవాహముగా భాసిల్లి, కృతయుగమునుండి ధర్మము త్రేత లోనికి జలరూపములో   జాలువారుచున్నదా యన్నట్లున్నది.

విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షమును శివునకు అంకితమిచ్చారు. వారికి శివకేశవుల యెడల భేదభావము లేదు. చిన్ననాట వారు సేవించిన, వారి ఊరిలోనున్న వేణుగోపాలస్వామి, కాశీవిశ్వనాథుడు విశ్వనాధవారి యీ అద్వైత భావనకు  ఆలంబనముఇది సర్వత్ర వారి కావ్యమునందు భాసిస్తుంది. అందుకనే వారు తమ వేదనను యీ విధముగా వెలిబుచ్చారు.

నీళగళా! రఘూత్తముడు నీవును నిద్దరు కానియట్లుగా
నోలి భజించితిన్ మఱల నున్న దినంబులు నట్లె చేసెదన్
వ్రాలెడు మేను దాక నభవా! బ్రదుకైన వికారభావనా
జాలము తప్పకున్న దుదిజన్మగ జేయుము దీని ధూర్జటీ!

రామాయణ కల్పవృక్ష కావ్య రసాస్వాదనము జేయగలుగు నవకాశము కలిగిన జాతిలో పుట్టుట మన పూర్వజన్మ సుకృతము గదా!


Thursday 26 December 2019

సువర్ణ సుమన సుజ్ఞేయము - 6. (శ్రీమద్రామాయణ కల్పవృక్షము)













క్వచిదష్టాపద వర్ణసైకత, క్వచిద్గంభీర పాథస్కయున్
గ్వచిదుద్భ్రాంత విహంగసంతతి, క్వచిత్కాశ ప్రసూనాచ్ఛయున్
గ్వచితానీత తుషార శీతల, క్వచిత్కమ్ర స్వరవ్యాప్తయున్
గ్వచిదాకాశ విశాల భావకృతదృక్తాత్పర్య  కృష్టాత్మయున్

ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము లోని  గంగానది వర్ణన పద్యములో కవిసమ్రాట్టులు గంగానది నడకలను, హొయలను, సజీవ శబ్దచిత్రాలుగా మలిచారుసత్యనారాయణ గారి రచన కూడా గంగానది నడక వలె పలురీతులలో సాగిపాఠకుల ఊహకు బెత్తెడు దూరంలో ఉంటుందిఅట్టి శబ్దచిత్రాల అందాలను చదివిన  ప్రతిసారీ ఊహించవలసినదే గానీ, సంపూర్ణముగా వివరించడము సాధ్యము కాదు. ఎందువలనననగా, అది అనుభూతి విశేషము కనుకవిశ్వనాథవారి గతజనుస్సుల చెలిమికాడుగా అభివర్ణింపబడిన శ్రీ జువ్వాడి గౌతమరావు గారు తమ 'రామాయణ కల్పవృక్షచ్ఛాయ ' అనే వ్యాసములో పద్యములో నిక్షిప్తము చేయబడిన గంగానది నడకలనుఅద్భుతముగా దర్శింపజేశారుదానిని, నా మాటలలో మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను.

గంగానది కొన్నిచోట్ల పచ్చని బంగారము కుప్పలు పోసినట్లు ఉంటుంది. జనసంచారము లేని గాంగానదీ తీరం వెంబడినున్న ఇసుకతిన్నెలు యీ దృశ్యాన్ని తలపిస్తాయిఇక కొన్నిచోట్ల, గంగానది చాలా గంభీరంగా ఉండి సముద్రాన్ని తలపిస్తుందిఅటువంటి చోట, నది లోతును ఊహించడం కష్టంమరికొన్ని చోట్ల, నది విశాలమైన సమతల ప్రదేశంలో ప్రవహిస్తుండగా, బారులుగా మీద తిరుగాడే పక్షి సంతతి, వాటి  కూతలు ఊహించవలసినదే గానీ, మాటలకు అందవుకొన్నిచోట్ల, తీరం వెంబడి పెరిగిన తెల్లని రెల్లుచెట్లు సన్నని పిల్లగాలికి కదలాడుతుంటే, మాయాబజారు చలనచిత్రము లోని "లాహిరి లాహిరి లాహిరిలో, ఓహో జగమే ఊగెనుగా" పాట చిత్రీకరణను స్మృతిపథంలోకి తేవూ?   జలపాతము దగ్గర నిల్చొని జలపాతం అందాలను  తిలకిస్తున్నప్పుడు, చల్లని మంచు తుంపరలు శరీరానికి సౌఖ్యానుభూతి కలిగిస్తుందో, అటువంటి సౌఖ్యానుభూతినే కలిగిస్తుంది గంగానది కొన్నిచోట్లఒక చేతిని వీణ తంత్రుల మీద నుంచి, మరియొక చేతి వ్రేలితో వీణ మెట్లను నొక్కి లాగితే, పుట్టిన ధ్వని గుండె లోతుల లోనికి చొచ్చుకొనిపోయి, ఎటువంటి ఆనందాన్ని కలిగిస్తుందో, అటువంటి అనుభూతిని కలిగిస్తుంది గంగానది కొన్నిచోట్లఇక చివరి  పాదములోని " క్వచితాకాశ విశాల భావకృత దృక్తాత్పర్య కృష్టాత్మయున్". దీనిని గూర్చి జువ్వాడి వారు వ్యాఖ్యానించవలసినదే గానీ, ఇంకొక మార్గమున గాదు

" దీని యర్థమును భావింప వలసినదే గానీ చెప్పుట కష్టము. చెప్పుట పదబంధము కాఠిన్యము వలన కాదు. పదబంధము కాఠిన్యమును నిముసములో ఛేదింపవచ్చును. కానీ, ఒక గూఢమయిన, ప్రౌఢమయిన భావమును పట్టుకొనుట కష్టమునదీ వైశాల్యమెక్కువగా నున్నచోట, ఆవలి యొడ్డును ఆకాశము చుంబించుచుండగా, యీ నడిమి వైశాల్యమును భావింప గలిగినచో, కొంత యీ కల్పవృక్ష కవితావైశాల్యమును భావించినట్లగు ననుకొనుచున్నాను."

ఇట్టి వ్యాఖ్యానము నందించిన జువ్వాడి గౌతమరావు గారికి నమస్సుమాంజలులు.

ఇక్కడొక చిన్న మాటకాశీ, ప్రయాగ క్షేత్ర సందర్శన సమయమున, గంగాయమునలు తమ అందములచే అలరించినది నిక్కువమే గానీ, విశ్వనాథవారి గంగానది వర్ణన అవాచ్యమధురమైనదనుటలో సందేహము లేదు.


ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like