వీధులంబడి తిరిగి బూదియ మైఁజల్లుకొని పర్వులంబెట్టు కుఱ్ఱవోలె
నన్నమ్ముఁదించు మోమంతయుఁ బెరుఁగన్నమును జేసికొన్నట్టి బొట్టివోలెఁ
జిట్టి ! తలంటిపోసెద నన్న నందక తొలఁగి పర్వులు వెట్టు నులిపివోలె
వెల్ల దుస్తులు కట్టించి వీధులన్ షి
కారు పంపిన రాజకుమారువోలె
మింట నడుచక్కి జాబిల్లి మేదినీశు
నేత్రములకును జలువఁ బండించి పోసె.
కావ్యాలలో, ముఖ్యంగా ప్రబంధాలలో, చంద్రోదయ వర్ణన ప్రసిద్ధంగా కనిపిస్తుంది. అయితే, శ్రీమద్రామాయణ కల్పవృక్షములో విశ్వనాథ, చంద్రుడిని వర్ణించే తీరులో, విశిష్టత కనబరిచారు.
పుత్రసంతానప్రాప్తి కోసం దశరథునికి అశ్వమేథ యాగం చేయాలన్న భావన కలిగినప్పటి నుండి, యాగ సన్నాహాలు ఎంత వరకు వచ్చినాయో, దాశరథుల జననం, వారు పెరిగి పెద్దవారవుతున్నంతవరకు, చంద్రుడు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు, వివిధ దశలలో అద్భుతమైన వర్ణన చేశారు విశ్వనాథ.
ప్రస్తుతాంశానికి వస్తే, శాంత ఋష్యశృంగుల వివాహం జరిగింది. వారికి పుత్రసంతానం కూడా కలిగింది. ఋష్యశృంగుని అధ్వర్యంలో అశ్వమేథ యాగం జరిగి, తేజోవంతులైన నలుగురు కుమారులు దశరథునికి కలుగుతారన్న విషయాన్ని దేవయుగంలో సనత్కుమారుడు ఋషులకు చెబుతుండగా తాను విన్నానని, ఋష్యశృంగుని కథను చెప్పి, యాగం చేయడానికి ముందే ఋష్యశృంగుడిని అయోధ్యకు తీసుకు రావాలని, సుమంత్రుడు దశరథునికి చెప్పాడు. ఆ సందర్భంలో విశ్వనాథ చేసిన చంద్రవర్ణన ఈ సీసపద్యం భావం. దశరథుడు ఆకాశం వంక చూసినప్పుడు చంద్రుడు ఇలా కనిపించాడు.
" చక్కగా స్నానం చేయించి, ఉయ్యాలతొట్టెలో పడుకోబెట్టిన పసిపాపలాగా, వీధులలో పడి ఆడుకొంటూ వంటికి బూడిద వంటి తెల్లని మట్టి పూసుకొని పరుగెత్తే పిల్లవాడిలాగా, అమ్మ అన్నం తినిపిస్తుంటే, పెరుగన్నం మొహానికి పూసుకొన్న కొడుకు లాగా, " చిట్టితండ్రీ ! తలంటి పోస్తా రామ్మా ! " అంటే అందకుండా పారిపోయే అల్లరిపిల్లవాడిలాగా, తెల్లని దుస్తులు తొడిగించి, రాచవీధుల్లో షికారుకు పంపించిన రాజకుమారుడిలాగా, ఆకాశంలోని చంద్రుడు దశరథుడి కళ్ళకు చల్లదనాన్ని కురిపించాడు. "
" మదికి నుదాత్త కల్పనల మక్కువ గల్గిన, విశ్వనాథ శారద బహుళార్థదాయిని సురద్రువు రామకథన్ భజింపుమీ ! " అన్న ఋషివాక్కు అక్షరసత్యం.
No comments:
Post a Comment