అబ్బుర మేఁపారగఁ గట్టివేసితివటే భూమీజ దర్శింప సా
గరమున్ దూఁకి రమేశుదూతయయి రాఁగా నేడు నాపైన నా
శరముం దూయుమురా మరేమి యొనరించం జూతునో నిన్నిటన్.
ఇంద్రజియు బిల్ల కాకికి నేమితెలియు
రయ్య యుండేలు దెబ్బని యంతవాని
కొడుకవై యింతగఁ జెప్పికొనుట తగున
పగ్గములు వీడి నిలుమంచు బలుకుచుండ.
రావణ సైన్యానికి వానర సైన్యానికి మధ్య యుద్ధం జరుగుతున్నది. దూరంగా రథంపై ఇంద్రజిత్తు వెళ్తున్నాడు. " అడుగో ! వాడే ఇంద్రజిత్తు " అని, హనుమంతుడు, వాలి కొడుకు, అంగదుడికి చూపించాడు. బ్రహ్మాస్త్రంతో ఆంజనేయుడిని వాడు బంధించాడన్నది గుర్తుకొచ్చి, అంగదుడు కోపంతో ఇంద్రజిత్తు పైకి దూకబోయాడు.
" ఇంద్రజిత్తు ఎవరని నీ వడిగావని చూపించాను గాని, వాడితో మనకెందుకు పోనీ " అని హనుమంతుడు అంగదుడిని ఆపాలని చూసినా, ఆ మాటల్ని లెక్కచేయకుండా, తన తెల్లని దంతాలు విచిత్రమైన కాంతులు విరజిమ్ముతుండగా, అంగదుడు ఇంద్రజిత్తు దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు.
" అరే ! అంతటి సముద్రాన్ని దాటి, రాముని దూతగా, సీతాన్వేషణ కోసం వచ్చిన మా గురువుగారు ఆంజనేయుణ్ణి బ్రహ్మాస్త్రంతో కట్టేశావుటగా? ఏదీ, ఆ బ్రహ్మాస్త్రం నా పైన వెయ్యరా చూద్దాం ! మరి నిన్నేం చేస్తానో చూద్దువుగాని ! "
అంటూ అంగదుడు, ఇంద్రజిత్తు బండి గుర్రాలను, గుర్రం కళ్ళాలకు కట్టిన త్రాళ్ళని పట్టుకొని, ఇంద్రజిత్తు పోకుండా అడ్డంగా నిల్చున్నాడు. ఇంద్రజిత్తు నవ్వుతూ, " ఎవడివిరా నువ్వు? " అని అడిగాడు.
దానికి అంగదుడు, " నేనా? మీ నాయన కున్న పది గొంతులు గుర్రుపెట్టేటట్లు, ఏడు సముద్రాల ఉప్పునీళ్ళల్లో ముంచి, నీళ్ళు తాగించాడే, ఆయన పేరు ఎప్పుడైనా విన్నావా? నేనా మహావీరుడి కొడుకుని. ఒళ్ళు కొవ్వెక్కి , వీరమాహేశ్వరుడైన మా గురువుగారిని బంధిస్తావా? " అని గద్దించాడు.
ఇంద్రజిత్తు నవ్వుతూ, " పోరా ! పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. అంతటి వీరుడి కొడుకు నని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు. ముందు ఆ పగ్గాలు విడిచిపెట్టి , యుద్ధానికి రా . " అని అంగదుడిని కవ్వించాడు.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము, యుద్ధ కాండము, సంశయ ఖండము లోని ఇటువంటి సహజ సంభాషణలు, ఆంధ్ర సారస్వతాకాశంలో, తిక్కనగారి తరువాత, ఒక్క విశ్వనాథ లోనే చూస్తాము. విద్యున్మాలి, జంబుమాలి, మకరాక్షుడు మొదలైన రాక్షసవీరులకు, వానరవీరులకు మధ్య జరిగిన సంభాషణలను, విశ్వనాథ ఎంతో రమణీయంగా వర్ణించారు.
No comments:
Post a Comment