నీ యొకసత్కృతిన్ సలుప నీవగు దింకొక రౌదు రెవ్వరో
చేయకయే సహాయపడి చేయఁగ రాదును దత్ఫలంబు రాఁ
జేయగరాదు లోకమున సేమము త్వాదృశులందు నిల్చెడున్.
జననీ ! యే మహనీయులైన నుపదేశం బిచ్చినన్ దానిభా
వనయున్ భావనగాఁగ నిల్చిన ఫలంబా ! దేవతామూర్తి ని
న్నునుబోలెం జనుదెంచి యాచరణమందుం జొన్ పకున్నన్ నినున్
నిను మన్నింతు నహల్యకన్నను హిమానీసత్కృపారాశిగన్.
ఏ వరయుగ్మ మీ వడిగి తే వరయుగ్మము రా జొసంగె నే
నా వరయుగ్మపాలనకృతార్థజనుష్కుఁడ నైతినేని నా
యా వరపాలనాత్త సుకృతాఖిలదివ్యత యందుఁ దల్లి ! శ్రీ
దేవత వీవు, నన్ననుమతింపుము నీదు పదార్చకుండుగా.
ఈ మూడు పద్యాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షము, అయోధ్యా కాండము, అభిషేక ఖండము లోనివి.
కైక రామునికి తాను దశరథుని వద్ద నుండి పొందిన వరాలను గురించి చెప్పింది. ఒక ప్రసంగంలాగా, దుఃఖాన్ని బయటకు కనపడనీయకుండా, ఉద్విగ్నతతో కూడిన గొంతుతో మాట్లాడుతున్న పినతల్లి కైకను కనుకొలకుల్లో నుంచి చూసిన రాముడు, మృదువైన కంఠస్వరంతో ఇలా అన్నాడు.
" అమ్మా ! నీ ఉపకారాన్ని నేనెలా మరువగలను? ఎవరైనా ఒక మంచి పని చేశారంటే, అది నీ వంటి వారి వల్లనే అవుతుంది. ఎవరో ఒకరు సహాయం చేయకుండా సత్ఫలాన్ని ఎట్లా పొందగలము? లోకకళ్యాణమనేది నీ వంటి వారిలోనే స్థిరంగా ఉంది.
అమ్మా! ఎవరైనా మహనీయులు చేసిన ఉపదేశం భావనారూపంలోనే నిలిచిపోయి, నీ వంటి దేవతామూర్తి దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉంటే, ఇక దాని ఉపయోగమేమిటి? అందుచేత, నిన్ను నేను అహల్యాదేవి కంటె అధికంగా, కృపారాశి పరమేశ్వరిగా భావిస్తాను.
నీవేవైతే వరాలు రాజు నడిగావో, ఆ రెండు వరాలు రాజు నీకిచ్చాడు. నే నా వరాలను పాలించి కృతార్థుడినైతే, ఆ సత్యవాక్పరిపాలన అనే పుణ్యఫలం పొందటమనే దివ్యత్వం కలిగించిన దేవతవు నీవే అవుతావు. అటువంటి పరమేశ్వరి పదార్చకుడిగా, నన్ను ఆ వరాలను అమలుచేయటానికి అనుమతించు. "
విశ్వనాథ వలె కైక పాత్రను సహృదయంతో అర్థం చేసుకొన్న వారు, రామాయణ భాష్యకారులెవరూ లేరు. అందుచేతనే కైక అడిగిన వరాలకు, రామావతార లక్ష్యానికి ఒక చక్కని హేతువును కైకేయి పాత్రచిత్రణలో కనబరిచారు విశ్వనాథ.
ఈ ఖండంలో కైకకు రామునికి మధ్య జరిగిన సంభాషణలు నేరుగా పాఠకుల హృదయాల లోనికి చొచ్చుకుపోయి, కైక పాత్రను వాల్మీకి మహర్షి ఏ విధంగా భావించారో, దానిని భాష్యకారునిగా ఋష్యాత్మయైన విశ్వనాథ ఏ విధంగా వ్యాఖ్యానించారో అవగతమౌతుంది.
No comments:
Post a Comment