కోపము, నుబ్బును, గర్వము
నాపోవక నునికియును, దురభిమానము, ని
ర్వ్యాపారత్వము నను నవి
కాపురుషగుణంబు లండ్రు కౌరవనాథా!
శ్రీమదాంధ్ర మహాభారతము, ఉద్యోగపర్వం, ద్వితీయాశ్వాసంలోని ఈ పద్యం విదురనీతిలో భాగం.
కాపురుషులు అంటే చెడ్డవారు. చెడ్డవారి లక్షణాలను గురించి విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు.
విదురుడు ముందు కోపాన్ని గురించి చెప్పాడు. ఇది అరిషడ్వర్గాల్లో ఒకటి. ఇది మనిషి లోపల నున్న శత్రువు. కోపం చాలా చెడ్డది. కోపం వల్ల విచక్షణాజ్ఞానం పోతుంది. మంచిచెడుల విచక్షణ కోల్పోతే మనిషి పశువుగా మారతాడు. ఇది తనకే గాక, సమాజానికి కూడా చాలా ప్రమాదం.
రెండోది, ఉబ్బు. ఉబ్బు అంటే పొంగిపోవడం. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు క్రుంగిపోవడం ధీరుల లక్షణం కాదు. అది అల్పమానవులు చేసే పని. భగవద్గీత కూడా
దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగ భయక్రోధో స్థితధీ ర్ముని రుచ్యతే.-------- అంటుంది.
మూడవది, గర్వం. గర్వం మనిషి పతనానికి దారితీస్తుంది. మహానుభావులైన యయాతి, నహుషుడు వంటి వారు గర్వంతో మిడిసిపడి ఏ విధంగా పతనమయ్యారో మనం పురాణాల్లో చూసాము.
సంతృప్తి లేకపోవడం కూడా దుర్గుణమే. ఉన్నదానితో తృప్తి పడుతూ, ఇతరులకు ఉన్నంతలో సాయపడటం మానవుని కర్తవ్యం. సంతృప్తి లేని మనుజుడికి సప్తద్వీపాలు కట్టబెట్టినా కూడా ఆనందంగా ఉండడని పెద్దలు ఎబుతుంటారు. ప్రతిభాతో పైకి వచ్చి సమాజానికి ఉపయోగపడాలి కానీ, అందని మావిపండ్లకు అర్రులు చాచకూడదు.
అభిమానం మంచి లక్షణమయితే, దురభిమానం చెడ్డ లక్షణం. దుర్యోధనుడు దురభిమాని. అందుకనే చెడిపోయాడు. దురభిమానంతో దుష్టుల మాట విని చెడిపోయాడు. సజ్జనులైన భీష్మాదుల మాట వినక చెడిపోయాడు. " చెబితే వింటివ గురూ గురూ, వినకే చెడితిర శిష్యా శిష్యా! " అన్నది ఎక్కడ చెప్పినా, నిజమే కదా!
చివరగా, నిర్వ్యాపారత్వం. అంటే, సోమరితనం. సోమరులు, అంటే, పనీపాట లేకుండా, ఆంబోతుల్లా ఊరిమీద పడి తిరిగేవారు. ఇటువంటివారు, కుటుంబానికే గాక, సంఘానికి, దేశానికి ప్రమాదకారులు. సోమరితనం ఒక అంటువ్యాధి వంటిది. అటువంటి చీడపురుగులకు దూరంగా ఉండాలి.
దుర్యోధనుడి దుష్టత్వాన్ని, ధర్మరాజు మంచితనాన్ని మనసులో పెట్టుకొని అప్పుడు చెప్పిన విదురనీతులు ఇప్పటి సమాజానికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.
No comments:
Post a Comment