అదియున్ బ్రహ్మకపాల నిర్గత సహస్రార ప్రభాపుంజమో !
అదియున్ రూపముపొంది నిశ్చలమునౌ నాహార్యకన్యాసుధా
స్పద రేఖాస్మిత మంజుభావమొ కృపాసర్వస్వ ! విశ్వేశ్వరా !
ఇది ' మా స్వామి (విశ్వేశ్వర శతకం) ' లోని నలభయ్యో పద్యం.
" కాంతులను విరజిమ్మే సానబెట్టిన రత్నం లాగా, వృద్ధిచంద్రుడిని తలపై ధరించినవాడా ! అది బ్రహ్మకపాలం నుండి వెలువడుతున్న సహస్రార కాంతి పుంజమో, లేక రూపాన్ని దాల్చి నిశ్చలంగా ఉన్న పర్వతరాజు పుత్రిక అయిన పార్వతీదేవి యొక్క అమృతాన్ని చిందించే చిరునవ్వు యొక్క సుందరమైన భావమో, తెలియకుండా ఉన్నది. అణువణువూ దయతో నిండియున్నవాడివి. నా హృదయంలో నిండియున్న ఆ వెలుగు ఏమిటో ఎరుక పరచు. "
ఏణాంకుడు అంటే నలుపురంగు జింకను చిహ్నంగా కలవాడు. చంద్రుడు. శుక్లద్వాదశి నాటి చంద్రుడు వృద్ధి చంద్రుడు. ఆ నాటి చంద్రుడు సానబెట్టిన రత్నం లాగా ఉంటాడు. శివుడు ఆ చంద్రఖండాన్ని శిరోభూషణంగా కలవాడు. శాణం అంటే సానబెట్టే ఒక పరికరం.
శివుని చేతిలోని పుఱ్ఱె, బ్రహ్మ యొక్క నాలుగో ముఖం. యోగశాస్త్రం ప్రకారం, అది జీవుని సహస్రారస్థానం. బ్రహ్మదండమని పిలువబడే వెన్నెముక ద్వారా, జీవుడు, మూలాధారంలో నిద్రాణమై ఉన్న శక్తిని ఉద్దీపింపజేసి, షట్చక్రములను వినిర్గమింపజేసి, సహస్రారంలో ఉన్న శివునితో అనుసంధానం చేయటమే యోగప్రక్రియ. సహస్రారం నుండి అమృతధారలు వర్షిస్తూ ఉంటాయి. అదే అమృతత్త్వసిద్ధి. అదే పరమానందస్థితి.
శివుడు అర్థనారీశ్వరుడు. వారిద్దరికీ అభేదము. శివశక్తుల కలయిక మోక్షప్రాప్తి, అమృతత్వసిద్ధి, ఆనందమయస్థితి.
No comments:
Post a Comment