ధాత్రి సమస్తముం బృహదుదగ్రభుజాగ్రమునందు దాల్చు సత్
క్షత్రియు డెల్లవారలను గావను బ్రోవ బ్రభుండు; గావునన్
శత్రునిషూదనుం డతడు శక్రుడు నీశ్వరుడున్ విధాతయున్.
అత్రి అనే విప్రునికి గౌతముడు అనే మునికి మధ్య ఒక వివాదం ముదిరింది. అదేమిటంటే, అత్రి భూమిని పాలించే రాజును ఇంద్రుడిగాను, ఈశ్వరుడిగాను, బ్రహ్మడేవుడిగాను పొగిడాడు. ఒక మానవమాత్రుడిని ఆ రకంగా పొగడటం గౌతముడికి నచ్చలేదు. అత్రి దాన్ని మళ్ళీ సమర్ధించుకొన్నాడు. ఈ సమస్య ఇక్కడ తేలేదికాదని కాశ్యపుడు అనే ఋషి, తక్కిన మునులను, వారిద్దరినీ వెంటబెట్టుకొని సనత్కుమారుడి దగ్గరకు వెళ్ళాడు. సనత్కుమారుడంతా విని యీ విధంగా తీర్పునిచ్చాడు.
" అత్రి యదార్థమే చెప్పాడు. తరువాత అతడు దాన్ని సమర్థించుకోవడం కూడా సరైందే. ధర్మయుక్తంగానే ఉంది. ఈ భూమండలాన్ని సమర్థంగా తన భుజస్కంధాల మీద మోస్తూ, ప్రజలను రక్షిస్తూ, శత్రువులను నిర్జిస్తూ, ధర్మపరిరక్షణ చేసే సక్షత్రియుడైన ప్రభువును, ఇంద్రుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు అని పొగడటం ఎంతైనా సముచితం. "
" నా విష్ణుః పృధివిపతిః " అంటారు. భూమిని పాలించే రాజు విష్ణువుతో సమానమని అర్థం.
ప్రాసస్థానంలో రేఫంతో కూడిన, అంటే రకారంతో కూడిన తకారం, అదేవిధంగా, రేఫము పలు అక్షరాలతో పద్యమంతా సంచారం చేయడం, పద్యానికి క్రొత్త అందాన్ని తేవడమే కాక, సనత్కుమారుడు తన తీర్పును బల్లగుద్ది చెప్పినట్లయింది.
ఈ అత్రి గౌతముల సం వాదానికి తెరదీసిన సనత్కుమారుని తీర్పు, ఎఱ్ఱనచే పూరింపబడిన శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వశేషం, చతుర్థాశ్వాసంలో ఉంది.
No comments:
Post a Comment