యిది యెట్లు సెప్పు మని యడిగిన జె
ప్పనివాడును సత్యము సె
ప్పని వాడును ఘోర నరకపంకమున బడున్
శ్రీమదాంధ్ర మహాభారతము, ఆదిపర్వము, ప్రథమాశ్వాసం లోనిది ఈ పద్యం.
నన్నయగారి కవిత్వంలో మూడు ప్రథాన లక్షణాలను విమర్శకులు చూపారు. అవి, ప్రసన్నకథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తినిధిత్వము. ఈ పద్యంలో, రుచిరార్థ సూక్తినిధిత్వము ఉన్నది.
భృగువనే విప్రుని భార్య పులోమ గర్భవతి. ఒకరోజు, అతడు స్నానానికి వెళ్తూ, అగ్నికార్యం కోసం భార్యను అగ్నిని రాజేయమని చెప్పాడు. ఆ సమయంలో అగ్నిగృహంలో పొంచి ఉన్న పులోముడు అనే రాక్షసుడు ఆమెను మోహించి, ఆమె యెవరని అగ్నిని అడిగాడు. అగ్నిదేవుడు సంకటంలో పడ్డాడు. ఒకవైపున అసత్యదోషం, ఇంకొక వైపు భృగు శాపం అగ్నిని భయపెట్టాయి. అయితే, విప్రుని శాపానికి నివారణోపాయం ఉంది కానీ, అసత్యం పలకటం పాపహేతువని తలచి, అగ్నిదేవుడు పులోమ సOగతి చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు పులోమను ఎత్తుకొని, బహుదూరం, బహుకాలం పరుగెత్తాడు. పులోమ అట్లా పరిగెడుతూ ఉండగా, గర్భస్థ శిశువు జారి పడిపోయాడు. జారి పడటం వల్ల అతనికి చ్యవనుడు అనే పేరు సార్థకమయింది. కోటిసూర్య తేజస్సుతో వెలుగుతున్న చ్యవనుడు పులోముడి వంక చూడగానే వాడు కాలి బూడిద అయ్యాడు. కుమారునితో పాటు ఇంటికి తిరిగి వచ్చిన భార్యను అడిగి వివరాలు తెలుసుకొన్న భృగువు, ఈ అనర్థానికి కారణం అగ్ని అని గ్రహించి, అతనిని సర్వభక్షకుడివి అవమని శాపమిచ్చాడు. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన సమాధానమే ఈ పద్యం.
" తనకు తెలిసిన విషయాన్ని ఇతరులు ఎవరైనా ఇది ఎట్లా జరిగింది అని అడిగితే, తప్పకుండా చెప్పాలి. చెప్పటానికి నిరాకరించేవారునూ, అబద్ధం చెప్పేవారునూ ఘోరమైన నరకమనే బురదలో పడిపోతారు. "
ఇక్కడ అసత్య మాడటం ఎంత పాపమో సూచించబడింది. అది నరకహేతువు. అయితే ఇక్కడ, బురద వంటి నరకం అనకుండా, నరకమనే బురద అనడం వల్ల, నరకప్రాప్తి యొక్క దుస్సహతను నన్నయగారు సూచించారని భావించాలి. బురదను జలంతో ప్రక్షాళన చేసుకొనవచ్చు. కానీ, పాపం వల్ల వచ్చే నరకప్రాప్తి భరించరానిది. నరకమనే బురదను కడిగివేసుకోవాలంటే, బహుజన్మార్జిత పుణ్య జలం కావాలి.
ఇంకొక విషయం. సత్యం యెడల నన్నయగారి అనురక్తి ఇక్కడ గమనార్హం. అందువల్లనే, నన్నయగారు " తన కులబ్రాహ్మణు ............నిత్యసత్యవచను " అని రాజరాజనరేంద్రుడు అన్నట్లుగా అభివర్ణించుకొన్నాడు.
No comments:
Post a Comment