మధుకరంబులు వుట్టె మధుకరంబులు గావు
రమణీయ వేణీభరములు గాని
శశిబింబములు వుట్టె శశిబింబములు గావు
మహితవక్త్రేందుబింబములు గాని
మెఱగుదీగలు పుట్టె మెఱుగుదీగలు గావు
లలితకోమలతనూలతలు గాని
చక్ర వాకులు వుట్టె జక్రవాకులు గావు
కఠినంబులగు చన్నుగవలు గాని
యనగ మందరకందరవ్యాప్తి చలిత
వార్థికల్లోలవీచికావర్తతతుల
నుద్భవిల్లిరి రంభాతిలోత్తమాదు
లప్సరస్త్రీలు దేవవేశ్యాజనములు.
పాలసముద్రాన్ని దేవదానవులు చిలికినపుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ విషాగ్నికి లోకాలు బలైపోకుండా, పరమశివుడు మ్రింగాడు. తరువాత, లక్ష్మీదేవి, చంద్రుడు, ధన్వంతరి, ఉచ్ఛైశ్రవమనే తెల్లని గుఱ్ఱం, ఐరావతం అనే తెల్లని ఏనుగు ఉద్భవించాయి.
హరవిలాసము కావ్యం షష్ఠాశ్వాసంలోని ఈ పద్యంలో అప్సరసల పుట్టుకను వర్ణించాడు శ్రీనాథ కవిసార్వభౌముడు.
క్షీరసాగరమథనంలో రంభ, తిలోత్తమ మొదలుగాగల అప్సరసలు పుట్టారు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే:
" పాలకడలిపై నల్లని తుమ్మెదలబారులు కనిపించాయి. అవి తుమ్మెదలబారులు కాదు, అందమైన స్త్రీల పొడవైన జడలు. చంద్రబింబాలు దర్శన మిచ్చాయి. కానీ అవి చంద్రబింబాలు కావు, సౌందర్యవతులైన స్త్రీల ముఖబింబాలు. మెరుపుతీగలు తళతళలాడుతున్నాయి. అవి మెరుపుతీగలు కాదు, సన్నగా, అందంగా ఉన్న తీగల్లాంటి శరీరాలు. చక్రవాకపక్షులు ఎగిరెగిరిపడుతున్నాయి. కానీ, అవి చక్రవాకాలు కాదు, గుండ్రంగా ఉన్న కఠిన స్తనద్యయం. ఈ ఉపమానాలను తలపిస్తూ, పాలసముద్రాన్ని చిలుకుతున్న మంథర పర్వత గుహలంతా నిండిపోయిన సముద్రము గాలితో పాటు, దేవవేశ్యలయిన రంభ, తిలోత్తమ మొదలైన అప్సరసలు ఉద్భవించారు. "
సీసపద్యమంతా అప్సరస స్త్రీల సౌందర్య వైభవంతో నిండిపోయింది. శృంగారనైషథకర్త కవిత్వంలో రసౌచిత్య సౌందర్యవర్ణనకు కొదవేమి ఉంటుంది.
No comments:
Post a Comment