ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిగి, యేడు
విడిచి వర్తించువాఁడు వివేకధనుడు.
ఈ తేటగీతి శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసంలోని ' విదురనీతులు ' అనే భాగం లోనిది.
ఈ పద్యానికి తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన ఉద్యోగపర్వం మొదటి రెండు ఆశ్వాసాలకు డాక్టరు జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు వ్యాఖ్యానాన్ని అందించారు. దానిని ఇక్కడ యధతథంగా పొందుపరుస్తూ, వారికి కృతజ్ఞతాంజలులు సమర్పిస్తున్నాను.
" ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రోత్సాహములనే రెండింటినీ కదలనీయక జోడు చేసి, మిత్రులు, అమిత్రులు, తటస్థులు అనే మూడు వర్గాలనూ సామ, దాన, భేద, దండములనే నాలుగు ఉపాయాల చేత పూర్తిగా వశపరచుకుని, త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము, అనే అయిదు ఇంద్రియాలనూ జయించి, సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయములు, అనే ఆరింటినీ తెలిసికొని, వేట, జూదము, పానము, స్త్రీ, పారుష్యము, దండపారుష్యము, అర్థదూషణము అనే సప్తవ్యసనాలనూ విడిచి వర్తించేవాడు వివేకధనుడు.
దీనికి ఇంకో విధమైన అర్థం.
ఒకటి బుద్ధి. దీనికి వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో చేర్చి, ధర్మార్థకామాలనే మూడింటినీ బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములనే నాల్గింటితో మిక్కిలి వశపడేటట్లు చేసి, వాక్, పాణి, పాద, పా, యూపస్థలనే కర్మేంద్రియాల నయిదింటినీ గెలిచి, యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహాలనే ఆరు స్మార్త కర్మలను తెలిసి, ఆవరణం ( పంచభూతాలు), బుద్ధ్యహంకారాలు అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.
మరో విధమైన అర్థం.
ఒకటి సత్త్వం. రెండు రజస్తమస్సులు. మూడు ధన, దార, పుత్రేషణములు. నాలుగు, ధ్యాన, ధారణ, యోగ, సమాధులు. తక్కినవన్నీ పైన చెప్పబడినట్లే.
No comments:
Post a Comment