పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సాధు సజ్జనులను సంరక్షణము జేయ
దుండగీడుల నొగి దునిమి వైవ
ధర్మ రక్షణంబు ధాత్రిని జేయంగ
యుగము యుగము నందు నుద్భవింతు.
" యదా యదా హి ధర్మస్య " అనే శ్లోకానికి కొనసాగింపుగా, శ్రీకృష్ణుడు తాను భూమిపై అవతారమెత్తడానికి గల కారణాలను అర్జునుడికి వివరిస్తున్నాడు.
" సజ్జనులను సంరక్షించటం కొరకు, దుష్టులను శిక్షించటం కొరకు, ధర్మాన్ని బాగుగా స్థాపిoచటం కొరకు, నేను యుగ యుగము నందును అవతరిస్తూ ఉంటాను."
ఈ శ్లోకంలో భగవానుడు భూమిపై అవతరించటానికి మూడు కారణాలను పేర్కొన్నాడు. యదార్థంగా, ఈ మూడు అంశాలు విడి విడిగా చూడ నవసరం లేదు. సజ్జనులను రక్షించ వలసిన అవసరం, దుర్జనుల యొక్క అకృత్యాలు యెక్కువయినప్పుడు కలుగుతుంది. దుర్మార్గుల ఆగడాలు మితిమీరి పోయినప్పుడు, అవి ప్రజలకు కంటకప్రాయమౌతాయి. అప్పుడు, భగవానుడు భూమిపై అవతరించి, ధర్మాన్ని పరిరక్షించవలసి వస్తుంది. ఈ మూలసూత్రం, కృతయుగం నుంచి, త్రేతాయుగం వరకు, అన్ని కల్పాలలోను, దశావతార రూపాల్లో, మరల మరల సంభవించటం గమనించతగ్గది. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు నిర్గుణ పరబ్రహ్మము, సగుణాకారునిగా, అవతారమూర్తిగా భూమి పైన జన్మించటం పురాణగాథల వల్ల తెలుస్తున్నది.
ఈ శ్లోకంలోని మూడు ప్రధానమైన పదాలకు ఉపసర్గలు వాడటం గమనార్హం. అవి, పరిత్రాణాయ, వినాశాయ, సంస్థాపనార్థాయ అనేవి. ఈ ఉపసర్గలను వాడటం వల్ల, భగవానుడు ఒక విషయాన్ని సుస్పష్టం చేశాడు. అదేమిటంటే, దుష్టుల యొక్క దౌష్ట్యం బాగా పెరిగి, ధర్మానికి బాగా హాని జరిగినప్పుడు, సజ్జనులను బాగుగా రక్షించుట కొరకు అవతారమెత్తటం జరుగుతున్నది.
భగవంతుడు ఎంతో దయామయుడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఆయన సృష్టే. దుర్మార్గులను కూడా మంచిదారిలో పెట్టవలసిన బాధ్యత ఆయనదే. రుద్రాధ్యాయంలో ఇది చాలా చక్కగా చెప్పబడింది. అందువల్ల, భరించరాని స్థితి ఆసన్నమైనప్పుడు, ఆ స్థితిని చక్కబరచి, సమస్థితిని, ధర్మాన్ని మరల ప్రతిష్ఠించటం కోసం భగవానుడు అవతరిస్తాడనేది సువిదితం.
వేదోద్ధరణ కోసం అవతరించిన ఆదిమత్స్యం నుండి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి, ద్వాపర కలి యుగాల సంధికాలంలో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం వరకు, భగవంతుడు చేసినదంతా ధర్మ పరిరక్షణార్థమే. భగవంతుడు ధర్మస్వరూపుడు. ధర్మం యొక్క స్వరూపమే భగవంతుడు.
శ్రీమద్భగవద్గీతలోని జ్ఞాన యోగమనే నాలుగవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకమిది.
No comments:
Post a Comment