బగు నెడ గూర్చుండి రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిగి కొలిచిన
జగతీవల్లభున కతడు సమ్మాన్యు డగున్.
పాండవులు అజ్ఞాతవాసానికి సన్నద్ధమయ్యారు. అప్పుడు, వారి కులగురువు, శ్రేయోభిలాషి అయిన, ధౌమ్యుడు వారికి అజ్ఞాతవాస కాలంలో, ఎట్లా సేవాధర్మం నిర్వర్తించాలో చెప్పాడు.
రాజసభ లోనికి ఎప్పుడూ పడితే అప్పుడు అకస్మాత్తుగా, అనుమతి లేకుండా ప్రవేశించకూడదు. ప్రవేశించిన తరువాత, తన అర్హతకు తగ్గ, తనకు నియమించిన ఆసనంలోనే కూర్చోవాలి. రూపం, వేషం, ఎబ్బెట్టుగా లేకుండా చూసుకోవాలి. సమయం సందర్భం చూసి మాట్లాడాలి.
ధౌమ్యుడు చెప్పిన వాటిల్లో నాలుగు విషయాలున్నాయి. మొదటిది, సభాప్రవేశం. అకస్మాత్తుగా, అనుమతి లేకుండా ప్రవేశిస్తే, అది అవిధేయత క్రిందకు వస్తుంది. రాజాగ్రహానికి కారణమౌతుంది. రెండవది, కూర్చొనే చోటు. తన అర్హతకు తగిన చోట, తనకు నిర్దేశించిన చోటనే కూర్చోవాలి. లేకపోతే, అది అనాగరక చర్యగా పరిగణింపబడి, విమర్శలకు లోనవుతుంది. మూడవది రూపం, వేషధారణ. రూపం ప్రసన్నంగా ఉండాలి. వేషధారణ ఎబ్బెట్టుగా ఉండకూడదు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, శ్రీయుతులు టి.రామకృష్ణమూర్తి, సూరం శ్రీనివాసులు తమ " భారత నిరుక్తి - తిక్కన సరసోక్తి " అనే గ్రంథంలో ఒక చమత్కారమైన మాటను ఉదహరించారు. సముద్రుడు చర్మం ధరించిన శివుడికి విషాన్ని, పట్టు పీతాంబరం కట్టుకున్న విష్ణువుకి లక్ష్మిని ఇచ్చాడట. అందుకే, " వస్త్రేణ వపుషావాచా విద్యయా వినయేనచ / వకార పంచకేనైవ నరః ప్రాప్నోతి గౌరవం. "
(వేషం, శరీరం, వాక్కు, విద్య, వినయం - ఈ అయిదింటితో గౌరవం ఏర్పడుతుంది.) అన్నారు. ఇక నాలుగవది. సమయం, సందర్భం చూసి రాజుని సేవించాలి. తనకు అనువయిన సమయం లభించినపుడే ప్రసంగించాలి. రాజు తనవైపు చూసినపుడే ప్రసంగించాలి. లేకపోతే, అది అప్రస్తుత ప్రసంగం, అధిక ప్రసంగం అవుతుంది. ఇతరుల విమర్శలకు లోనవుతుంది.
రాజులు సహజంగా అధికార దర్పాన్ని, అతిశయాన్ని, ఆగ్రహాన్ని, ప్రదర్శిస్తుంటారు. అందువల్ల, సేవకులు జాగ్రత్త వహించాలి. వినయ విధేయతలతో నడచుకోవాలి. లేకపోతే, వారి ఆగ్రహానికి గురవుతారు. అందువల్ల, ధౌమ్యుడు చెప్పినట్లు నడచుకుంటే, రాజుగారి మన్ననకు పాత్రులౌతారు.
అప్పుడు ధౌమ్యుడు చెప్పిన ఆ హితవాక్యాలు, ఇప్పుడు కూడా అధికార వర్గాల్లో అతికినట్లు సరిపోతాయి.
ధౌమ్యుడు చెప్పినట్లున్న ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభారతము, విరాటపర్వం, ప్రథమాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment