న్మద బాల్యంబు నటించి, కంసముఖ నానాదైత్యులం ద్రుంచి బ
ల్లిదు డా యింద్రుని పారిజాత మిలకున్ లీలాగతిం దెచ్చి శి
ష్టదయాళుత్వము వూనియున్న హరి నిష్ఠం జెంది రప్పాండవుల్.
మహాభారతంలో, ధృతరాష్ట్రుడు ఒక్కొకసారి ప్రారబ్ధజీవిగా కనిపిస్తాడు. కుమారుని వ్యామోహంలో పడి, తెలిసి తెలిసీ, జాత్యంధతకు తోడు మానసిక అంధత్వాన్ని కూడా కొనితెచ్చుకున్నాడా అనిపిస్తుంది.
ద్రోణాచార్యుడు ధృష్టద్యుమ్నుని చేతిలో వధింపబడిన వార్త విని ధృతరాష్ట్రుడు చాలా దుఃఖించాడు. అతని మనస్సు పరి పరి విధాలుగా పోయింది. ఒకవైపు, కృపుడు, అశ్వత్థామ మొదలుగా గల మహావీరులు రక్షణకవచంగా ఉండగా ఇదిఎట్లా జరిగిందని ఆశ్చర్యపోయాడు. ఇంకొకవైపు, శ్రీకృష్ణుడి అండ, దండిగా ఉన్న పాండవులకు కొరత ఏమిటన్న యదార్థాన్ని గ్రహించాడనిపిస్తుంది.
" లోకరక్షణార్థం, యదువంశంలో పుట్టి, బాల్యాన్నంతా వ్రేపల్లెలో క్రీడార్థంగా గడిపి, కంసుడు మొదలైన రాక్షసులను చంపి, బలవంతుడైన ఇంద్రుణ్ణి జయించి పారిజాతవృక్షాన్ని భూమికి తెచ్చి, మంచివారిపై అపారమైన కరుణ కురిపించే శ్రీకృష్ణుని ఆశ్రయాన్ని పొందారు పాండవులు. "
ధృతరాష్ట్రుడు కృష్ణుడిని హరి అని పేర్కొనడం వల్ల, అతడు భగవంతుడని, ఆ భగవంతుని ఆశ్రయంలో ఉన్న పాండవులకు ఏ కొరత లేదని తెలుసు. కాకపోతే, తెలిసి తెలిసీ మోహాంధకారంలో తలవరకూ మునిగిపోయి, కొడుకుని సరైన దారిలో పెట్టలేకపోయిన ధృతరాష్ట్రుడు ఒక దురదృష్టజీవి.
శ్రీకృష్ణుని మహిమను చెప్పిన ఈ పద్యం, శ్రీమదాంధ్ర మహాభారతము, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్నది.
No comments:
Post a Comment