వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికి, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మన స్సరసీరుహాలికిన్.
" ఈ పద్యంలో వాడిన విశేషణాలన్నీ శివుని పరంగా వాడినవి. శివుడు నిరంతరం తాండవనృత్యం చేస్తుంటాడు. ఆయన కరుణా సముద్రుడు. త్రిశూలాన్ని ధరిచినవాడు. పర్వతరాజపుత్రికయైన పార్వతి ముఖపద్మాన్ని వికసింప చేసే సూర్యుడు. తలపై అర్థచంద్రుణ్ణి ధరించినవాడు. మెడలో పుఱ్ఱెల పేరు దాల్చినవాడు. మన్మథుని గర్వాన్ని అణచినవాడు. నారదుడు మొదలైన మునుల మనస్సనే సరస్సులో విహరించేవాడు. అట్టి దేవదేవునికి మిక్కిలి భక్తితో మ్రొక్కుతున్నాను. ", అని యీ పద్యానికి అర్థము.
పోతనగారు అంత్యప్రాసలు వాడడంలో దిట్ట. కేళికిన్, శూలికిన్, మాలికిన్, మౌళికిన్, ఉన్మూలికిన్, హాలికిన్ అన్న పదాలు, పద్యానికి అందాన్ని తెచ్చిపెట్టాయి.
నన్నయగారు మహాభారతము, పథమాశ్వాసములోని కచదేవయాని కథలో మొదటిసారి " వాడి మయూఖముల్ గలుగువాడు ", అని సూర్యునిపరంగా విశేషణాన్ని వాడారు. పోతన్నగారు కూడా ఇక్కడ " శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ " అని సూర్యుడి పరంగా దీర్ఘసమాసాన్ని వాడారు.
ఈ పద్యం శ్రీమదాంధ్ర మహాభాగవతము అవతారికలో నున్నది.
No comments:
Post a Comment