కలి దమయంతి బాప సమకట్టు బొరిం బొరి వాయనోప డా
లలన నుదీర్ణసౌహృదబలంబున; నిట్టులు రెంట జేసి య
న్నలుడు విమోహరజ్జుల బెనంగి గతాగతకారి అయిన యు
య్యెలయును బోలె నూఱడక యెంతయు బ్రొద్దు వినిశ్చితాత్ముడై.
నలదమయంతుల వివాహం జరిగిపోయిందని విన్న కలిపురుషుడు ఆగ్రహించాడు. ధర్మమూర్తియైన నలుడు అశౌచానికి పాల్పడ్డ ఒకానొక సమయంలో అతనిలో ప్రవేశించాడు. నలుడు ద్యూతప్రియుడన్న సంగతి తెలిసిన కలిపురుషుడు, ద్వాపరుడిని పాచికలలో ప్రవేశపెట్టాడు. పుష్కరుడనే రాజును ప్రేరేపించి, నలుడిని అతడితో జూడ మాడేటట్లు చేశాడు. రాబోయే అనర్థాన్ని ముందే గ్రహించిన దమయంతి పిల్లలను విదర్భకు పంపివేసింది. జూదంలో సర్వస్వం కోల్పోయిన నలుడు, దమయంతితో పాటు నగరం వెలుపల మూడు రోజులున్నాడు. ఆ సమయంలో, బంగారు రంగు రెక్కలతో తన ముందు తిరుగుతున్న పక్షులను, ఆహారం నిమిత్తం పట్టుకొనడానికి తన కట్టుకొన్న వస్త్రాన్ని వాటిపైన వేసాడు. వస్త్రంతో పాటు పైకెగిరిపోయిన పక్షులు, అవి నలుడు కట్టుకున్న బట్టలను కూడా హరించడానికి పక్షుల రూపంలో వచ్చిన పాచికలమని చెప్పాయి. తన దుస్థితికి చింతించిన నలుడు దమయంతితో పాటు అడవులకు వెళ్ళాడు. తనతో పాటు అడవిలో కష్టాలు పడటం సహించలేక, నలుడు దమయంతిని వదలి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకొని, ఆమె చీరలో సగం చించుకొని వస్త్రంగా ధరించాడు. కానీ, అతడి కాళ్ళు ముందుకు కదలలేదు. దమయంతిపై అతనికి గల ప్రేమ అనే పాశం కట్టిపడేసింది.
ఊగిసలాడిన నలుడి మనఃప్రవృత్తిని తెలియజేసేదే యీ పద్యం.
" కలిప్రభావం చేత దమయంతిని వదలి వెళ్ళటానికి పూనుకొనేవాడు. కానీ, భార్య యెడల గల స్నేహానుబంధం చేత వదలి వెళ్ళలేకపోయేవాడు. ఈ రెండు మానసిక స్థితుల మధ్య, అంటే కలిప్రభావం, అనురాగబంధం వల్ల, నలుడు, దమయంతిపై గల ప్రేమానుబంధం అనే త్రాళ్ళు గట్టిగా పెనవేసుకొని, ముందుకు వెనుకకు ఊయల లాగా, స్థిరనిశ్చయానికి రాలేక చాలాసేపు ఊగిసలాడాడు. "
మనస్సనేది చంచలమైనది. ఎప్పుడూ ఊగిసలాడుతూనే ఉంటుంది. విపత్కర సమయంలో, ఈ ఊగిసలాట ఇంకా ఎక్కువవుతుంది. ఉయ్యాల ఊపు ఎక్కువయిన కొద్దీ, వివేచనాశక్తి తగ్గుతుంది.
శ్రీమదాంధ్ర మహాభారతము, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో నలుని మనఃప్రవృత్తిని ' విమోహరజ్జుల ' అనే రూపకాలంకారంతోను, ' నలుడు ....ఉయ్యెలయును బోలె ' అనేచోట ఉపమాలంకారంతోను అద్భుతంగా చిత్రించారు నన్నయభట్టారకులు.
No comments:
Post a Comment