భావితశక్తిశౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర
త్పావకతాపితాఖిలవిపక్షులు నైన మహానుభావు లై
రావతకోటి ఘోరఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యెడున్.
కుండలములను అపహరించిన తక్షకుని వెంబడంచిన ఉదంకుడు, పాతాళలోకము నందున్న నాగప్రముఖులను ప్రస్తుతించాడు. ఆదిశేషుని, వాసుకిని స్తుతించిన తరువాత, ఐరావతమనే నాగలోక ప్రముఖుడిని స్తుతించిన పద్యమిది.
ఈ పద్యానికి కూడా శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తిగారిగారి వ్యాఖ్యానం అద్భుతమైనది.
తక్షకుడు ఉదంకుని యెడల తప్పు చేశాడు. ఆ తప్పు చేసినవాడు ఊరిలో పలుకుబడి కల కుటుంబానికి చెందినవాడి వంటివాడు. ఆ ఇంటిలోని పదిమంది అన్నదమ్ములలో పెద్దవాడు ఊరికి పెత్తందారు. కావున, అతడికి విన్నవించుకొనే పద్ధతి మర్యాదగా ఉండాలి. అట్టిదే శేషుని స్తుతించిన పద్యం. ఇక రెండవవాడు ఇల్లు దిద్దుకొని పోయేవాడు. అతడికి చెప్పే తీరు వేరుగా ఉంటుంది. అదే వాసుకిని స్తుతించిన పద్యం. తక్కిన అన్నదమ్ములందరు అగ్రహారపు బడితలు. పనీపాట లేకుండా, చిల్లరగా తిరిగేవాళ్ళు. అందులో, మనకు అపకారం చేసినవాడున్నాడు. యాదృచ్చికంగా, యీ బడితలందరు మనకు కనపడ్డారు. తప్పు చేసినవాడక్కడ లేడు. ఏదో కనపడ్డారు కదా అని యీ బడితలకు కూడా మన గోడు చెప్పుకోవాలి. ఐరావతమనే నాగలోక ప్రముఖుడిని స్తుతిస్తూ చెప్పిన పద్యం అటువంటిది.
' దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ ' అన్నది ' మీకేమీ పనిలేదు పాటలేదు. ఊరంతా గాలికి తిరుగుతుంటారు " అన్నటువంటిది. ' విపుల ప్రతాప సంభావిత శక్తిశౌర్యులు ' అన్నది ' వాళ్ళనీ వీళ్ళనీ అనవసరంగా చావగొడుతుంటారు, మిమ్మల్ని అడిగేవాళ్ళెవరూలేరు, అటువంటిది మీ ప్రతాపం ' అని ఎత్తిపొడుపు. ఇక మిగిలినది ' అపారవిషోత్కట కోపవిస్ఫురత్పావక తాపితాఖిల విపక్షులు ' . వారి కోపం మండుతున్న అగ్నిలాంటిది. అది విషాగ్ని. దానితో అందరినీ దహిస్తున్నారు. మహానుభావులు అంటే గొప్పవాళ్ళు. పైన రెండు సంస్కృత సమాసాలను ఐన అనే అవ్యయంతో అతకడంలోనే అందమంతా ఉంది. ' నాయనా! మీరు గొప్పవాళ్ళు; మీకు కోపమొస్తే మేము ఆగగలమా? ' అని పైకి ప్రశంసలా కనపడే నింద.
' ఐరావతకోటి ఘోరఫణిరాజులు మాకు ప్రసన్ను లయ్యెడున్ '. ఐరావత నాగవంశానికి చెందిన అసంఖ్యాకులైన సర్పరాజులు మాకు ప్రసన్నమగుదురు గాక! ' ఘోరఫణిరాజులు ' అనడంలో ' ఇంత ఘోరమైనవారు, ఇంత దుర్మార్గులు ' అని ధ్వనిస్తున్నది.
పాత్ర స్వభావాన్ని బట్టి పద్యాన్ని తీర్చిదిద్దడం నన్నయగారి ప్రత్యేకత.
ఈ పద్యం నన్నయ భారతం ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలో ఉంది.
No comments:
Post a Comment