జ్జ్వల విభ్రమం బొప్ప గలశజుండు
కనక గోవృషసాంద్ర కాంతి కాంతధ్వజ
విభవ విలాసంబు వెలయ గృపుడు
మణిసింహ లాంగూల మహితకేతుప్రభా
స్ఫురణంబు మెఱయంగ గురుసుతుండు
రత్నశిలారశ్మి రాజిత కదళికా
మహిమ శోభిల్లంగ మద్రవిభుడు
వెడలి తమ తమ చతురంగ వితతు లెల్ల
నుచిత గతి నూల్కొనంగ జేయుచు గడంగి
సంగరోత్సవ సంభృతోత్సాహు లగుచు
నగుచు దగు మాట లాడుచు నడచి రెలమి.
పూర్వం మహావీరులు తమ రథాలకు జెండాలను అమర్చేవారు. ఆ జెండా మీద వారిని స్ఫురింపజేసే ఒక చిహ్నం ఉండేది. దూరం నుంచి చూడగానే, ఫలానా వీరుడని గుర్తు పట్టడానికి వీలుండేది.
కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవపక్షాన ఉన్న అతిరథ మహారథుల వైభవాన్ని, వారి రథాలకున్న కేతనముల ద్వారా తెలియజేసేదే ఈ పద్యం.
ముందుగా, ద్రోణాచార్యులవారి జెండా గుర్తు బంగారంతో నిర్మింపబడిన యజ్ఞవేదిక. కలశజుడు అంటే కుండలో పుట్టినవాడు. ద్రోణములో (కుండలో) పుట్టినవాడు ద్రోణాచార్యుడు. ఇక కృపాచార్యులవారి జెండా బంగారం కాంతితో మెరసిపోయే ఆబోతు విలాస వైభవం కలిగింది. గోవృషమంటే ఆబోతు. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ జెండా గుర్తు , వెలుగులు విరజిమ్మే మణి నిర్మితమైన సింహం తోక. మద్రదేశాధీశుడు శల్యుని జెండా గుర్తు , రత్నాల రాళ్ళతో ధగ ధగా మెరిసిపోయే అరటిచెట్టు. ఈ విధంగా ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు, రథాలపై వారి జెండాలు రెపరెపలాడుతుండగా, ముచ్చట్లు చెప్పుకొంటూ, అమితోత్సాహంతో, చతురంగబలాలతో కదనరంగానికి కదలివెళ్ళారు.
ప్రాచీన పురాణగాథలను పరిశీలిస్తే, ఈ నాడు పరిశోధనల ద్వారా వెలుగు జూసిన టెస్టు ట్యూబు శిశువు జననానికి నాంది ఆ నాడే కుంబోద్భవుని రూపంలో జరిగినట్లు తెలుస్తున్నది.
ఏది ఏమైనా, కొద్ది మార్పులతో ' నర్తనశాల ' వంటి చలనచిత్రంలో వాడుకొనబడి, తెలుగు ప్రేక్షకుల అభిమానానికి పాత్రమై , నాటకఫక్కీలో పామరులనుంచి పండితుల దాకా చక్కగా పాడుకొనే యీ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం లోనిది.
No comments:
Post a Comment