Wednesday 22 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 664 (మా స్వామి: 79)











నీ కారుణ్యము సాటిచెప్పెదను గానీ నిక్క మూహింపఁగా 
నీ కారుణ్యము సాటి దాని కదియే, నీ యీ కృపాలేశ మీ
నాకున్ దోచెను గించిదేతదుదితానందంబు దైనందిన 
ప్రాకట్యంబును బొందఁజేసి నను సంరక్షించు, విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై తొమ్మిదో పద్యం.

" విశ్వేశ్వరా ! నీ కరుణకు సాటి ఏదో తెలియచెబుతాను గానీ, నిజం చెప్పాలంటే, దాని కదే సాటి. నీ దయ అనేది యీ కొంచెం అయినా నాకు తెలిసిందినీ కృప వల్ల కలిగే ఆనందం, దైనందిన జీవితంలో నాకు అనుభవమయ్యేటట్లుగా చేసి, నన్ను చల్లగా కాపాడు తండ్రీ ! " 

పరమేశ్వరుడు ఆనందైకమయస్వరూపుడు ఆనందం కించిత్తు అనుభవమైనా జీవితం ధన్యమైనట్లేనని, దైనందిన చర్యలో బ్రహ్మానందానుభూతి  కొంచెం అయినా కలిగించమని విశ్వనాథ వేడుకొంటున్నారు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 663 (మా స్వామి: 78)








నీ కారుణ్యము కోసమై విధుర తంత్రీ వీణ వాయించు బా
లాకృత్యంబుగ నంగలార్చిన దినాలన్ నాదు జిహ్వాగ్ర వా
ణీకింక్లింకిణి నూపురస్వనము లెంతే దట్టమై పోయె నే
డీ కారుణ్యము చూచి నా కసలు నోరే రాదు విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఎనిమిదో పద్యం.

" విశ్వేశ్వరా ! నీ ఎడబాటు సహించలేక, పిల్లచేష్టగా, నీ కరుణ కోసం వీణ వాయిస్తూ అంగలార్చిన రోజుల్లో, నా నాలుక చివర సరస్వతీదేవి మధుర, మంజుల మంజీరనాదాలు యెంతో విరివిగా వినిపించేవిఇప్పుడు నీ కరుణ చవి చూసిన తరువాత, నా నోరు పెగలటం లేదు తండ్రీ ! "

విశ్వనాథ యువకుడిగా ఉన్నప్పుడు గిరికుమారుని ప్రేమగీతాలు, భ్రష్టయోగి మొదలైన ఉద్వేగభరితమైన భావకవిత్వ ఛాయలు కలిగిన రచనలు చేశారు. ఇప్పుడు పరిపక్వమైన జ్ఞానసమృద్ధ జీవితంలో, అటువంటి కవిత్వం రావటం లేదని, విశ్వనాథవారు అంటున్నట్లుగా అర్థం చేసుకొనవచ్చుయదార్థంగా, పరిపక్వదశలో, శ్రీమద్రామాయణ కల్పవృక్షం వంటి బృహత్కావ్యం పూర్తికావటం విశేషం.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 662 (మా స్వామి: 77)










నీకున్ సూడిద లిత్తు హృదయతంత్రీయుక్తనూవల్లకీ 
శ్రీకళ్యాణ మనోజ్ఞగీతములు తండ్రీ ! వాని నేఁ బాడుచో
నా కన్నుల్ బడివచ్చు బాష్పములు కంఠవ్యగ్రగాద్గద్యముల్ 
మై కేడించిన లేఁత చెమ్మటలు, రోమాంచాలు, విశ్వేశ్వరా !  

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఏడో పద్యం.

" విశ్వేశ్వరా ! హృదయనాడులతో కూడుకొన్న నా యీ శరీరమనే వీణ మీద కళ్యాణప్రదమైన మధురగీతాలు పలికించి, నీకు కానుక లిస్తాను తండ్రీ ! గీతాలను నే పాడుతూ ఉంటే, నా కళ్ళ వెంట అశ్రుధారలు కురుస్తాయి, గొంతు పూడుకుపోతుందిచిరు చెమటలు పోస్తాయి, ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది. " 

భక్తుడు, భగవద్భావనలో మైమరచిపోయినపుడు, కంటి వెంట అప్రయత్నంగా నీళ్ళు కారటం, గొంతు పూడుకుపోవటం, గగుర్పాటు కలగటం సహజమైన మార్పులు.   


Tuesday 21 July 2020

సువర్ణ సుమన సుజ్ఞేయము - 661 (మా స్వామి: 76)











దీర్ఘాధ్వమ్ము గమించి వచ్చి తడుగుల్ తే యొత్తెదన్, శీతలా
నర్ఘంబుల్ చిలికింతు నంజలిపుటం బందిమ్ము, హేమంత ప్రా
తర్ఘాసంబులు బిల్వపత్రములు మందారాది పుష్పాలు నీ
కర్ఘం బిచ్చెద, రమ్ము తీర్చెద పథాయాసంబు, విశ్వేశ్వరా !

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై ఆరో పద్యం.

" విశ్వేశ్వరా! చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ఏవీ, నీ పాదా లిట్లా పెట్టుకాసేపు, ఒత్తుతాను. ఏవీనీ చేతులు చాచుచల్లని నీళ్ళను చిలకరిస్తానుహేమంత ఋతువులో మంచుకు తడిసిన పచ్చని గరిక, బిల్వపత్రాలు, మందారపూలతో నీకు పూజ చేస్తానురా ! ఇట్లా వచ్చి కూర్చో ! నీవు ప్రయాణం చేసి వచ్చిన బడలిక తీరుస్తాను. " 

పద్యంలోని ప్రతి మాట, మనం అతిథి అభ్యాగతులకు చేసే సపర్యలను తలపింపజేస్తాయినిత్యపూజలో మనం చేసే షోడశోపచారాల పరమార్థం కూడా, మానవుడిలో మాధవుడిని చూడమని చెప్పటమే పద్యంలో, భక్తునికి, భగవంతునికి మధ్య కల ఆత్మీయతారాధనా భావం ప్రస్ఫుటమౌతుంది


సువర్ణ సుమన సుజ్ఞేయము - 660 (మా స్వామి: 75)










నను రక్షింపఁగ నీవు వచ్చి తవులే నా తండ్రి ! యీ చంద్రికల్
తనుకన్, శ్రీ నవగాంగవారి చినుకన్, తారుణ్యరేఖా వినూ
తన సౌందర్యము పిల్లతెమ్మెరలు చిందన్, నన్ను నానంద వా
సన పొందన్, మరి నీదు రాక గురుతింపన్ లేనె? విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై అయిదో పద్యం.

" విశ్వేశ్వరా ! నా తండ్రీనువ్వు నన్ను రక్షించటానికి వచ్చావ్ని తెలుసు. చంద్రకిరణాలు ప్రకాశించగా, గంగానది యొక్క స్వచ్ఛమైన నీటితుంపరలు చిందగా, యవ్వనంలోని  వినూత్నమైన నీ తనూసౌందర్యం చల్లని గాలి వీచగా, నన్ను ఆనందమనే సువాసన ఆవరించగా, నా మనస్సు నీ రాకను గుర్తించకుండా ఉంటుందా? " 

చంద్రుడు, గంగానది, శివుని సగుణాకారంలో భాగాలుఇక శివుడు నిత్యయవ్వనుడు.  ' శివ ' అన్న శబ్దం లోనే మంగళస్వరూపుడనే అర్థం ఉంది. శివుడు ఆనందమయ స్వరూపుడు. ముక్తి అంటే ఆనందసిద్ధి పొందటమే కనుక, కవిసమ్రాట్టులు బ్రహ్మానంద సిద్ధి కలగాలని కోరుకొంటున్నారు.


సువర్ణ సుమన సుజ్ఞేయము - 659 (మా స్వామి: 74)








స్విద్యత్ఫాలము, స్పందితాధరనవశ్రీ సద్య ఉద్వేగ భా
స్వద్యోషార్థము, చంచలభుజగరాజన్మంజుహారంబు, శౌ
క్లద్యుత్యూర్జిత దీపితావయవ సమ్లానంబు, నీ మూర్తి,
క్తాద్యుజ్జీవనరంహ మేమనుదు మద్భాగ్యంబు? విశ్వేశ్వరా

ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) లోని డెబ్భై నాలుగో పద్యం.

" విశ్వేశ్వరా ! స్వేదంతో కూడిన నీ నుదురు, ఇంచుక కంపిస్తున్న పెదవులతో, క్రొత్త అందాన్ని ఒలికిస్తూ, అప్పటికప్పుడు ఉద్వేగము పొంది ప్రకాశిస్తున్న, అర్థభాగమైన నీ స్త్రీరూపం, అందమైన కంఠహారంగా, కదులుతున్న నాగరాజు వాసుకి, శుక్లపక్ష వృద్ధిచంద్రుని కాంతిచేత వెలుగొందుతున్న నీ  అవయవ సంపద - వీటన్నిటితో కనిపిస్తున్న నీ రూపం - భక్తుల యొక్క జీవితాలను వెలిగింపజేసేదిభావనాజగత్తులో అటువంటి దివ్యదర్శనం చేయగలిగిన నా అదృష్ట మేమని చెప్పాలి. "

శివుడు అర్థనారీశ్వరుడు. స్వరూపం ప్రకృతిపురుషుల కలయికఅదొర మహాచైతన్యం. అందువల్ల, భావనలో, స్వరూప దర్శనం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది


ప్రియమైన పాఠకులకు నమస్కారపూర్వకంగా ఒక చిన్న మనవి. గూగుల్ వారు బ్లాగులో మార్పులు తేవటం వలన, వ్రాసిన దానిని, ఉన్నదున్నట్లుగా, పద్యపాద విభజన, పేరాగ్రాఫుల విభజనతో పోస్టు చేయటం కష్టంగా మారింది. ఇది బ్లాగులు నిర్వహిస్తున చాలామంది పడుతున్న ఇబ్బంది అని తెలియవస్తున్నది.. సాంకేతిక పరిజ్ఞానం శూన్యమైన నా వంటి వానికి మరీ ఇబ్బందిగా తయారయ్యింది. అయితే, జిజ్ఞాసువులైన పాఠకులు, నాతో పంచుకొనే ఆ రెండు ముక్కలకే ప్రాధాన్య మిస్తారు కానీ, అందచందాలకు కాదనే ప్రగాఢ విశ్వాసంతో, పద్యపాద విభజన ( \ ) గుర్తుతో, పేరాగ్రాఫు విభజన ( \\ ) గుర్తుతో, శీర్షిక ముందు, ( * ) గుర్తుతో, వివరణ ( + ) గుర్తుతో మీ ముందుంచుతున్నాను. ఇది ఇబ్బదికరమే. అయినా, పరిస్థితులు చక్కబడే వరకూ, ఇబ్బందిని సహృదయంతో భరిస్తారని ఆశిస్తున్నాను. * సువర్ణ సుమన సుజ్ఞేయము - 778 ( శ్రీమద్రామాయణ కల్పవృక్షము: సుందర కాండము: పూర్వరాత్ర ఖండము) \ఎవ్వరు వంపరాని ధను వీ దనుజేశ్వరుఁ డేగి వంపగా\ నొవ్వినయట్టిదాని నవనూతనబాలుడు వంచె రాముడా\ యెవ్వడు భార్గవుండు పరమేశ్వర శిష్యుడు మున్ను నిల్వ లే\ దెవ్వరు వానిముందుఁ బరమేశ్వరుడా రఘుమూర్తి తక్కగన్. \ \జనకజ చూడగా నతని శౌర్యము లోకువ కార్తవీర్యుఁ డ\ ర్జునుని పరాక్రమమ్మునకు శూరుడు రాముడు వేయిచేతులం \ దునఁ దనగొడ్డట న్నఱికె నూతన బాలుడు రాము నింక నే\ మనవలె సప్తతాళదళ నాద్భుతముల్ మలినాటి ముచ్చటల్. \ \ఈ యమ యెవ్వరో దితికులేశ్వరు నమ్మినచాన నిద్దురం\ బోయెడు వేళలో మొగలిపొట్టవలెన్ శయనించియున్న ద\ బ్జాయుత ముగ్ధముగ్ధ మధురాకృతి కాదని సీతయైన నీ\ తోయజనేత్ర కాదగును దూరపుభావన చేయకున్నచో.\ \అరరే కన్నుల వ్రేలు చున్నయది దుఃఖాంభోధి నిర్మగ్నయై\ తరుణీరత్నము సీత బ్రాతియుగ నిద్రాశూన్య రక్తాక్షియై\ సరగన్ వాక్కున రామ రామ యనుచు శబ్దించుచున్ మన్మనోం\ తర జీవంబువలెన్ నిరంతర దురంత ప్రౌఢ చింతామతిన్.\ + హనుమంతుడు లంకానగరంలో సీతాన్వేషణ చేస్తున్నాడు. పుష్పకంలో, నిద్రిస్తున్న స్త్రీలు కనుపించారు. అందులో ఒక దివ్యమైన ముఖకవళికలున్న స్త్రీని చూసి, సీత అని భ్రమపడ్డాడు. ఆ తరువాత, నిదానంగా తనలో తాను తర్కించుకొంటున్నాడు.\\ " ఎవ్వరూ వంచలేని శివధనుస్సును వంచటానికి వెళ్ళి, రావణాసురుడు భంగపడ్డాడు. అప్పుడు నూత్నయవ్వనంతో ఉట్టిపడుతున్న యీ రాముడు వెళ్ళి ధనుర్భంగం చేశాడు. పరమేశ్వరుని శిష్యుడైన భార్గవరాముడి ముందు ఒక్క దశరథరాముడు తప్ప యెవరూ నిలువలేకపోయారు.\\ జానకి దృష్టిలో రావణుని పరాక్రమం తక్కువ. ఇక కార్తవీర్యార్జునుని వెయ్యి చేతులను భార్గవరాముడు తన గొడ్డలితో నరికాడు. అటువంటి పరశురాముడి ముందు నిలబడగలిగిన యీ నూత్నయవ్వనంతో వెలుగొందే రాముడిని ఏమనాలి? ఏడు తాటిచెట్లను ఒక్క బాణంతో పెకలించిన అతడి ఆ తరువాత రోజుల్లోని ముచ్చట్లను గురించి యెంతని చెప్పాలి?\\ ఈ తల్లి యెవ్వరోగాని రావణుడిని నమ్ముకొన్న స్త్రీ. నిద్రపోయేటప్పుడు మొగలిపొట్టలాగా పడుకొని ఉంది. అంత లోతుగా పరిశీలన చేయకుండా ఉంటే, పద్మాల వంటి కన్నులు కలిగిన ముగ్ధమనోహరాకృతి సీతాదేవి ఒకవేళా ఈ దివ్యస్త్రీ అయితే కావచ్చునని అనుకోవటానికి ఆస్కారం ఉంది.\\ అయ్యో ! దుఃఖసముద్రంలో మునిగిపోయి, నిద్రలేకపోవటం వల్ల కళ్ళు ఎరుపెక్కి, నిరంతరం ' రామ, రామ ' అని రామనామస్మరణ చేస్తూ, రాముడే తన హృదంతర జీవమని, దుర్భరమైన శోకంతో ఉన్న సీతమ్మ తల్లి రూపం నా కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా ! "\\ హనుమంతుడు నిత్య జాగరూకుడు. బుద్ధిమదగ్రగణ్యుడు. విచక్షణాశీలి. అందువల్ల, మొదట మండోదరిని చూసి సీత అని పొరపాటుబడ్డా, వెనక్కి తిరిగి మళ్ళీ ఆలోచించుకొన్నాడు. నిరంతరం రాముని భావనలో మునిగిపోయి, దుఃఖతో ఉన్న సీతమ్మ ఈమె యెట్లా అవుతుందని విశ్లేషించుకొన్నాడు.\\ ఈ పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, సుందర కాండము, పూర్వరాత్ర ఖండము లోనివి.

like