మన నడచుచు లోకనింద్యముల నుడుగుచు మీ
దని యొకని కలిమి కులుకక
మనుజులతో బొంది పొసగి మను టొప్పు నృపా!
సంజయ రాయబారం తరువాత, విదురుడు ధృతరాష్ట్రునికి చేసిన హితబోధ విదురనీతులుగా ప్రసిద్ధి పొందాయి. విదురనీతులలో మొదటి పద్యం ఇది.
ఈ పద్యంలో నాలుగు ముఖ్యాంశాలను విదురుడు పేర్కొన్నాడు. అవి, జనులకు అంగీకారంగా ఉండేటట్లు ప్రవర్తించడం, లోకులు నిందించే పనులు చెయ్యకుండటం, మన సంపద కంటె ఇతరుల సంపద ఎక్కువని ఈర్ష్య పడకుండా ఉండటం, అందరితో కలిసి మెలిసి బ్రతకటం అనేవి.
ఈ పద్యానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసానికి డాక్టరు జొన్నలగడ్డ మృత్యుంజయరావుగారు, సంపాదకవర్గం అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు.
" విదురుడు చేసే హితబోధ తత్కాలంలో ధృతరాష్ట్రుడి చిత్తవృత్తిని సంస్కరించి శాంతిని కూర్చేదీ, సర్వకాలాలలో లోకులకు హితం కలిగించేదీ కావటం విశేషం. అతడి బోధలో మూడంశాలు ముఖ్యంగా ఉన్నాయి. 1. లోకనీతి, 2. ధర్మప్రీతి, 3. దైవభీతి. ఈ మూడూ త్రికరణ శుద్ధితో పాటిస్తే చిత్తశాంతి కలుగుతుందని హితబోధ తాత్పర్యO. ఈ పద్యంలో లోకనీతికి సంబంధించిన ముఖ్యాంశాలు నాలుగు పేర్కొనబడ్డాయి.
అవి 1. జనులు మెచ్చుకొనేటట్లు ప్రవర్తించటం. 2. లోకులు నిందించే పనులు చేయకుండటం. 3. ఇతరులు తమకంటె బాగుపడుతున్నారే అని అసూయపడకుండ ఉండటం. 4. అందరితో కలిసి మెలిసి జీవించటం. ' యథారాజా తథా ప్రజా ' అని న్యాయం. ' యద్య దాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః : సయత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే " అని భగవద్గీత. అందువలన రాజు ప్రజలు మెచ్చుకొనేటట్లు ప్రవర్తించటం ప్రథమ నీతి. ధృతరాష్ట్రుడు లోభంతో పాండవులకు అన్యాయం చేసి అధర్మవర్తనుడని లోకంలో అపకీర్తి పొందాడు. ఆ అపకీర్తి అతడి అశాంతికి మూలం. రాజు ద్యూతం వంటి వ్యసనాలను అధికారికంగా గుర్తించి, వాటి వలన కలిగే ఫలితాలను ధర్మ పాలనలో భాగంగా పరిగణించటం వలన లోకనింద ఏర్పడుతుంది. నిందను లెక్కచేయకుండా వ్యవహరిస్తే మనస్తాపం తప్పదు. లోకనిందాకరమైన ద్యూత చర్యకు ధర్మప్రతిపత్తి కల్గించి పరిపాలనను కలుషితం చేశాడు. దాని ఫలితమే అనుభవిస్తున్నాడు. అసూయ మనస్సుకు చీడపురుగు వంటిది. ప్రవర్తనకు పాము కాటు వంటిది. పాండవ సంపదకు అసూయ పడి అన్యాయంగా దానిని దొంగిలించాలని కపట ద్యూతాన్ని జరిపి కలుషవర్తనులనిపించుకొన్నారు దుర్యోధనాదులు. ఆ పాపానికంతా అండదండలుగా నిలిచినవాడు ధృతరాష్ట్రుడు. అతడి మనస్సులోని అసూయయే అంతటి హాలాహలాన్ని పాండవ జీవితంలో నింపింది. పరుల సంపదను చూచి ఓర్వలేని ఆ చుప్పనాతి గుణం కట్టెలోని నిప్పువలె మనిషిని బూది చేస్తుంది. అందుకే ధృతరాష్ట్రుడికి అంతటి అశాంతి. కౌరవ పాండవులు నీరక్షీరాల వలె కలిసి ఉంటే వంశానికి మేలు. కానీ, ధృతరాష్ట్రుడి స్వార్థబుద్ధి దుర్యోధనుడి దుష్ట ప్రయత్నాలను మాన్పలేక వంశనాశనానికి దోహదం చేసింది. ధృతరాష్ట్రుడు లోకనీతికి ఆదర్శం కావలసిన శ్రేష్ఠుడు, ప్రభువు. అతడే నీతి తప్పాడు. నిందించదగిన పనులు చేశాడు. అసూయకు గురయ్యాడు. తమ్ముడి కొడుకులతో కలిసి ఉండలేకపోయాడు. ఈ నాలుగు దోషాలకూ గురి అయిన ధృతరాష్ట్రుడు పొందే మనస్తాపం స్వయంకృతాపరాధమే అని తాత్పర్యం. "
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాబారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment